బీజేపీలో చేరిన మందా మాత్రే
సాక్షి, ముంబై: మాజీ ఎమ్మెల్సీ, ఎన్సీపీ నేత మందా మాత్రే సోమవారం బీజేపీలో చేరారు. అధ్యక్షుడు శరద్పవార్తో సన్నిహితంగా మెలిగే మాత్రే ఒక్కసారిగా ఈ నిర్ణయం తీసుకోవడంపై పార్టీ నేతలు, కార్యకర్తలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆమె బీజేపీలో చేరడంపై నవీముంబై ఎన్సీపీ వర్గాల్లో కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో ఆమె కమలం తీర్థం పుచ్చుకున్నారు.
నవీముంబైలోని ఎన్సీపీ స్థానిక నాయకుల వ్యవహారశైలిపై ఆమె ఇటీవల అనేక ఆరోపణలు చేశారు. స్థానిక నాయకుడు గణేశ్ నాయక్ వ్యవహార శైలి నచ్చకపోవడంతోనే ఆమె పార్టీని వీడారని చెప్పుకుంటున్నారు. వారంరోజుల కిందటే ఆమె ఎన్సీపీకి రాజీనామా చేసిన తర్వాత శివసేనలో చేరుతుందనే వార్తలు వెలువడ్డాయి. కానీ ఆమె బీజేపీలో చేరడం పలువురిని ఆశ్చర్యపరిచింది.
పవార్ సోదరితో మాత్రేకు సన్నిహత సంబంధాలు ఉన్నాయి. పార్టీ పెట్టినప్పటి నుంచి మాత్రే ఎన్సీపీలోనే కొనసాగుతున్నారు. పార్టీ కూడా ఆమెక్లు సముచిత స్థానం కల్పించింది. మహిళా ఫ్రంట్ అధ్యక్షురాలిగా, ఎమ్మెల్సీగా వివిధ పదవుల్లో మాత్రే కొనసాగారు. అయితే స్థానికంగా పార్టీ నేతలతో పొసగక ఆమె పార్టీని వీడడం అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎదురుదెబ్బగా చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా నవీముంబైలో ఈ పరిణామం తాలూకు ప్రభావం కచ్చితంగా ఉంటుందని చెబుతున్నారు.