అది వారి అభిప్రాయం!
దుబాయ్: టి20 ఫార్మాట్ నుంచి తాను తప్పుకోవాలంటూ పలువురు మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు చేస్తున్న విమర్శలపై మహేంద్ర సింగ్ ధోని తొలిసారి స్వయంగా స్పందించాడు. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్లుగా స్పష్టతనిచ్చాడు. ‘ప్రతీ ఒక్కరికీ జీవితంలో తమదైన సొంత అభిప్రాయాలు ఉంటాయి. వాటిని మనం గౌరవించాలి. భారత జట్టులో భాగం కావడమే అన్నింటికంటే ఎక్కువగా స్ఫూర్తినిచ్చే అంశం. సహజ ప్రతిభ లేని చాలా మంది క్రికెటర్లు ఎంతో సాధించడం కూడా మనం చూశాం. కేవలం ఆటపై ఉన్న పిచ్చి ప్రేమే దానికి కారణం. ప్రతీ ఒక్కరికి దేశం తరఫున ఆడే అవకాశం రాదు’ అని ధోని వ్యాఖ్యానించాడు. శనివారం ఇక్కడ ధోని తన సొంత అకాడమీ ప్రారంభించిన అనంతరం పలు అంశాలపై మాట్లాడాడు.
ఫలితాలకంటే ప్రక్రియపైనే ఎక్కువగా నమ్మకం ఉంచే తాను... ఫలితాలు తనకు వ్యతిరేకంగా వస్తే ఏం జరుగుతుందని తానెప్పుడూ భయపడలేదని చెప్పాడు. తన ట్రేడ్‌మార్క్ ‘హెలికాప్టర్’ షాట్‌ను నేర్చుకోమని ఈతరం కుర్రాళ్లకు ఎప్పుడూ చెప్పనని ధోని అన్నాడు. ‘రోడ్లపై టెన్నిస్‌బాల్ క్రికెట్ ఆడేటప్పుడు నేను ఆ షాట్‌ను నేర్చుకున్నాను. అది చాలా కష్టమైన షాట్. టెన్నిస్ బంతితో అయితే బ్యాట్‌పై ఎక్కడా తగిలినా అది దూరం వెళుతుంది కానీ సాధారణ క్రికెట్లో మాత్రం బ్యాట్ మధ్యలోనే బంతి తగలాలి. ఈ షాట్ ఆడే సమయంలో గాయాలపాలు అయ్యేందుకు చాలా అవకాశం ఉంటుంది కాబట్టి నేనెప్పుడూ అది నేర్పించను’ అని ధోని స్పష్టం చేశాడు.
పాండ్యాకు అప్పుడే విశ్రాంతా: గంగూలీ
కోల్‌కతా: శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ముందుగా ఎంపిక చేసి ఆ తర్వాత ‘విశ్రాంతి’ పేరుతో హార్దిక్ పాండ్యాను తప్పించడంపై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఘాటుగా స్పందించారు. ‘నిజంగా చాలా ఆశ్చర్యం కలిగింది. అతను గాయంతో ఉన్నాడా అనే విషయం నాకైతే తెలీదు. పాండ్యా కేవలం మూడు టెస్టులు మాత్రమే ఆడాడు. ఇది విరామం లేకుండా ఆడాల్సిన వయసు. కాబట్టి సరైన కారణం కూడా తెలీదు’ అని గంగూలీ అభిప్రాయపడ్డారు. మరోవైపు వన్డేలతో పోలిస్తే టి20ల్లో ధోని తడబడుతున్నాడనే విషయం అర్థమవుతోందని గంగూలీ అన్నారు. ఈ విషయంపై కోహ్లి, టీమ్ మేనేజ్మెంట్ ధోనితో విడిగా మాట్లాడాలి అని సౌరవ్ సూచించారు.