Manjulatha
-
నేడు... రేపటిని చెక్కే ఉలి
‘నీ లక్ష్యాలను, గమ్యాన్ని నిర్ణయించాల్సింది సమాజం కాదు, నువ్వే’ అమ్మ ఈ మాట చెప్పిన క్షణం నుంచి నాకు ప్రపంచం కొత్తగా కనిపించసాగింది. నేను సమాజాన్ని అర్థం చేసుకునే తీరులో పూర్తి మార్పు వచ్చింది’... ప్రఖ్యాత ఒడిషా శాస్త్రీయ నాట్యకారుడు ప్రేమ్ సాహు చెప్పిన మాట ఇది. అలాగే ‘నిన్నటి రోజున నువ్వు నీ రోజును ఎలా గడిపావో గుర్తు చేసుకో. ఈ రోజు అంతకంటే మెరుగ్గా గడవాలి. ఈ రోజు రేపటి రోజును మరింత మెరుగు పరచాలి. అంటే జరిగి పోయిన రోజు... జరగబోయే రోజును చెక్కే ఉలి కావాలి’ అని చెప్పింది ప్రేమ్సాహు వాళ్ల అమ్మ మంజులత. అబ్బాయేనా! ఒడిశా రాష్ట్రం, కటక్ నగరంలో పుట్టిన ప్రేమ్సాహుకి నాట్యసాధన ఇష్టం. అతడికి నాట్యం నేర్పించడం అతడి తల్లికి ఇష్టం. ముప్పై ఏళ్ల కిందటి కటక్ సమాజానికి మాత్రం ఇష్టం లేదు. ప్రేమ్ నాట్యసాధన చేస్తే నవ్వేవారు. నాట్యముద్రల్లో అతడి వేళ్లు సున్నితంగా ఒదిగిపోయేవి. ‘అబ్బాయి లక్షణాలేమైనా ఉన్నాయా’ అని ముఖం మీదనే నవ్వేవారు. పాఠశాల వార్షికోత్సవంలో ప్రదర్శన కోసం ఉత్సాహంగా పేరిచ్చే వాడతడు. ప్రాక్టీస్‌కి వెళ్లడానికి క్లాసు టీచర్ని అనుమతి అడిగినప్పుడు గౌరవప్రదమైన ఉపాధ్యాయ వృత్తి నోటి వెంట రాకూడని ఎగతాళి మాటలు వచ్చేవి. టీచర్ల వ్యంగ్యం చాలు తోటి పిల్లలు ప్రేమ్‌ని ఏడిపించడానికి. ప్రేమ్ గురించి మాట్లాడాలంటే అతడి జెండర్ గురించిన మాటలు తప్ప మరేవీ పట్టని సమాజాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని కొడుకుకు ధైర్యం చెప్పింది మంజులత. గెలిపించే తెగింపు ఇదిలా ఉండగా ఓ రోజు... ప్రదర్శన తర్వాత మేకప్ గదిలో ఒక సీనియర్ నటుడు ప్రేమ్‌కు దగ్గరగా వచ్చి తాకాడు, ఆ తాకడంలో ఏదో తేడా ఉందని గ్రహించేలోపు అతడు పద్నాలుగేళ్ల ప్రేమ్‌ని గట్టిగా పట్టుకున్నాడు. అక్కడి నుంచి పారిపోయి ఓ మూల దాక్కుని వెక్కి వెక్కి ఏడ్చాడు. అంతులేని ఆవేదనతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఉరి మెడకు వేసుకునేలోపే... తల్లి ఎప్పుడూ చెప్పే ధైర్య వచనాలు గుర్తు వచ్చాయతడికి. జీవించి చూపించాలనే మొండిధైర్యం అయితే వచ్చింది. కానీ నలుగురిలో కలవడానికి బిడియపడేవాడు. రోజంతా గదిలోనే ఉంటూ గంటల కొద్దీ నాట్యసాధన చేసేవాడు. ఇరవై ఒక్క ఏళ్ల వయసులో ఢిల్లీలోని సాహిత్య కళాపరిషత్‌లో స్కాలర్‌షిప్‌తో సీటు వచ్చింది. పద్మశ్రీ అవార్డు గ్రహీత మాధవీ ముద్గల్ దగ్గర నాట్యంలో మెళకువలు నేర్చుకున్నాడు. హేతుబద్ధమైన విమర్శను స్వీకరించి ఆత్మపరిశీలన