ఈతకు వెళ్లి విద్యార్థి మృతి
శంషాబాద్ (రంగారెడ్డి జిల్లా): కొత్వాల్‌గుడలోని క్రషర్ గుంతలో ఈత కొడుతున్న నలుగురు విద్యార్థులలో మహ్మద్ ఇంతియాజ్(15) అనే బాలుడు నీటిలో మునిగి మృతిచెందాడు. ఈ సంఘటన మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. లంగర్‌హౌస్‌కు చెందిన నలుగురు పదవతరగతి విద్యార్థులు ఉదయం ఈతకోసం క్రషర్ గుంతకు వెళ్ళారు.
గుంతలోకి దిగిన వారు ఈతకొడుతుండగా లోతుకు వెళ్ళిన మహ్మద్ ఇంతియాజ్ మునిగిపోయాడు. తోటి స్నేహితులు అతనిని కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మహ్మద్ ఇంతియాజ్ మృతదేహాన్ని వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.