మణిదీపం
జలంధర్‌కు చెందిన మణిదీప్ హాకీలో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ
‘శభాష్’ అనిపించుకుంటున్నాడు. నేషనల్ జూనియర్ టీమ్‌లో ఆడి అత్యధికసంఖ్యలో గోల్స్ చేసిన వ్యక్తిగా హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) దృష్టిని ఆకర్షించిన మణిదీప్ మన క్రీడారంగంలో భవిష్యత్ ఆశాకిరణంలా కనిపిస్తున్నాడు.
గ్రౌండ్లో చురుకైన కదలికలు, బంతిని ఒడుపుగా నియంత్రించడం, వ్యూహాత్మక ఎత్తుగడలు అతని సొంతం. ‘అప్‌కమింగ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డ్ గెలుచుకున్న మణిదీప్ గాయం కారణంగా హెచ్ఐఎల్లో 2014లో స్థానం కోల్పోయాడు. ‘‘శరీరాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి అనేది ఈ గాయం నేర్పింది’’ అంటాడు మణిదీప్.
చిన్నప్పుడు హాకీ ప్రాక్టీస్ కోసం బయటకు వెళ్లేవాడు మణిదీప్. కానీ ఎప్పుడూ క్రికెట్ ఆడుతూ ఉండేవాడు. ఒకసారి వాళ్ల నాన్న దృష్టిలో పడ్డాడు.
‘‘హాకీ మీద దృష్టి పెట్టు’’ అని కాస్త గట్టిగానే చెప్పాడు నాన్న. ఇక ఆనాటి నుంచి క్రికెట్ కంటే హాకీనే ఎక్కువగా ఆడడం మొదలుపెట్టాడు. హాకీ విలువను తెలుసుకొని ఆ ఆట ప్రేమలో పడిపోయాడు. ‘‘వచ్చిన అవకాశాలను విజయంగా ఎలా మలుచుకోవాలో తెలిసిన కుర్రాడు. భవిష్యత్‌లో మన దేశంలో హాకీకి ఆశాకిరణంలా కనిపిస్తున్నాడు’’ అంటున్నాడు కోచ్ బల్జిత్సింగ్ సైనీ.
‘‘ఒలింపిక్స్‌లో మన దేశానికి స్వర్ణపతకం సాధించడమే నా లక్ష్యం’’ అంటున్న మణిదీప్ కోరిక నెరవేరాలని ఆశిద్దాం.