చేసుకోవడం, అసూయతో కూడిన అర్థరహితమైన విమర్శలను మనసుకు పట్టనివ్వకపోవడం కూడా నేర్చుకున్నాడు ప్రేమ్ సాహు. అతడు సాధించిన పరిణతి లండన్‌లోని ఒడిశా సొసైటీ యునైటెడ్ కింగ్డమ్ ఫెస్టివల్ నిర్వహించిన వేడుకల్లో ప్రేమ్ ఇచ్చిన నాట్యప్రదర్శనలో వ్యక్తమైంది. ఆ ప్రదర్శన పూర్తయిన వెంటనే ఒక వృద్ధ మహిళ వేదిక మీదకొచ్చి ‘మనోహరమైన, మనసు పెట్టి చేసిన నీ నాట్యం చూస్తుంటే నాకు ఏడుపాగలేదు’ అని కన్నీళ్లు తుడుచుకుంది. నాట్యకారులకు ఇంతకంటే గొప్ప ప్రశంస మరొకటి ఉండదని చెప్పాడు ప్రేమ్ సాహు. తనను ఈ స్థాయిలో నిలబెట్టింది తన తల్లి అలవరచిన గుండె ధైర్యమేనని చెప్పాడు. ఆమె సింహం లాంటి «గుండెదిటవు కలిగిన మనిషి అని తల్లిని ప్రశంసించాడు ప్రేమ్ సాహు. తల్లితో ప్రేమ్సాహు ప్రేమ్సాహు -
ఎస్బీఐ క్యాషియర్ భార్య అరెస్ట్
పోరుమామిళ్ల: పోరుమామిళ్ల స్టేట్ బ్యాంక్ క్యాషి యర్ మార్తాల గురుమోహన్‌రెడ్డి భార్య చిన్నపురెడ్డి మంజులతను మంగళవారం కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్ఐ పెద్ద ఓబన్న తెలిపారు. గురుమోహన్‌రెడ్డి నేరానికి తాను సహకరించినట్లు మంజులత ఒప్పుకుందని ఎస్ఐ తెలిపారు. గురుమోహన్‌రెడ్డి డబ్బంతా షేర్లలో పెట్టినట్లు తెలుస్తోందని, అతను పరారీలో ఉన్నాడని వివరించారు. మంజులత బ్యాంక్ అకౌంట్ పరిశీలించగా రూ.కోటి 90 లక్షలు గురుమోహన్‌రెడ్డి అకౌంట్‌కు బదిలీ అయినట్లు ఉందన్నారు. ఇప్పుడు ఆమె అకౌంట్లో, గురుమోహన్‌రెడ్డి అకౌంట్లో డబ్బు లేదని ఎస్ఐ వివరించారు. గురుమోహన్‌రెడ్డి ప్రొద్దుటూరు బజాజ్ ఫైనాన్స్, ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ సంస్థల్లో పెట్టిన 720 గ్రాముల బంగారు రికవరీ చేశామన్నారు. మిగతా బంగారు ఎక్కడుందో విచారిస్తున్నామన్నారు. మంజులత దగ్గర నుంచి నకిలీ బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. గురుమోహన్‌రెడ్డి షేర్లలో పెట్టిన డబ్బు పోగొట్టుకున్నట్లు తెలుస్తోందని ఎస్ఐ తెలిపారు. వాస్తవంగా గురుమోహన్‌రెడ్డి ఎంత డబ్బు.. బంగారు.. దోచుకెళ్లాడనే అంశంపై వివరాల్లేవు. బ్యాంకు అధికారులు కూడా స్పష్టత ఇవ్వడం లేదు. -
ది రియల్ చాలెంజర్.. మంజులత
రియల్ చాలెంజ్ ఫర్ రైట్ కాజ్ అంటే ఏంటో చూపించింది మంజులత కళానిధి! ప్రస్తుతం ఓ ఆంగ్ల పత్రికలో ఫీచర్స్ ఎడిటర్‌గా పనిచేస్తున్న ఆమె మొదలుపెట్టిన రైస్ బకెట్ చాలెంజ్ ఉద్యమంగా రూపుదిద్దుకుంది. ఈ సంచలనాన్ని గుర్తుగా ఆమె సేవకు కర మ్వీర్ చక్ర పురస్కారం అందింది. ఈ సందర్భంగా మంజులతను ‘సిటీప్లస్’ పలకరించింది. విశేషాలు ఆమె మాటల్లోనే.. నిజానికి చారిటీ అనేది నా మనసులో ఎప్పటి నుంచో ఉంది. గత మే నెలలో నేను ఒరైజా అనే వెబ్సైట్లో జాయిన్ అయ్యాను. బియ్యం శాస్త్రీయనామం ఒరైజా సటైవా. నా పని వరికి సంబంధించిన సకల సమాచారాన్ని ఆ వెబ్సైట్లో అప్లోడ్ చేయడమే. దీనికి సంబంధించిన అప్డేట్స్ పోస్ట్ చేస్తున్నప్పుడే ఐస్ బకెట్ చాలెంజ్ నా కంటపడింది. హాలీవుడ్ స్టార్స్ నుంచి మైక్రోసాఫ్ట్ బిల్‌గేట్స్ వరకు వేలం వెర్రిగా ఐస్ బకెట్ చాలెంజ్ స్వీకరించడం నాకు కరెక్ట్ కాదనిపించింది. అమెరికా లాంటి దేశాలకు ఆ చాలెంజ్ ఓకేనేమో.. మన దేశానికైతే అస్సలు సరికాదు. ఇక్కడ పావర్టీ ఉంది. ఎన్నో సమస్యలున్నాయి. ముందుగా వాటిపై స్పందించాలి. కనీసం కారణం తెలియకుండా ఈ చాలెంజ్‌లో పాల్గొంటున్నారు. ఆ ఫాలోయింగ్ నాకు అస్సలు నచ్చలేదు. ఏదైనా మంచి పనికి శ్రీకారం చుట్టాలనే ఆలోచన కలిగింది. వన్ ఫైన్ ఫ్రైడే.. బకెట్ ఐస్ వాటర్ నెత్తిపై గుమ్మరించుకునే బదులు అదే బకెట్ బియ్యాన్ని ఆకలిగా ఉన్నవాళ్లకిస్తే బాగుంటుందన్న నిశ్చయానికి వచ్చేశాను. ఆగస్ట్ 21 శుక్రవారం.. ఉదయం.. మా బాల్కనీలో నిలబడి టీ తాగుతున్నాను. మా ఇంటి ముందు ఒకబ్బాయి ఇడ్లీలు అమ్ముకుంటుంటాడు. అతనికి బకెట్ బియ్యం ఇచ్చి నా రైస్ బకెట్ చాలెంజ్‌ను మొదలుపెడితే బాగుంటుందనుకున్నాను. ఆ అబ్బాయిని పిలిచి సాయంత్రం కనపడమన్నాను. నా సంకల్పం మా వారితో చెప్తే ఆయనకూ నచ్చింది. ఆ సాయంత్రం మా వారు ఆ అబ్బాయిని తీసుకుని వాళ్లు ఎలాంటి బియ్యం వాడతారో తెలుసుకుని అవే కొని ఇంటికి తీసుకొచ్చారు. ఇడ్లీ పాత్ర నిండుగా 20 కిలోల బియ్యం ఇస్తూ.. అడిగి మరీ ఫొటో తీయించుకున్నాను. ఆ ఫొటోను ఫేస్బుక్లో పోస్ట్ చేసి రైస్ బకెట్ చాలెంజ్‌కు పిలుపునిచ్చాను. 7 లక్షల లైక్స్.. 70 వేల చాలెంజర్స్.. ఆ పోస్ట్ చేసిన నిమిషాల వ్యవధిలో విపరీతమైన స్పందన వచ్చింది. వందలాది మంది ఈ చాలెంజ్‌కు రెస్పాండయ్యారు. ఈ పది రోజుల్లో ఏడు లక్షల అరవై వేల లైక్స్ వచ్చాయి. 70 వేల మంది రైస్ బకెట్ చాలెంజ్ స్వీకరించారు. ఉద్యమంలా ఊపందుకున్న ఈ రైస్ బకెట్ చాలెంజ్ గురించి తెలుసుకుని, చూసిన యునెటైడ్ నేషన్స్ అండ్ ఐకాంగో (ఇండియన్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎన్జీవోస్) సంయుక్తంగా కరమ్వీర్చక్ర అవార్డును ప్రకటించాయి. అలాగే రెక్స్ కరమ్వీర్చక్ర ఫెలోషిప్‌నూ ఇచ్చాయి. వచ్చే ఏడాది మార్చ్ 23న ఈ అవార్డును అందుకోబోతున్నాను. నా కుటుంబం సహకారంతో అనుకున్నవి సాధిస్తానన్న నమ్మకం ఉంది. - సరస్వతి రమ