ది రియల్ చాలెంజర్.. మంజులత
రియల్ చాలెంజ్ ఫర్ రైట్ కాజ్ అంటే ఏంటో చూపించింది మంజులత కళానిధి! ప్రస్తుతం ఓ ఆంగ్ల పత్రికలో ఫీచర్స్ ఎడిటర్‌గా పనిచేస్తున్న ఆమె మొదలుపెట్టిన రైస్ బకెట్ చాలెంజ్ ఉద్యమంగా రూపుదిద్దుకుంది. ఈ సంచలనాన్ని గుర్తుగా ఆమె సేవకు కర మ్‌వీర్ చక్ర పురస్కారం అందింది. ఈ సందర్భంగా మంజులతను ‘సిటీప్లస్’ పలకరించింది. విశేషాలు ఆమె మాటల్లోనే..
నిజానికి చారిటీ అనేది నా మనసులో ఎప్పటి నుంచో ఉంది. గత మే నెలలో నేను ఒరైజా అనే వెబ్‌సైట్‌లో జాయిన్ అయ్యాను. బియ్యం శాస్త్రీయనామం ఒరైజా సటైవా. నా పని వరికి సంబంధించిన సకల సమాచారాన్ని ఆ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయడమే. దీనికి సంబంధించిన అప్‌డేట్స్ పోస్ట్ చేస్తున్నప్పుడే ఐస్ బకెట్ చాలెంజ్ నా కంటపడింది. హాలీవుడ్ స్టార్స్ నుంచి మైక్రోసాఫ్ట్ బిల్‌గేట్స్ వరకు వేలం వెర్రిగా ఐస్ బకెట్ చాలెంజ్ స్వీకరించడం నాకు కరెక్ట్ కాదనిపించింది. అమెరికా లాంటి దేశాలకు ఆ చాలెంజ్ ఓకేనేమో.. మన దేశానికైతే అస్సలు సరికాదు. ఇక్కడ పావర్టీ ఉంది. ఎన్నో సమస్యలున్నాయి. ముందుగా వాటిపై స్పందించాలి. కనీసం కారణం తెలియకుండా ఈ చాలెంజ్‌లో పాల్గొంటున్నారు. ఆ ఫాలోయింగ్ నాకు అస్సలు నచ్చలేదు. ఏదైనా మంచి పనికి శ్రీకారం చుట్టాలనే ఆలోచన కలిగింది.
వన్ ఫైన్ ఫ్రైడే..
బకెట్ ఐస్ వాటర్ నెత్తిపై గుమ్మరించుకునే బదులు అదే బకెట్ బియ్యాన్ని ఆకలిగా ఉన్నవాళ్లకిస్తే బాగుంటుందన్న నిశ్చయానికి వచ్చేశాను. ఆగస్ట్ 21 శుక్రవారం.. ఉదయం.. మా బాల్కనీలో నిలబడి టీ తాగుతున్నాను. మా ఇంటి ముందు ఒకబ్బాయి ఇడ్లీలు అమ్ముకుంటుంటాడు. అతనికి బకెట్ బియ్యం ఇచ్చి నా రైస్ బకెట్ చాలెంజ్‌ను మొదలుపెడితే బాగుంటుందనుకున్నాను. ఆ అబ్బాయిని పిలిచి సాయంత్రం కనపడమన్నాను. నా సంకల్పం మా వారితో చెప్తే ఆయనకూ నచ్చింది. ఆ సాయంత్రం మా వారు ఆ అబ్బాయిని తీసుకుని వాళ్లు ఎలాంటి బియ్యం వాడతారో తెలుసుకుని అవే కొని ఇంటికి తీసుకొచ్చారు. ఇడ్లీ పాత్ర నిండుగా 20 కిలోల బియ్యం ఇస్తూ.. అడిగి మరీ ఫొటో తీయించుకున్నాను. ఆ ఫొటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసి రైస్ బకెట్ చాలెంజ్‌కు పిలుపునిచ్చాను.
7 లక్షల లైక్స్.. 70 వేల చాలెంజర్స్..
ఆ పోస్ట్ చేసిన నిమిషాల వ్యవధిలో విపరీతమైన స్పందన వచ్చింది. వందలాది మంది ఈ చాలెంజ్‌కు రెస్పాండయ్యారు. ఈ పది రోజుల్లో ఏడు లక్షల అరవై వేల లైక్స్ వచ్చాయి. 70 వేల మంది రైస్ బకెట్ చాలెంజ్ స్వీకరించారు. ఉద్యమంలా ఊపందుకున్న ఈ రైస్ బకెట్ చాలెంజ్ గురించి తెలుసుకుని, చూసిన యునెటైడ్ నేషన్స్ అండ్ ఐకాంగో (ఇండియన్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎన్‌జీవోస్) సంయుక్తంగా కరమ్‌వీర్‌చక్ర అవార్డును ప్రకటించాయి. అలాగే రెక్స్ కరమ్‌వీర్‌చక్ర ఫెలోషిప్‌నూ ఇచ్చాయి. వచ్చే ఏడాది మార్చ్ 23న ఈ అవార్డును అందుకోబోతున్నాను. నా కుటుంబం సహకారంతో అనుకున్నవి సాధిస్తానన్న నమ్మకం ఉంది.
- సరస్వతి రమ