Rice bucket challenge
-
‘ఆటో ఛాలెంజ్’కి రెడీనా!
సామాజిక మాధ్యమంలో ఇప్పుడు ‘ఛాలెంజ్’ల హవా సాగుతోంది. ఆ మధ్య ‘ఐస్ బకెట్’ ఛాలెంజ్ ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంచలనమే సృష్టించిందని చెప్పాలి. పెద్ద పెద్ద సెలబ్రిటీలు సైతం ఐస్ నీళ్ల బకెట్‌ని నెత్తిపై బోర్లించుకొని అభ్యంగన స్నానాలు చేసేశారు. దీన్ని ప్రేరణగా తీసుకున్న కొందరు రైస్ బకెట్ ఛాలెంజ్, మై ట్రీ ఛాలెంజ్ అంటూ సామాజిక స్పృహతో ఛాలెంజ్‌లు మొదలుపెట్టారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ మరో కొత్త ఛాలెంజ్‌కి శ్రీకారం చుట్టారు. అదే ‘ఆటో ఛాలెంజ్’. ఇదెలా పుట్టిందంటే... ఓ రోజు రాత్రి ఇంటికెళ్తుంటే హృతిక్‌కి ఓ చిలిపి ఆలోచన వచ్చిందట. వెంటనే... కారుని ఓ సేఫ్ ప్లేస్‌లో పార్క్ చేసేసి, ఆటుగా వెళ్తున్న ఆటోని ఆపారట. ఆ ఆటోవాలాతో బేరం కుదుర్చుకుని ఇంటికి చేరారట. విచిత్రమేంటంటే... ఆ ఆటోవాలా కూడా హృతిక్‌ని గుర్తు పట్టలేదట. ఇప్పటివరకూ కారు అద్దాల్లోంచి ప్రపంచాన్ని చూసిన హృతిక్, ఒక సామాన్యుడిలా ఆటోలో జర్నీ చేస్తూ చెప్పలేనంత ఆనందాన్ని పొందారట. ఈ విషయాన్ని ఆయన నేరుగా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అంతటితో ఆగకుండా... ‘‘నేను ఆటోలో జర్నీ చేసినట్లు... మీరు కూడా జర్నీ చేయగలరా? వారం రోజులు టైమిస్తున్నా. మీ సత్తా ఏంటో నిరూపించుకోండి’’ అంటూ అదే ట్విట్టర్ ద్వారా తన తోటి స్టార్లకు హృతిక్ సవాలు విసిరారు. ఆయన సవాల్ విసిరిన వారిలో షారుక్‌ఖాన్, ప్రియాంక చోప్రా, ఉదయ్‌చోప్రా, డినో మోరియా ఉన్నారు. అయితే... హృతిక్ సవాలు విసిరి నాలుగు రోజులు గడుస్తున్నా... ఒక్క ఉదయ్ చోప్రా తప్ప ఛాలెంజ్‌కి ఎవరూ రియాక్ట్ కాలేదు. దాంతో వెంటనే... ‘‘ప్రియాంక చోప్రా దమ్మున్న అమ్మాయి. ఆమె ఈ సవాల్‌కి సిద్ధమనుకుంటున్నా? టైమ్ ఇంకా మూడ్రోజులే ఉంది’’ అంటూ మరో ట్వీట్ చేశారు హృతిక్. మరి ఈ సవాల్‌ని ప్రియాంక స్వీకరించి, ఆటో ఎక్కుతారో, లేదో. వెయిట్ అండ్ సీ. -
జర్మనీ రాయబారి ‘రైస్ బకెట్ సవాల్’
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ‘ఐస్‌బకెట్ సవాల్’ ట్రెండ్ కొనసాగుతుండగా.. మన దే శంలో ‘రైస్‌బకెట్ సవాల్ ఊపందుకుంటోంది. ఢిల్లీ చాణక్యపురిలో మంగళవారం రైస్ బకెట్ చాలెంజ్‌ను స్వీకరించిన జర్మనీ రాయబారి మైకేల్ స్టీనర్.. స్థానిక మురికివాడలో 392 పేద కుటుంబాలకు ఐదు కిలోల బియ్యం బకెట్లను అందజేశారు. పేదరిక నిర్మూలనకు తోడ్పాటుగా చింతన్ అనే ఎన్జీవోతో కలిసి జర్మన్ ఎంబసీ ఈ కార్యక్రమం నిర్వహించింది. మురికివాడను అభివృద్ధి చేసే కార్యక్రమం కోసం రూ.27 కోట్లను కేటాయించనున్నట్లూ స్టీనర్ తెలిపారు. కాగా, నాడీ సంబంధమైన ఏఎల్ఎస్, మోటార్ న్యూరాన్ వ్యాధిపై పరిశోధిస్తున్న ఏఎల్ఎస్ ఫౌండేషన్‌కు