mangalasutra
-
మంగళసూత్రం పోయిందని వస్తే...
వెంగళరావునగర్: మంగళసూత్రం దొంగిలించారని ఫిర్యాదు చేయడానికి వెళ్లిన మహిళను పోలీసులు నాలుగు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పిన సంఘటన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరిగింది. బాధితురాలి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బర్కత్‌పురలో నివాసం ఉంటున్న శ్రీరేఖ ఈ నెల 15న స్థానిక మధురానగర్‌లోని తన బంధువుల వద్దకు వచ్చింది. 16వ తేదీ తన సోదరునితో కలిసి రైతుబజార్‌కు వెళ్లి కూరగాయలు తీసుకుని ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి చూసుకోగా తన మంగళసూత్రం కనిపించలేదు. హుటాహుటిన రైతుబజార్‌కు వెళ్లి విచారించినా ఫలితం లేదు. ఆమె సమీపంలోని సనత్‌నగర్ పీఎస్‌కు వెళ్లగా అది తమ పరిధి కాదని ఎస్‌ఆర్‌నగర్‌కు పంపారు. ఎస్ఆర్నగర్ పీఎస్‌కు వెళ్లగా ఆ ఏరియా బోరబండ పీఎస్ పరిధిలోకి వస్తుందని వెనక్కు పంపారు. తిరిగి బోరబండకు వెళ్లి ఫిర్యాదు చేయగా అక్కడ కూడా నిరాశే ఎదురైంది. ఆ పీఎస్‌లో కూడా ఫిర్యాదు తీసుకోకుండా మధురానగర్‌కు పంపారు. చివరకు మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా అసలే మంగళసూత్రం పోగొట్టుకుని బాధలో ఉన్న మహిళను నాలుగు పీఎస్‌లకు తిప్పడం ఎంతవరకు సబబని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.. -
కబురు చేస్తే చాలు.. పేదింటి పెళ్లికి పెద్దకొడుకు
సాక్షి, సిరిసిల్ల(కరీంనగర్): జిల్లా కేంద్రంలోని పద్మనగర్‌కు చెందిన నాయుడు రమ (భర్త శ్రీధర్ చనిపోయారు) కూతురు వసంతకు శుక్రవారం వివాహం నిశ్చయమయ్యింది. అలాగే తంగళ్లపల్లి మండలం టెక్స్టైల్ పార్కులో ఉండే గాజుల లలిత కూతురు కీర్తి పెళ్లి కూడా ఇదే రోజున ఖాయమైంది. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్న వీరు పేదరికం కారణంగా తెలిసిన వాళ్లు ఇచ్చిన సమాచారం మేరకు పట్టణంలోని శ్రీనివాస్ చారిటబుల్ ట్రస్టు నిర్వాహకుడు లగిశెట్టి శ్రీనివాస్‌ను సంప్రదించారు. వెంటనే స్పందించిన ఆయన పెళ్లికి అవసరమైన పుస్తె మెట్టెలు, పెండ్లి చీర, గాజులను అందజేసి పేదింటి పెళ్లికి పెద్ద కొడుకు అవుతున్నాడు. ..ఇలా ప్రయోజనం పొందింది కేవలం వసంత, లలిత మాత్రమే కాదు. జిల్లా వ్యాప్తంగా నిరుపేద కార్మిక, కర్షక కుటుంబాలకు చెందిన ఎంతోమంది ఆడపిల్లలు కల్యాణ సాయం కింద పుస్తె, మెట్టెలను అందుకున్నారు. ఇప్పటి వరకు దాదాపు 200కు పైగా నిరుపేద కుటుంబాలు ప్రయోజనం పొందాయి. ఆర్థికంగా చితికిపోయిన ఆడపిల్లల పెళ్లిళ్లకు తక్షణ సాయంగా పుస్తెమెట్టెలను అందిస్తూ సిరిసిల్లకు చెందిన లగిశెట్టి శ్రీనివాస్ తన దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. నేపథ్యం.. ప్రస్తుతం పట్టణంలో వస్త్ర వ్యాపారం చేసే లగిశెట్టి విశ్వనాథం, దేవేంద్రమ్మ దంపతుల కుమారుడు శ్రీనివాస్. 