
భువనేశ్వర్: క్రికెట్ మ్యాచ్ ఆడే సమయంలో ఇరు జట్లు అపుడుపుడు మాటల యుద్ధానికి దిగుతాయి. భౌతిక దాడులు చేసుకునే సందర్భాలు అత్యంత అరుదు. అయితే గల్లీ క్రికెట్‌లో మాత్రం ఇలా కాదు.. మాటా మాటా పెరిగి ఒక్కోసారి ఇరుజట్లు బాహాబాహీకి దిగుతాయి. ఆటగాళ్లు ఒకరిపైఒకరు దాడి చేసుకుని తీవ్రంగా గాయపరుచుకుంటారు.
ఒడిశా కటక్ జిల్లా మహిసానంద గ్రామంలోనూ సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. క్రెకెట్ మ్యాచ్ ఆడే సమయంలో అంపైర్ నో బాల్ ఇవ్వలేదని సంగ్రామ్ రౌత్ అనే ఆటగాడు రెచ్చిపోయాడు. నో బాల్ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాడు. కానీ అంపైర్ అందుకు ఒప్పకోలేదు. దీంతో తీవ్రంగా ఆగ్రహించిన సంగ్రామ్, మరో ఇద్దరు ఆటగాళ్లు.. అంపైర్‌ను తోసేసి దాడి చేయబోయారు.
గొడవ పెద్దది కావడంతో లక్కీ రౌత్ అనే స్థానికుడు అంపైర్‌ను కాపాడేందుకు మధ్యలో జోక్యం చేసుకుని వెళ్లాడు. దీంతో సంగ్రామ్ అతడ్ని బ్యాట్‌తో కొట్టాడు. ఛాతీలో కత్తితో పొడిచాడు. దీంతో లక్కీ తీవ్రగాయాలతో కుప్పకూలాడు. ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ చనిపోయాడు. ఆదివారం జరిగిన ఈ ఘటనలో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతడి కోసం ప్రత్యేక బృందంతో గాలిస్తున్నట్లు వెల్లడించారు.
చదవండి: 'గాడిద పాల సబ్బు వాడితే మహిళలు ఎప్పటికీ అందంగా ఉంటారు'
Comments
Please login to add a commentAdd a comment