లింగ నిర్ధారణ నియంత్రణలో ‘మహా’ మేటి!
ముంబై: స్త్రీ,పురుష నిష్పత్తిలో పెరుగుతున్న వ్యత్యానికి ప్రధాన కారణమైన లింగ నిర్ధారణ పరీక్షలను అడ్డుకోవడంలో మహారాష్ట్ర, దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఈ విషయంలో రాష్ట్రం చూపుతున్న ప్రత్యేక శ్రద్ధను కేంద్రమంత్రి గులామ్ నబీ ఆజాద్ పార్లమెంట్లో కొనియాడారు. లింగ నిర్ధారణ నియంత్రణ చట్టం-1994ను మహారాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తూ దేశంలోని మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు.
ఈ చట్టాన్ని అతిక్రమించి, లింగ నిర్ధారణ పరీక్షలు జరిపినవారిని మహారాష్ట్ర ప్రభుత్వం దోషులుగా ప్రకటించడమేగాకుండా సంబంధిత వ్యక్తుల లెసైన్సులను రద్దు చేస్తూ, పరీక్షలు జరిపే యంత్రాలను స్వాధీనం చేసుకుందని చెప్పారు. ఇటువంటి చర్యలు తీసుకున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలిచిందన్నారు. ఆజాద్ వెల్లడించిన గణాంకాల ప్రకారం...
గర్భ నిర్ధారణ నియంత్రణ చట్టం-1994 ప్రకారం దేశవ్యాప్తంగా 1,833 కేసులు నమోదైతే ఒక్క మహారాష్ట్రలోనే 527 మందిపై రాష్ట్ర పోలీసులు కేసులు నమోదు చేశారు. దేశవ్యాప్తంగా 143 మందిని దోషులుగా నిర్ధారిస్తే కేవలం మహారాష్ట్రలోనే 52 మందిని దోషులుగా నిర్ధారించారు. దేశంలోని వివిధ రాష్ట్రాన్నింటిలో కలిపి 65 మంది లెసైన్సులను రద్దు చేస్తే మహారాష్ట్రలోనే 37 మంది లెసైన్సులు రద్దు చేశారు. ఇక స్వాధీనం చేసుకున్న యంత్రాలలో కూడా.. మహారాష్ట్ర ముందుంది. దేశవ్యాప్తంగా 1,242 యంత్రాలను స్వాధీనం చేసుకోగా రాష్ట్రంలో 662 లింగ నిర్ధారణ జరిపే యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు.