Mahit narayanana
-
అన్నయ్య భార్య ఆస్తులు అమ్ముకొని వెళ్లిపోయింది: చక్రి సోదరుడు
దివంగత సంగీత దర్శకుడు చక్రి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.ఇడియట్, అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి, సత్యం, శివమణి, దేశముదురు సహా పలు సినిమాలకు సంగీతం అందించి అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే 2014లో గుండెపోటుతో కన్నుమూశారు. ఇక చక్రి మరణించిన తర్వాత కుటుంబంలో ఆస్తి పరమైన ఇబ్బందులో తలెత్తి అది మీడియా వరకు రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. తాజాగా చక్రి సోదరుడు మహిత్ నారాయణ ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఆయన మాట్లాడుతూ.. ''చక్రి అన్నయ్య ఉన్నప్పుడు మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ ఆయన చనిపోయాక ఆస్తి గొడవలు వచ్చాయి. ఓవైపు అన్నయ్య లేడనే బాధకి తోడు ఈ గొడవలతో ప్రతిరోజు నరకం అనుభవించాము. అన్నయ్య ఆస్తుల్లో కొన్నింటిని ఆమె భార్య అమ్మేసుకొని అమెరికా వెళ్లిపోయింది. అక్కడే ఇంకో పెళ్లి చేసుకొని హ్యాపీగా సెటిల్ అయ్యింది. ఆమెతో మాకెలాంటి సంబంధాలు లేవు. మరికొన్ని ఆస్తులు కోర్టు కేసులో ఉన్నాయి'' అంటూ మహిత్ పేర్కొన్నాడు. తాజాగా ఆయన ‘పరారీ’ అనే సినిమాకు సంగీతం అందించారు. -
అయ్యో పాపం ‘చక్రి’ సోదరుడు.. సదరం కోసం ఎన్ని తిప్పలో..
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి సోదరుడు మాధవరావు అలియాస్ మహిత్ నారాయణ్ సదరం సర్టిఫికెట్ కోసం రెండేళ్లుగా తిప్పలు పడుతున్నాడు. లాక్‌డౌన్‌తో పాత స్లాట్ రద్దు కాగా.. కొత్త స్లాట్ బుక్ కాకపోవడంతో పడరాని పాట్లుపడుతున్నాడు. సర్కారు ఆసుపత్రిలో నిర్వహించే సదరం క్యాంప్‌లతో పాటు కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని సోమవారం విలేకరుల ఎదుట గోడు వెళ్లబోసుకున్నాడు. ఇదీ పరిస్థితి.. మహబూబాబాద్ జిల్లా కంభాలపల్లి గ్రామానికి చెందిన జిల్లా మాధవరావు ఉన్నత విద్యాభాసం కోసం నగరానికి వచ్చి ఇక్కడే స్థిరపడ్డాడు. ప్రస్తుతం ఆయన బంజారాహిల్స్‌లో నివాసం ఉంటున్నాడు. పుట్టుకతోనే వైకల్యానికి గురైన ఆయన వీల్‌చైర్‌పై దైనందిన కార్యకలాపాలు పూర్తి చేసుకుంటాడు. అయితే తనసోదరుడి వద్ద నేర్చుకున్న సంగీతంతో కొత్తగా మ్యూజిక్ స్టూడియో పెట్టుకునేందుకు వికలాంగుల కోటా కింద బ్యాంకు రుణం కావాలని కొద్దిరోజుల క్రితం ఆయన నగరంలోని ఓ బ్యాంకును ఆశ్రయించగా, సదరం సర్టిఫికెట్ తప్పని సరిగా ఉండాలని అధికారులు సూచించారు. వివిధ ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. సర్టిఫికెట్ కోసం రెండేళ్లుగా ఇబ్బందులు పడుతున్నానని, ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని ఆయన వేడుకుంటున్నారు. చదవండి👉 R Madhavan: నా తండ్రి గుర్తింపుతో బతకాలని లేదు: మాధవన్ కొడుకు వేదాంత్ -
కరోనా వారియర్ సాంగ్ విడుదల
సాక్షి, హైదరాబాద్: కరోనా వారియర్స్ వీడియో సాంగ్‌ను డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి చేతుల మీదుగా విడుదల చేశారు. డీజీపీ కార్యాలయంలో ఈ పాట విడుదల కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని నివారణకు పోలీసు శాఖ చేస్తున్న నిరంతర కృషికి స్పూర్తినిస్తూ.. ప్రముఖ దివంగత సంగీత దర్శకుడు చక్రి సోదరుడు మహిత్ నారాయణ్ ‘కరోనా వారియర్’ వీడియోను సాంగ్‌ను రూపొందించారు. (దశల వారిగా షూటింగ్స్‌ను అనుమతి: కేసీఆర్) నాలుగున్నర నిమిషాల నిడివి గల ఈ పాట విడుదల చేసిన సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. ప్రపంచాన్ని గడగడ లాడిస్తున్న కరోనా మహమ్మారి అంతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో పోలీసులు, వైద్యులు, మున్సిపల్ తదితర శాఖలు చేస్తున్న కృషికి ప్రోత్సాహంగా మహిత్ నారాయణ్ వీడియో సాంగ్‌ను రూపొందించడం పట్ల డీజీపీ అభినందించారు. బాలాజీ రచించిన ఈ పాటను గాయకులు మనో, గీతా మాధురిలతో పాటు తమిళ గాయకుడు టిప్పు, శ్రీకృష్ణ, సాయిచరణ్, నిహాత్, ఆదర్శిని, అంజనా సౌమ్య, హరిణ, బేబీలు పాడారు. (సినిమా షూటింగ్స్‌కు అనుమతి ఇవ్వండి) -
చక్రి స్టూడియోలో అగ్ని ప్రమాదం
హైదరాబాద్: దివంగత సంగీత దర్శకుడు చక్రి స్టూడియోలో సోమవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు కమలాపురి కాలనీలో ఉన్న స్టూడియోను పెట్రోలు పోసి దహనం చేయటంతో ఆస్తి నష్టం సంభవించిందని చక్రి భార్య శ్రావణి మంగళవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు.. కమలాపురి కాలనీలో చక్రి పేరుతో సీ-స్టూడియో ఉంది. కాగా, దీనికి సంబంధించిన తాళం చెవి శ్రావణి వద్దే ఉంది. సోమవారం జూబ్లీహిల్స్ పోలీసుల అనుమతితో ఈ స్టూడియోను తెరిచి కార్యకలాపాలు నిర్వహించారు. అయితే అర్ధరాత్రి 11 గంటల సమయంలో స్టూడియోలోంచి మంటలు వస్తున్నట్లు ఇంటి యజమాని రమేష్‌చంద్ తమకు సమాచారం అందించారని వివరించారు. అదే రాత్రి వచ్చి చూడగా స్టూడియో మొత్తం దగ్ధమై ఉందని శ్రావణి తెలిపారు. తాను స్టూడియోను నడిపించటం కొంత మందికి నచ్చడం లేదని.. దీని వెనుక తన అత్త, మరిది ప్రమేయం ఉందని ఆరోపించారు. వారి నుంచి తనకు ప్రాణహాని ఉన్న విషయం కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. స్టూడియో దహనం వెనుక కారణాలపై దర్యాప్తు చేయాలని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, గుర్తు తెలియని దుండగులు దాడి చేసినట్లు చక్రీ సోదరుడు మహిత్ నారాయణ కూడా మంగళవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గతరాత్రి చక్రి ఆఫీస్‌పై దాడి చేసిన దుండగులు అక్కడ ఫర్నిచర్‌ను దగ్ధం చేశారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.