నిధుల కోసం అంతర్జాతీయంగా ఐస్ బకెట్ చాలెంజ్ ప్రారంభం అయింది. కానీ.. మన దేశంలో ఆకలే పెద్ద సమస్య. కాబట్టి.. దేశీయ వెర్షన్ అయిన రైస్ బకెట్ చాలెంజ్‌కు ఆదరణ క్రమంగా పెరుగుతోంది. ఫేస్బుక్, ట్విట్టర్, ఇతర సైట్ల ద్వారా నెటిజన్లు పెద్ద ఎత్తున సవాళ్లు స్వీకరించి, విసురుకుంటున్నారు. పెద్ద ఎత్తున నెటిజన్లను కదిలిస్తున్న ఈ రైస్ బకెట్ చాలెంజ్‌ను హైదరాబాద్‌కు చెందిన మహిళ మంజులత మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. -
ఇక బుక్ బకెట్ చాలెంజ్
అన్నానగర్: ఐస్ బకెట్, రైస్ బకెట్ చాలెంజ్‌ల తరహాలో నగరంలో కొత్తగా బుక్ బకెట్ చాలెంజ్ ఆవిర్భవించింది. సోషల్ మీడియాలో పుట్టిన ఈ కొత్త గేమ్స్‌తో గ్రంథాలయూలను ఏర్పాటు చేయనున్నారు. పది పుస్తకాల పేర్లను ఇచ్చి, వీటన్నింటినీ వారం వ్యవధిలో చదవాలనే షరతు విధిస్తారు. ఇందులో ఓడిపోయిన వారు వారి దగ్గరున్న పది పుస్తకాలను స్థానిక గ్రంథాలయాలకు విరాళంగా ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతి గ్రామంలో ఒక గ్రంథాలయం ఏర్పాటు చేయాలనే తలంపుతో ఈ బుక్ బకెట్ చాలెంజ్ మొదలైంది. సోషల్ మీడియాలోని బుక్ బకెట్ ఛాలెంజ్ గేమ్‌లు విక్రం సేథ్, హార్పర్లీ, ఎఎ మిల్నీ, డవుగ్లస్ ఆడమ్స్, గోసెన్నీ - అడర్జో, జెకె రోలింగ్స్, పి.జి.వుడ్ హౌస్, ఎనిడ్ బ్లైటన్, మార్గరెట్ మిచెల్ వంటి ప్రముఖ రచయితలు రాసిన పలు పుస్తకాలను ఉంచారు. -
సేవ మన తత్వం
‘సేవాతత్పరత అనేది భారతీయుల రక్తంలోనే ఉంది. సేవాగుణంలో ప్రపంచానికే మార్గదర్శనం చేసిన ఎందరో మహనీయులు ఇక్కడ పుట్టారు’ అని అంటున్నారు ప్రసిద్ధ బాలీవుడ్ దర్శకుడు మహేష్‌భట్. నగరవాసి నిర్వహిస్తున్న రైస్ బకెట్ చాలెంజ్‌కు మద్దతుగా తొలుత ఆయన తాజ్ ఫలక్‌నుమా వద్ద ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత బంజారాహిల్స్‌లోని కేన్సర్ ఆసుపత్రి దగ్గర అన్నార్తులకు బిర్యానీ ప్యాకెట్ల పంపిణీనిప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కరణ్ జోహార్‌కు రైస్ బకెట్ చాలెంజ్‌ను విసురుతున్నట్టు ప్రకటించిన ఆయన మాట్లాడుతూ ‘ రైస్ బకెట్ చాలెంజ్ అనే నిరుపేదలకు ఉపకరించే కార్యక్రమం రూపుదిద్దినందుకు నిర్వాహకులను అభినందిస్తున్నాను. ఈ ప్రోగ్రాం డిజైన్ చేసింది హైదరాబాదీ కావడం ఈ నగరవాసులు గర్వించాల్సిన విషయం’ అనికొనియాడారు. తెలుగు సినిమా రూపొందించడంపై మాట్లాడుతూ.. ‘ప్రాంతీయ భాషల్లో సినిమా తీసే ఆలోచన లేదు. కాబట్టి, తెలుగు సినిమా తీసే అవకాశం లేదు. అయితే ఎన్టీయార్, ఏఎన్నార్ లాంటి గొప్ప నటులున్న రంగంగా తెలుగు సినీ రంగం మీద నాకు చాలా గౌరవం ఉంది’ అన్నారు. కాగా, శృంగారభరిత చిత్రాలను రూపొందించడంపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. ‘ప్రేక్షకులు వాటినే ఆదరిస్తున్నారు. నేను సిటీలైట్ అనే క్లాసిక్ మూవీ తీస్తే ఎవరూ చూడలేదు. అదే జిస్మ్, మర్డర్.. సూపర్‌హిట్ అయ్యాయి. అందుకే అలాంటి సినిమాలే ఎక్కువ తీస్తున్నారు. ప్రేక్షకులకు ఇష్టమైన సినిమాలే ఎవరైనా తీయాలనుకుంటారని, వారికి నచ్చని సినిమాలు తీసి చేతులు కాల్చుకోవాలని ఎవరూ అనుకోరని’ అన్నారాయన. - ఎస్.సత్యబాబు -
