నిజాం షుగర్ ఫ్యాక్టరీకి ‘చంద్ర’ గ్రహణం
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనా కాలం మొత్తం జిల్లా అభివృద్ధికి గ్రహణం పట్టింది. వ్యవసాయం దండగన్న చంద్రబాబు రైతు ప్రయోజనాలను ఏ మాత్రం పట్టించుకోలేదు. జిల్లాలో లక్షల మంది నోళ్లను తీపి చేసే చెరకు ైరైతు బతుకు చేదుగా మారింది. రూ. 600 కోట్ల విలువ గల మూడు నిజాం షుగర్ ప్యాక్టరీలను టెండర్ లేకుండా రూ. 65.40 కోట్లకే అమ్మేశారు.
దీంతో నామ మాత్రపు ధరలకు ఫ్యాక్టరీలు ప్రైవేటు పరమయ్యాయి. సగం మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. చెరకు రైతు ప్రయోజనాలు ప్రైవేటు యాజమాన్యం దయాదాక్షిణ్యాలపై ఆధారపడ్డాయి. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నియమించిన సభాసంఘం నిజాం షుగర్ ఫ్యాక్టరీలను ప్రభుత్వ పరం చేయాలని సిఫార్సు చేసినా ఇంకా అమలుకు నోచుకోలేదు.
ఫ్యాక్టరీ అమ్మకాలపై సీనియర్ ఐఏఎస్ అధికారి పరేఖ్ ఇటీవల ఓ పుస్తకంలో విమర్శలు చేశారు. తాము అధికారంలోకి వస్తే చంద్రబాబు నిర్ణయాలపై విచారణ జరిపిస్తామని ఇటీవల కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో తిరిగి నిజాం షుగర్ ఫ్యాక్టరీ వివాదంపై చర్చ మొదలైంది.
రూ. 600 కోట్ల ఫ్యాక్టరీలను, ఆస్తులను రూ.65.40 కోట్లకు అమ్మేశారు
చెరకు రైతుకు..చేదుబతుకు
ఉపాధి కోల్పోయిన కార్మికులు
మెదక్, జహీరాబాద్, న్యూస్‌లైన్: అనాదిగా మెతుకు సీమ చెరకు పంటకు ప్రసిద్ధి. దీంతో 1987లో మంబోజిపల్లిలో నిజాం దక్కన్ షుగర్ ప్యాక్టరీని ఏర్పాటు చేశారు. ఫ్యాక్టరీ విజయవంతంగా నడవడంతో అటు రైతులకు ఇటు ప్రభుత్వానికి లాభాలు వచ్చాయి. అప్పట్లో ఆంధ్ర ప్రాంతంలో ఉన్న చెరకు ఫ్యాక్టరీలు నష్టాల్లో కూరుకు పోవడం, రాష్ట్ర సలహా ద్వారా కొనుగోలు ట్యాక్స్, ప్రోత్సాహక ధర పెంపు తదితర పరిణామాల నేపథ్యంలో వాటిప్రభావం తెలంగాణలోని ఫ్యాక్టరీలపైనా పడింది.
2000 సంవత్సరంలో ప్రపంచ బ్యాంకు షరతుల్లో భాగంగా మెట్పల్లి, శక్కర్‌నగర్, మంభోజిపల్లి షుగర్ ఫ్యాక్టరీలను ఎలాంటి టెండర్లు లేకుండానే ప్రభుత్వం గోల్డ్‌స్టోన్ కంపెనీకి రూ.65.40 కోట్లకే కట్టబెట్టింది. ఈ విషయంలో అప్పటి సీనియర్ ఐఏఎస్ అధికారి ఫరేఖ్ విభేదించినప్పటికీ ఆయన అభిప్రాయాన్ని పట్టించుకోకుండా మంత్రుల సిఫార్సు మేరకు చంద్రబాబు ఫ్యాక్టరీలను అమ్మేశారని ‘‘క్రూసేడర్ ఆర్ కాన్స్పిరేటర్’’ అనే పుస్తకంలో ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఫ్యాక్టరీల వాటా 51శాతం గోల్డ్‌స్టోన్ కంపెనీకి, 49శాతం ప్రభుత్వ ఆధీనంలో ఉండేలా 2002లో ఒప్పందం జరిగింది. ఏనిమిదేళ్లలో పూర్తి డబ్బును ప్రైవేట్ యాజమాన్యం ప్రభుత్వానికి చెల్లించి ఫ్యాక్టరీలను కైవసం చేసుకోవాలని సూచించారు.
ఉద్యోగాలు కోల్పొయిన 235మంది
చెరకు ఫ్యాక్టరీ ప్రైవేట్ యాజమాన్యానికి అప్పగించే సమయంలో సుమారు 235 మంది ఉద్యోగాలు కోల్పోయారు. చెరకు బిల్లులు కూడా సమయానుకూలంగా చెల్లించలేదనే ఆరోపణలున్నాయి. చెరుకు క్రషింగ్‌లో ఆలస్యమవుతుండటంతో చెరకు పంట ఎండి రైతులు నష్టాలు చవి చూడాల్సి వచ్చింది. యాజమాన్యం రైతుల పేరిట బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఫ్యాక్టరీలోని స్క్రాప్ కూడా అమ్ముకున్నారని రైతులు అప్పట్లో ఆందోళనకు దిగారు.
