సస్పెండ్ చేసే అధికారం మండల శాఖలకు లేదు
టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రవీందర్రావు
హన్మకొండ : టీఆర్ఎస్ నేతల విషయం లో మండల శాఖలు తీసుకునే సస్పెన్షన్ల నిర్ణయాలు చెల్లవని పార్టీ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు తెలిపారు. టీఆర్ఎస్ నియమావళి ప్రకారం నాయకులను పార్టీ నుంచి సస్పెండ్ చేసే అధికారం మండల శాఖలకు లేదని స్పష్టం చేశారు. పార్టీ నేతలపై ఆరోపణలు, వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఈ సమాచారాన్ని టీఆర్ఎస్ జిల్లా శాఖకు తెలియజేయాలని... అన్నింటినీ పరిశీలించి జిల్లా స్థాయిలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇలా కాకుండా మండల స్థాయిలో పార్టీ అధ్యక్షులు తీసుకుంటున్న సస్పెన్షన్ నిర్ణయాలు చెల్లుబాటుకావని పేర్కొన్నారు. టీఆర్ఎస్ జిల్లా శాఖతో సంబంధం లేకుండా సస్పెన్షన్ నిర్ణయాలు తీసుకుంటే తీవ్రంగా పరిగణిస్తామని మండల పార్టీ అధ్యక్షులను ఈ సందర్భంగా ఆయ న హెచ్చరించారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం జఫర్‌గఢ్ మండల టీఆర్ఎస్ శాఖ గాదెపాక అయోధ్యను, రఘునాథపల్లి మండల శాఖ బానోతు భిక్షపతిని, లింగాలఘనపురం మండల శాఖ ఏదునూరి వీరయ్యను సస్పెండ్ చేసినట్లు ఇటీవల ప్రకటించాయని... ఈ నిర్ణయాలు చెల్లుబాటు కావని ఆయన తెలిపారు. ఈ ముగ్గురు నేతలు టీఆర్ఎస్ సభ్యులుగానే ఉంటారని శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో రవీందర్రావు వివరించారు.