1971 మార్చి 5న జన్మించిన శ్రీనివాస్ తన తండ్రి నుంచి వారసత్వంగా అందివచ్చిన వ్యాపారాన్ని నిర్వహిస్తూ కాలానుగుణ మార్పులతో పారిశ్రామిక రంగంలో స్థిరపడ్డారు. ముతక రకం నూలు వస్త్రం తయారయ్యే కాలంలో ఆధునికంగా ఆలోచించి క్లాత్ ప్రాసెసింగ్ రంగాన్ని పరిచయం చేశారు. రాజకీయ రంగంలోనూ తన ఉనికి చాటుకున్నారు. అధికార పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూనే సహకార విద్యుత్ సరఫరా సంఘం ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. శ్రీనివాస్ చారిటబుల్ ట్రస్టు ద్వారా.. తన ఉన్నతికి కారణమైన పట్టణంలోని ప్రజానీకానికి తన వంతుగా సేవలు అందించాలని సంకల్పించి 2011లో తన పేరిట చారిటబుల్ ట్రస్టును స్థాపించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ట్రస్టు ద్వారా సమాజ సేవలను అందిస్తున్నాడు. విద్యార్థులకు నోట్ బుక్కులు, పుస్తకాలు, వృద్ధాప్యంలో ఉన్నవారికి దుప్పట్లు ఏటా వితరణ చేసే ఆయన తంగళ్లపల్లి మండలం పద్మనగర్‌లోని తన సొంత స్థలంలో సంతోషిమాత దేవాలయాన్ని నిర్మించారు. ఆలయానికి పరిసరాల్లో వృద్ధాశ్రమాన్ని కూడా స్థాపించారు. అవసాన దశలో అయినవాళ్ల నిరాదరణకు గురైన పేద వృద్ధులకు ఆశ్రయం కల్పించాడు. సుమారు 20మందికి పైగా వృద్ధులు ప్రస్తుతం వృద్ధాశ్రమంలో తల దాచుకుంటున్నారు. జన్మభూమి కోసం.. పుట్టి పెరిగిన ప్రాంతానికి సేవ చేయడం ప్రతి మనిషి కనీస కర్తవ్యం. ఇక్కడి ప్రజల ఆశీస్సులతో ఎదిగిన నేను నా వంతుగా సమాజానికి సేవలు అందించాలనుకున్నాను. ఆపన్నులకు అండగా ఉండేందుకు చారిటబుల్ ట్రస్టును స్థాపించా. వృద్ధాశ్రమ నిర్వహణతో పాటు పేదల పెళ్లిళ్లకు సహాయపడటం సంతృప్తి నిస్తోంది. పేదరికం పెద్ద చదువులకు ఆటంకం కావద్దని ప్రతిభావంతులైన విద్యార్థులకు సహకరిస్తున్నా. ఇదంతా సంతోషిమాతా దేవితో పాటు తల్లిదండ్రుల ఆశీర్వాదంగా భావిస్తున్నా. – లగిశెట్టి శ్రీనివాస్, ట్రస్టు నిర్వాహకుడు చదవండి: అమ్మకానికి పెట్టి బుక్కయ్యాడు.. వాడి ప్రతిభకు పోలీసులే అవాక్కు! -
ఆన్లైన్ క్లాసుల కోసం మంగళసూత్రం తాకట్టు
బెంగళూరు: కరోనా దెబ్బకు స్కూళ్లు బంద్.. దీంతో పిల్లల చదువాగిపోయింది.. దూరదర్శన్ చానల్లో ప్రసారమయ్యే పాఠాలే ప్రస్తుతం ఆ పిల్లలకు దిక్కు. కానీ ఇంట్లో టీవీలేదు. ఇరుగు పొరుగు వారిళ్లలోనే ప్రస్తుతం ఆ చిన్నారులు టీవీ చూస్తున్నారు. మరోవైపు.. టీవీ పాఠాలు తప్పనిసరి అని టీచర్లు తల్లికి తేల్చి చెప్పారు. అప్పు చేద్దామనుకుంటే.. ఎవరూ సహాయం చేయలేదు..