శ్రీవారికి పవిత్రాల సమర్పణ
సాక్షి,తిరుమల: తిరుమల ఆలయంలో సోమవారం వార్షిక పవిత్రోత్సవాల్లో భాగంగా పవిత్రాలు సమర్పించారు. తొలి రోజు తరహాలోనే రెండో రోజు కూడా యాగశాలలో హోమం నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేతుడైన మలయప్పస్వామికి అభిషేకం (స్నపన తిరుమంజనం), నైవేద్య, హారతులు పూర్తిచేసి ముందురోజు ప్రతిష్ఠించిన పట్టు పవిత్రాలను యాగశాల నుంచి ప్రదర్శనగా తీసుకెళ్లి గర్భాలయంలోని మూలమూర్తి కిరీటంపైన, మెడలో హారంగా, శంఖచక్రాలు, నందక ఖడ్గం, వక్షఃస్థలంలోని శ్రీదేవి, భూదేవులకు, కఠి, వరద హస్తాలు, పాదాలకు, భోగశ్రీనివాసమూర్తికి, కొలువు శ్రీనివాసమూర్తి, సీతారామ లక్ష్మణ, రుక్మిణీ, శ్రీకృష్ణులవారికి సమర్పించారు. అనంతరం జయవిజయలు, గరుత్మంతునికి, ఆనంద నిలయంపైన కొలువైన విమాన వేంకటేశ్వరునికి, ఆలయంలో, వెలుపల ఇతర పరివార దేవతలకు ఈ పట్టుపవిత్రాలు సమర్పించారు. ఇదిలావుండగా మూడో రోజు మంగళవారం∙పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగిస్తారు.