రుణమాఫీ జాబితాలో పేర్లు చేర్చండి
మానకొండూర్: రుణమాఫీ జాబితాలో తమ పేర్లు చేర్చాలని డిమాండ్ చేస్తూ మండలంలోని ఈదులగట్టెపల్లి, చెంజర్ల, పోచంపల్లి, ఊటూరు గ్రామాలకు చెందిన రైతులు మంగళవారం మానకొండూర్ యూనియన్ బ్యాంకు ఎదుట ఆందోళనకు దిగారు. మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన రైతులు కొన్నేళ్లుగా జిల్లా కేంద్రంలోని ఇండియన్ బ్యాంకు ద్వారా పంట రుణాలను తీసుకుంటున్నారు. ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించడంతో తమ రుణాలు మాఫీ అవుతాయని రైతులు భావించారు.
అర్హులను ఎంపిక చేసే క్రమంలో అధికారులు ఇటీవల గ్రామాల్లో సామాజిక తనిఖీ చేపట్టారు. ఇండియన్ బ్యాంకులో రుణాలు పొందిన వారి పేర్లు లేకపోవడంతో రైతులు వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రుణమాఫీ గడువు ముగిసిందని, తమకేం తెలియదని మండల కమిటీ సభ్యులు చెప్పడంతో ఆందోళన చెందిన రైతులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. రుణమాఫీ జాబితాలో సదరు రైతుల పేర్లు చేర్చాలని ఉన్నతాధికారుల ద్వారా మండల కమిటీకి ఆదేశాలు అందాయి. జాబితాలో పేర్లు చేర్చడం లేదని, తమ గోడు పట్టించుకోవడం లేదంటూ స్థానిక బ్యాంకు ఎదుట రైతులు నిరసన వ్యక్తం చేశారు. తమ పేర్లను రుణ మాఫీ జాబితాలో చేర్చాలని రైతులు డిమాండ్ చేశారు. బ్యాంకు అధికారి లేక పోవడంతో వెనుదిరిగి పోయారు.