ఈ నేపథ్యంలో తన పిల్లల ఆన్లైన్ క్లాసులు మిస్సవ్వకూడదని భావించింది. టీవీ కొనేందుకు డబ్బులు లేక తన మంగళసూత్రం తాకట్టు పెట్టింది. ఆ ఘటన కర్నాటకలోని గదగ్ జిల్లా నగ్నూరు గ్రామంలో చోటుచేసుకుంది.(కరోనా భయం.. వాషింగ్ మెషిన్లో కరెన్సీ నోట్లు) గ్రామానికి చెందిన కస్తూరి చల్వాది అనే మహిళకు నలుగురు పిల్లలు ఉన్నారు. ఆమె భర్త మునియప్ప.. రోజూవారి కూలీలు.. లాక్డౌన్ కారణంగా పనులు లేక డబ్బులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో పిల్లలకు దూర్‌దర్శన్‌లో పాఠాలు వినేందుకు ఇంట్లో టీవీ లేకపోవడంతో ఆమె తన 12 గ్రాముల మంగళసూత్రాన్ని తాకట్టు పెట్టి ఆ డబ్బుతో టీవీ కొన్నారు. అయితే ఈ విషయం గ్రామస్తులకు తెలియడంతో వారికి తోచినంత సాయం చేయడానికి ముందుకు వచ్చారు. విషయం తెలసుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ రూ. 50 వేలు, రాష్ట్రానికి చెందిన మరో మంత్రి రూ. 20 వేల చొప్పున ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. ఇదే విషయమై కస్తూరి స్పందిస్తూ... 'పిల్లలకు దూర్‌దర్శన్‌లో పాఠాలు చెప్తున్నారు. మాకు టీవీ లేదు. టీచర్లు పాఠాలను దూర్‌దర్శన్‌లో వినాలని చెప్పారు. వాళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని టీవీ కొనేందుకు నిశ్చయించాను. లాక్డౌన్ వల్ల రోజూవారి కూలీకి వెళ్లడం లేదు. అప్పు ఇచ్చేందుకు ముందుకు రాలేదు. ఇక చేసేది లేక మంగళసూత్రం తాకట్టు పెట్టాను.' అంటూ కస్తూరి చెప్పుకొచ్చింది. -
తాకట్టులో అమ్మవారి మంగళసూత్రం
విజయవాడ: ప్రఖ్యాత ఇంద్రకీలాద్రి శ్రీ కనక దుర్గ ఆలయానికి ఉపాలయంగా ఉన్న సుబ్రహ్మణ్య స్వామి గుడిలో అపచారం చోటుచేసుకుంది. ఆలయంలోని శ్రీవల్లి అమ్మవారి మంగళసూత్రం మూడు నెలల కిందట హఠాత్తుగా కనిపించకుండా పోయింది. ఆలయంలోని ఓ అర్చకుడు అమ్మవారి బంగారు తాళిబొట్టును తాకట్టు పెట్టి సొమ్ముచేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆలస్యంగా ఈ విషయాన్ని గుర్తించిన ఆలయ అధికారులు ఈ అంశం వివాదాస్పదంగా మారకముందే గుట్టుచప్పుడు కాకుండా తాకట్టు నుంచి మంగళసూత్రాలను విడిపించినట్లు సమాచారం. అయితే సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలోని కొందరు సిబ్బంది ఈ విషయాన్ని బయటపెట్టడంతో మొత్తం వ్యవహారం వెలుగు చూసింది. మరోవైపు ఈ అంశం తన దృష్టికి రాలేదని ఆలయ ఈఓ సూర్యకుమారి చెబుతున్నారు. అ సంఘటనపై విచారణ జరుపుతామని చెబుతున్నారు. ఇప్పటికే దుర్గ గుడిలో అధికారుల తీరు పలు వివాదాలకు కారణమవుతున్న నేపథ్యంలో తాళిబొట్టు మాయమైన అంశం మరో వివాదంగా మారుతుందనే ఆందోళన అధికారుల్లో వ్యక్తమవుతోంది. -
డాక్టర్ని అని మహిళను మభ్యపెట్టి..
హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలో గర్భాశయ వ్యాధితో చేరిన ఓ మహిళ మెడలోని బంగారు గొలుసును వైద్యుడి వేషంలో వచ్చిన ఓ వ్యక్తి అపహరించాడు. ఈ సంఘటన గాంధీ ఆస్పత్రిలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. మౌలాలీకి చెందిన రమా అనే మహిళ గర్భాశయ వ్యాధితో గురువారం గాంధీ అస్పత్రిలో చేరింది. చికిత్స నిమిత్తం ఆమెకు ఇంజెక్షన్ చేయాలని, మంగళసూత్రం అడ్డుగా ఉందని, ఆ గొలుసును తీయాలని వైద్యుడి వేషంలో వచ్చిన ఓ వ్యక్తి ఆమెను మభ్యపెట్టాడు. కొద్ది నిమిషాల్లోనే ఆ నాలుగు తులాల బంగారు గొలుసును కాజేసి ఆ అగంతకుడు పరారయ్యాడు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన రమా... చిలకలగూడ పోలీసు లకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మంగళసూత్రంతో పరారీ
చింతలపూడి : పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలంలో దొంగలు రెచ్చిపోయారు. స్తానిక మారుతీ నగర్ సమీపంలోని ఒక ఇంట్లో శనివారం తెల్లవారుజామున ఇద్దరు దొంగలు చొరబడ్డారు. ఇంట్లో ఉన్న సత్యవతి అనే మహిళ మెడలో మంగళసూత్రం లాక్కో బోతుండగా ఆమె భర్త పుల్లారావు అడ్డుకోబోయాడు. ఇంతలో మరో దొంగ పుల్లారావు తలపై బలంగా కొట్టడంతో కుప్ప కూలిపోయాడు. దీంతో సత్యవతి కేకలు వేయగా దొంగలు చేతికందిన మంగళసూత్రంతో పరారయ్యారు. పుల్లారావును ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు చింతలపూడి సిఐ జి దాసు, ఎస్ఐ వీఎస్ వీరభద్రరావులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇంటిని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు -
మంగళసూత్రం తెంపుకెళ్లారు
లంగర్‌హౌస్(హైరదాబాద్): హైదరాబాద్ నగరంలో.. మార్కెట్ నుంచి కూరగాయలు తీసుకుని ఇంటికి వెళుతున్న ఓ మహిళ మెడలోంచి గుర్తు తెలియని దుండగులు 3 తులాల బంగారు మంగళ సూత్రాన్ని తెంపుకెళ్లారు. ఈ సంఘటన నగరంలోని లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్ పరిదిలో బుధవారం మధ్యాహ్నం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పీ అండ్ టీ కాలనీలో నివాసముండే స్వప్న(22) సప్తగిరి కాలనీలో ఓ ఇంట్లో పనిచేస్తూ.. కూరగాయలు తెచ్చేందుకు బుధవారం మధ్యాహ్నం గుడిమల్కాపూర్ మార్కెట్‌కు వెళ్లింది. తిరుగు ప్రయాణంలో ఆమె సప్తగిరి కాలనీకి చేరుకోగానే ఎదురుగా ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోని మంగళసూత్రాన్ని తెంపుకొని పారిపోయారు. మూడు తులాల మంగళసూత్రాన్ని దుండగులు తెంపుకెళ్లారని, పుస్తెలు తెగి కింద పడ్డాయని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.