ఉజ్జయిని: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి మహాకాళేశ్వరం ప్రహరీ గోడ కూలి ఇద్దరు మృతిచెందారు. ఆలయానికున్న గేట్ నంబర్ నాలుగుకు ముందు మహాకాళ్ లోక్ ఫేజ్ టూ సమయంలో నిర్మించిన గోడపై మరొక గోడను నిర్మిస్తున్నారు. భారీ వర్షానికి ఈ గోడ కూలిపోయింది.
ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారని, గోడలోని కొంత భాగం కూలిపోగా, దాని కింద నలుగురు సమాధి అయ్యారని ఉజ్జయిని కలెక్టర్ నీరజ్ కుమార్ సింగ్ తెలిపారు. వెంటనే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించి, బాధితులను శిథిలాల నుంచి రక్షించి జిల్లా ఆస్పత్రికి తరలించారన్నారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరిని చికిత్స నిమిత్తం ఇండోర్‌కు తరలించారని తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు చొప్పున, క్షతగాత్రులకు చికిత్స నిమిత్తం రూ.50 వేలు చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. మృతులను ఫర్హీన్ (22), అజయ్ యోగి (27)గా గుర్తించినట్లు సీఎంహెచ్‌వో ఏకే పటేల్ తెలిపారు. ఈ ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ సంతాపం వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. నిర్మాణ పనుల్లో జరిగిన అవకతవకలపై విచారణకు ఆదేశించారు.
ఇది కూడా చదవండి: ‘కేజ్రీవాల్ జైల్లో ఎందుకు రాజీనామా చేయలేదు?’
Comments
Please login to add a commentAdd a comment