వాన.. హైరానా
సాక్షి, హైదరాబాద్: ఉపరితల ద్రోణి ప్రభావంతో మంగళవారం మూడోరోజు కూడా గ్రేటర్ హైదరాబాద్ నగరం తడిసి ముద్దయ్యింది. సాయంత్రం వేళ కురిసిన వర్షంతో పలు ప్రధాన ప్రాంతాలు జలమయమయ్యాయి. చాలాచోట్ల ప్రధాన రహదారులపై భారీగా వర్షపునీరు నిలిచిపోయి ట్రాఫిక్ భారీగా స్తంభించింది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు నరకయాతన అనుభవించారు. సోమాజిగూడ, ఖైరతాబాద్, పంజగుట్ట, లక్డీకాపూల్, ఎర్రమంజిల్, అబిడ్స్, నాంపల్లి, కూకట్పల్లి, మెహిదీపట్నం, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురవడంతో మోకాళ్ల లోతున నీరు నిలిచిపోయింది.
ఆ నీటిలోనే వాహనాలను ముందుకు కదిలించడానికి నగరవాసులు నానా అవస్థలు పడ్డారు. ఇళ్లల్లోకి నీళ్లు చేరడంతో బస్తీ వాసులు ఇబ్బందులు పడ్డారు. మంగళవారం రాత్రి 8.30 గంటల వరకు నగరంలో 7.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు బేగంపేటలోని వాతావరణ శాఖ తెలిపింది. రాగల 24 గంటల్లో రాష్ట్రంలోని పలుచోట్ల ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశాలున్నట్లు తెలిపింది.
పోచంపాడులో 10 సెంటీమీటర్ల వర్షపాతం
మరోవైపు రాష్ట్రంలో అనేకచోట్ల ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. గత 24 గంటల్లో నిజామాబాద్ జిల్లా పోచంపాడులో అత్యధికంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సూర్యాపేటలో 8 సెంటీమీటర్లు, సారంగాపూర్, మిర్యాలగూడ, నిర్మల్లో 7 సెంటీమీటర్లు, పరిగి, ఇల్లెందు, కమ్మరపల్లె, కూసుమంచిల్లో 6 సెంటీమీటర్లు, గంగాధర, తల్లాడలో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.