
వెంగళరావునగర్: మంగళసూత్రం దొంగిలించారని ఫిర్యాదు చేయడానికి వెళ్లిన మహిళను పోలీసులు నాలుగు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పిన సంఘటన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరిగింది. బాధితురాలి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బర్కత్‌పురలో నివాసం ఉంటున్న శ్రీరేఖ ఈ నెల 15న స్థానిక మధురానగర్‌లోని తన బంధువుల వద్దకు వచ్చింది.
16వ తేదీ తన సోదరునితో కలిసి రైతుబజార్‌కు వెళ్లి కూరగాయలు తీసుకుని ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి చూసుకోగా తన మంగళసూత్రం కనిపించలేదు. హుటాహుటిన రైతుబజార్‌కు వెళ్లి విచారించినా ఫలితం లేదు. ఆమె సమీపంలోని సనత్‌నగర్ పీఎస్‌కు వెళ్లగా అది తమ పరిధి కాదని ఎస్‌ఆర్‌నగర్‌కు పంపారు.
ఎస్‌ఆర్‌నగర్ పీఎస్‌కు వెళ్లగా ఆ ఏరియా బోరబండ పీఎస్ పరిధిలోకి వస్తుందని వెనక్కు పంపారు. తిరిగి బోరబండకు వెళ్లి ఫిర్యాదు చేయగా అక్కడ కూడా నిరాశే ఎదురైంది. ఆ పీఎస్‌లో కూడా ఫిర్యాదు తీసుకోకుండా మధురానగర్‌కు పంపారు. చివరకు మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా అసలే మంగళసూత్రం పోగొట్టుకుని బాధలో ఉన్న మహిళను నాలుగు పీఎస్‌లకు తిప్పడం ఎంతవరకు సబబని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు..