‘నీ లక్ష్యాలను, గమ్యాన్ని నిర్ణయించాల్సింది సమాజం కాదు, నువ్వే’ అమ్మ ఈ మాట చెప్పిన క్షణం నుంచి నాకు ప్రపంచం కొత్తగా కనిపించసాగింది. నేను సమాజాన్ని అర్థం చేసుకునే తీరులో పూర్తి మార్పు వచ్చింది’... ప్రఖ్యాత ఒడిషా శాస్త్రీయ నాట్యకారుడు ప్రేమ్ సాహు చెప్పిన మాట ఇది. అలాగే ‘నిన్నటి రోజున నువ్వు నీ రోజును ఎలా గడిపావో గుర్తు చేసుకో. ఈ రోజు అంతకంటే మెరుగ్గా గడవాలి. ఈ రోజు రేపటి రోజును మరింత మెరుగు పరచాలి. అంటే జరిగి పోయిన రోజు... జరగబోయే రోజును చెక్కే ఉలి కావాలి’ అని చెప్పింది ప్రేమ్‌సాహు వాళ్ల అమ్మ మంజులత.
అబ్బాయేనా!
ఒడిశా రాష్ట్రం, కటక్ నగరంలో పుట్టిన ప్రేమ్‌సాహుకి నాట్యసాధన ఇష్టం. అతడికి నాట్యం నేర్పించడం అతడి తల్లికి ఇష్టం. ముప్పై ఏళ్ల కిందటి కటక్ సమాజానికి మాత్రం ఇష్టం లేదు. ప్రేమ్ నాట్యసాధన చేస్తే నవ్వేవారు. నాట్యముద్రల్లో అతడి వేళ్లు సున్నితంగా ఒదిగిపోయేవి. ‘అబ్బాయి లక్షణాలేమైనా ఉన్నాయా’ అని ముఖం మీదనే నవ్వేవారు. పాఠశాల వార్షికోత్సవంలో ప్రదర్శన కోసం ఉత్సాహంగా పేరిచ్చే వాడతడు. ప్రాక్టీస్‌కి వెళ్లడానికి క్లాసు టీచర్‌ని అనుమతి అడిగినప్పుడు గౌరవప్రదమైన ఉపాధ్యాయ వృత్తి నోటి వెంట రాకూడని ఎగతాళి మాటలు వచ్చేవి. టీచర్ల వ్యంగ్యం చాలు తోటి పిల్లలు ప్రేమ్‌ని ఏడిపించడానికి. ప్రేమ్ గురించి మాట్లాడాలంటే అతడి జెండర్ గురించిన మాటలు తప్ప మరేవీ పట్టని సమాజాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని కొడుకుకు ధైర్యం చెప్పింది మంజులత.
గెలిపించే తెగింపు
ఇదిలా ఉండగా ఓ రోజు... ప్రదర్శన తర్వాత మేకప్ గదిలో ఒక సీనియర్ నటుడు ప్రేమ్‌కు దగ్గరగా వచ్చి తాకాడు, ఆ తాకడంలో ఏదో తేడా ఉందని గ్రహించేలోపు అతడు పద్నాలుగేళ్ల ప్రేమ్‌ని గట్టిగా పట్టుకున్నాడు. అక్కడి నుంచి పారిపోయి ఓ మూల దాక్కుని వెక్కి వెక్కి ఏడ్చాడు. అంతులేని ఆవేదనతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఉరి మెడకు వేసుకునేలోపే... తల్లి ఎప్పుడూ చెప్పే ధైర్య వచనాలు గుర్తు వచ్చాయతడికి. జీవించి చూపించాలనే మొండిధైర్యం అయితే వచ్చింది. కానీ నలుగురిలో కలవడానికి బిడియపడేవాడు. రోజంతా గదిలోనే ఉంటూ గంటల కొద్దీ నాట్యసాధన చేసేవాడు. ఇరవై ఒక్క ఏళ్ల వయసులో ఢిల్లీలోని సాహిత్య కళాపరిషత్‌లో స్కాలర్‌షిప్‌తో సీటు వచ్చింది. పద్మశ్రీ అవార్డు గ్రహీత మాధవీ ముద్గల్ దగ్గర నాట్యంలో మెళకువలు నేర్చుకున్నాడు.
హేతుబద్ధమైన విమర్శను స్వీకరించి ఆత్మపరిశీలన చేసుకోవడం, అసూయతో కూడిన అర్థరహితమైన విమర్శలను మనసుకు పట్టనివ్వకపోవడం కూడా నేర్చుకున్నాడు ప్రేమ్ సాహు. అతడు సాధించిన పరిణతి లండన్‌లోని ఒడిశా సొసైటీ యునైటెడ్ కింగ్‌డమ్ ఫెస్టివల్ నిర్వహించిన వేడుకల్లో ప్రేమ్ ఇచ్చిన నాట్యప్రదర్శనలో వ్యక్తమైంది. ఆ ప్రదర్శన పూర్తయిన వెంటనే ఒక వృద్ధ మహిళ వేదిక మీదకొచ్చి ‘మనోహరమైన, మనసు పెట్టి చేసిన నీ నాట్యం చూస్తుంటే నాకు ఏడుపాగలేదు’ అని కన్నీళ్లు తుడుచుకుంది. నాట్యకారులకు ఇంతకంటే గొప్ప ప్రశంస మరొకటి ఉండదని చెప్పాడు ప్రేమ్ సాహు. తనను ఈ స్థాయిలో నిలబెట్టింది తన తల్లి అలవరచిన గుండె ధైర్యమేనని చెప్పాడు. ఆమె సింహం లాంటి «గుండెదిటవు కలిగిన మనిషి అని తల్లిని ప్రశంసించాడు ప్రేమ్ సాహు.
తల్లితో ప్రేమ్‌సాహు ప్రేమ్‌సాహు
Comments
Please login to add a commentAdd a comment