సభా సంఘం సిఫార్సు
వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చాక 2006 ఏర్పాటు చేసిన సభా సంఘం ఫ్యాక్టరీ అమ్మకం విషయంలో అవకతవకలు జరిగాయని తేల్చింది. వెంటనే ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు చెరకు రైతు పోరాట సమితి నాయకులు కోర్టును ఆశ్రయించారు.
కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం చివరి రోజుల్లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో రైతుల అభిప్రాయాలు తెలుసుకొని నిజాం షుగర్ ఫ్యాక్టరీ విషయం తేల్చాలని సూచించారు. కొంతమంది మంత్రులు ప్రైవేటీకరణ కోసం ప్రయత్నిస్తున్నారంటూ పోరాట సమితి 2014 జనవరి 9న కోర్టును ఆశ్రయించింది. అదేరోజు మంత్రివర్గ సంఘ సభ్యులు నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వ పరం చేయాలని సిఫార్సు చేశారు.
అయితే ఈ సిఫార్సును ఆమోదించినట్లు వార్తలు వెలువడినప్పటికీ అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. దీంతో రైతులు మాత్రం వెంటనే ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
కారు చౌకగా అమ్మేశారు
జహీరాబాద్: జహీరాబాద్‌లోని నిజాం చక్కెర కర్మాగారాన్ని కూడా చంద్రబాబు అప్పనంగా అమ్మేశారు. ప్రభుత్వ ఆస్తులు కారు చౌకగా అమ్మడమే కాకుండా కర్మాగారంలో పనిచేసే కార్మికుల బతుకులు రోడ్డుపాలయ్యాయి. ఈ కర్మాగారాన్ని చంద్రబాబు కేవలం రూ.18.5 కోట్లకే విక్రయించారు. 2002 నవంబర్‌లో నిజాం చక్కెర కర్మాగారం ప్రైవేటుపరమైంది. కర్మాగారం, కర్మాగారం కింద 72.10 ఎకరాల భూమి ఉంది. 30 ఎకరాల విస్తీర్ణంలో క్వార్టర్లు ఉన్నాయి. అంతా కలిపి వంద ఎకరాలకు పైగా భూమి ఉంది.
ఇంత మేర ఉన్న ఆస్తులను ఇంత తక్కువ ధరకు విక్రయించడం వెనుక స్వ ప్రయోజనాలున్నాయనే విమర్శలున్నాయి. కొనుగోలు కోసం సంగారెడ్డిలోని గణపతి చక్కెర కర్మాగారం యాజమాన్యం బిడ్ వేసి దక్కించుకుంది. 2006లో గణపతి చక్కెర కర్మాగారం యాజమాన్యం విక్రయానికి పెట్టింది. తమిళనాడులోని రాజశ్రీ గ్రూప్ కర్మాగారం 2006 ఏప్రిల్‌లో దీనిని కొనుగోలు చేసింది.
రాజశ్రీ యాజమాన్యం కర్మాగారాన్ని రూ.61 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం కర్మాగారం, ఆస్తులు కలుపుకుని రూ.200 కోట్లకు పైగా ఉంటుందని చెరకు రైతుల అంచనా. విలువైన ఆస్తులను ఇంత తక్కువ ధరకు విక్రయించడం వెనుక చంద్రబాబు స్వప్రయోజనాలున్నాయని చెరకు రైతులు ఆరోపిస్తున్నారు.
కార్మికుల బతుకులు రోడ్డుపాలు
ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయడంతో కర్మాగారంలో పని చేస్తున్న కార్మికుల బతుకులు వీధుల పాలయ్యాయి. కర్మాగారంలో 400 మంది కార్మికులు, అధికారులు పని చేసే వారు. కర్మాగారాన్ని కొనుగోలు చేసిన యాజమాన్యం కార్మికులకు వీఆర్ఎస్ ప్రకటించింది.
దీంతో 290 మంది వెళ్లిపోయారు. అలా వెళ్లిన వారికి ఎక్కడా అవకాశాలు లభించక పోవడంతో రోడ్డున పడ్డారు. వీఆర్ఎస్లో తీసుకున్న డబ్బులన్నీ ఖర్చయిపోయి బతుకులు దిన దిన గండంగా మారాయి. వీరిలో 15 మంది మానసికంగా కృంగిపోయి మరణించారని తోటి కార్మికులు చెప్పారు.
రైతుల పాలిట శాపం
జహీరాబాద్ ప్రాంతంలో చెరకును రైతులు అధికంగా సాగు చేస్తున్నందున 1972లో నిజాం చక్కెర కర్మాగారాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం జహీరాబాద్ జోన్ పరిధిలో సుమారు 12వేల మంది చెరకు రైతులున్నారు. ప్రభుత్వ పరంగా కర్మాగారాన్ని నిర్వహించి ఉంటే చెరకు పంటకు గిట్టుబాటు ధర లభించే అవకాశం ఉండేదంటున్నారు.
చక్కెర ధర అధికంగా ఉన్నా ప్రైవేటు యాజమాన్యం చెరకు పంటకు మాత్రం గిట్టుబాటు ధర కల్పించడం లేదంటున్నారు. కర్మాగారం ప్రైవేటు పరం కాకుండా ఉండి ఉంటే గిట్టుబాటు ధర లభించేదన్నారు.