మహేశ్వరం నియోజకవర్గం చరిత్రను తిరగరాసేది ఎవరు..?
మహేశ్వరం నియోజకవర్గం
మహేశ్వరం నియోజకవర్గంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నాలుగోసారి విజయం సాదించి తన సత్తా చాటారు. హైదరాబాద్ పరిసరాలలో మొత్తం టిఆర్ఎస్ హవా కొనసాగగా మహేశ్వరంలో మాత్రం కాంగ్రెస్ ఐ పక్ష అభ్యర్ధిగా సబితా ఇంద్రారెడ్డి గెలుపొందారు.ఆమె తన సమీప టిఆర్ఎస్ ప్రత్యర్ధి తీగల కృష్ణారెడ్డిపై 9227 ఓట్ల మెజార్టీతో గెలిచారు. సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పక్షాన గెలిచినా, ఆ తర్వాత కాలంలో ఆమె టిఆర్ఎస్ లో చేరిపోవడం విశేషం.తదుపరి కెసిఆర్ మంత్రివర్గంలో సభ్యురాలు కూడా అయ్యారు. తన కుమారుడు కార్తిక్ విషయంలో కాంగ్రెస్ ఐ అన్యాయం చేసిందన్న బాద ఆమెకు ఉంది. మహేశ్వరం నుంచి 2014 లో టిడిపి పక్షాన గెలిచిన తీగల కృష్ణారెడ్డి కూడా ఆ తర్వాత టిఆర్ఎస్ లో చేరిపోతే,ఇప్పుడు సబిత కూడా అదే ప్రకారం అదికార పార్టీలోకి మారిపోయారు.
సబితా ఇంద్రారెడ్డికి 95481 ఓట్లు రాగా, తీగల కృష్ణారెడ్డికి 86254 ఓట్లు వచ్చాయి. ఇక్కడ బిజెపి తరపున పోటీచేసిన శ్రీరాములు యాదవ్ కు కూడా 38వేలకు పైగా ఓట్లు రావడం విశేషం. హైదరాబాద్ మేయర్ గా పనిచేసిన తీగల కృష్ణారెడ్డి 2014లో మహేశ్వరంలో. కాంగ్రెస్ ఐ అభ్యర్ధిగా రంగంలో ఉన్న ఎమ్.రంగారెడ్డిపై 30784 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. 2009 లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో ఆనాటి మంత్రి సబితా ఇంద్రారెడ్డి పోటీచేసి గెలుపొందగా 2014లో ఆమె పోటీలో లేరు. ఆమె కుమారుడు చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2014లో కాంగ్రెస్,సిపిఐ ల మధ్య పొత్తు కుదిరినా, మాజీ ఎమ్మెల్యే ఎమ్.రంగారెడ్డి కాంగ్రెస్ బిఫారం పై పోటీచేశారు. ఇక్కడ మూడుసార్లు రెడ్డి సామాజికవర్గం నేతలే గెలుపొందారు.
చేవెళ్ల చెల్లెమ్మగా ప్రసిద్ధికెక్కిన సబిత ఇంద్రారెడ్డి అంతకుముందు చేవెళ్ల నుంచి రెండుసార్లు గెలిచారు. 2009లో చేవెళ్ల రిజర్వుడ్ నియోజకవర్గంగా మారడంతో సబిత మహేశ్వరం నుంచి 2009, 2018లలో పోటీచేసి గెలిచారు. 2004 నుంచి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి క్యాబినెట్లో గనుల శాఖ మంత్రిగా ఉన్న సబిత 2009లో హోంశాఖ బాధ్యతలను చేపట్టి ఉమ్మడి ఏపీ రాష్ట్ర చరిత్రలో ఈ శాఖను నిర్వహించిన తొలి మహిళగా నమోదయ్యారు. రోశయ్య, కిరణ్ కుమార్‌రెడ్డి మంత్రివర్గంలోనూ ఉన్నారు. అయితే జగన్ ఆస్తుల కేసులో చిక్కుకున్న సబితా ఇంద్రారెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది.
ఈమె భర్త ఇంద్రారెడ్డి చేవెళ్ల నుంచి మూడుసార్లు టిడిపి పక్షాన ఒకసారి కాంగ్రెస్ పక్షాన గెలుపొందారు. ఆయన గతంలో ఎన్.టి.ఆర్ క్యాబినెట్లో వివిధ శాఖలు నిర్వహించారు. 1994లో ఇంద్రారెడ్డి కూడా హోంశాఖకు మంత్రిగా ఉన్నారు. ఈ రకంగా దంపతులు ఇద్దరూ ఒకే శాఖకు మంత్రులు అవడం కూడా అరుదైన విషయం. ఇంద్రారెడ్డి 1995లో టిడిపి చీలినప్పుడు ఎన్.టిఆర్ పక్షాన నిలిచారు. తరువాత కొంతకాలం ఎన్.టి.ఆర్ టిడిపి (లక్ష్మీపార్వతి)లో కొనసాగి అనంతరం కాంగ్రెస్‌లో చేరారు. అయితే రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఆ తరువాత జరిగిన ఉప ఎన్నికలో సబిత కాంగ్రెస్‌లోనే కొనసాగి నాలుగుసార్లు చట్టసభకు ఎన్నికయ్యారు.
మహేశ్వరం నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..