ది రియల్ చాలెంజర్.. మంజులత
రియల్ చాలెంజ్ ఫర్ రైట్ కాజ్ అంటే ఏంటో చూపించింది మంజులత కళానిధి! ప్రస్తుతం ఓ ఆంగ్ల పత్రికలో ఫీచర్స్ ఎడిటర్‌గా పనిచేస్తున్న ఆమె మొదలుపెట్టిన రైస్ బకెట్ చాలెంజ్ ఉద్యమంగా రూపుదిద్దుకుంది. ఈ సంచలనాన్ని గుర్తుగా ఆమె సేవకు కర మ్వీర్ చక్ర పురస్కారం అందింది. ఈ సందర్భంగా మంజులతను ‘సిటీప్లస్’ పలకరించింది. విశేషాలు ఆమె మాటల్లోనే.. నిజానికి చారిటీ అనేది నా మనసులో ఎప్పటి నుంచో ఉంది. గత మే నెలలో నేను ఒరైజా అనే వెబ్సైట్లో జాయిన్ అయ్యాను. బియ్యం శాస్త్రీయనామం ఒరైజా సటైవా. నా పని వరికి సంబంధించిన సకల సమాచారాన్ని ఆ వెబ్సైట్లో అప్లోడ్ చేయడమే. దీనికి సంబంధించిన అప్డేట్స్ పోస్ట్ చేస్తున్నప్పుడే ఐస్ బకెట్ చాలెంజ్ నా కంటపడింది. హాలీవుడ్ స్టార్స్ నుంచి మైక్రోసాఫ్ట్ బిల్‌గేట్స్ వరకు వేలం వెర్రిగా ఐస్ బకెట్ చాలెంజ్ స్వీకరించడం నాకు కరెక్ట్ కాదనిపించింది. అమెరికా లాంటి దేశాలకు ఆ చాలెంజ్ ఓకేనేమో.. మన దేశానికైతే అస్సలు సరికాదు. ఇక్కడ పావర్టీ ఉంది. ఎన్నో సమస్యలున్నాయి. ముందుగా వాటిపై స్పందించాలి. కనీసం కారణం తెలియకుండా ఈ చాలెంజ్‌లో పాల్గొంటున్నారు. ఆ ఫాలోయింగ్ నాకు అస్సలు నచ్చలేదు. ఏదైనా మంచి పనికి శ్రీకారం చుట్టాలనే ఆలోచన కలిగింది. వన్ ఫైన్ ఫ్రైడే.. బకెట్ ఐస్ వాటర్ నెత్తిపై గుమ్మరించుకునే బదులు అదే బకెట్ బియ్యాన్ని ఆకలిగా ఉన్నవాళ్లకిస్తే బాగుంటుందన్న నిశ్చయానికి వచ్చేశాను. ఆగస్ట్ 21 శుక్రవారం.. ఉదయం.. మా బాల్కనీలో నిలబడి టీ తాగుతున్నాను. మా ఇంటి ముందు ఒకబ్బాయి ఇడ్లీలు అమ్ముకుంటుంటాడు. అతనికి బకెట్ బియ్యం ఇచ్చి నా రైస్ బకెట్ చాలెంజ్‌ను మొదలుపెడితే బాగుంటుందనుకున్నాను. ఆ అబ్బాయిని పిలిచి సాయంత్రం కనపడమన్నాను. నా సంకల్పం మా వారితో చెప్తే ఆయనకూ నచ్చింది. ఆ సాయంత్రం మా వారు ఆ అబ్బాయిని తీసుకుని వాళ్లు ఎలాంటి బియ్యం వాడతారో తెలుసుకుని అవే కొని ఇంటికి తీసుకొచ్చారు. ఇడ్లీ పాత్ర నిండుగా 20 కిలోల బియ్యం ఇస్తూ.. అడిగి మరీ ఫొటో తీయించుకున్నాను. ఆ ఫొటోను ఫేస్బుక్లో పోస్ట్ చేసి రైస్ బకెట్ చాలెంజ్‌కు పిలుపునిచ్చాను. 7 లక్షల లైక్స్.. 70 వేల చాలెంజర్స్.. ఆ పోస్ట్ చేసిన నిమిషాల వ్యవధిలో విపరీతమైన స్పందన వచ్చింది. వందలాది మంది ఈ చాలెంజ్‌కు రెస్పాండయ్యారు. ఈ పది రోజుల్లో ఏడు లక్షల అరవై వేల లైక్స్ వచ్చాయి. 70 వేల మంది రైస్ బకెట్ చాలెంజ్ స్వీకరించారు. ఉద్యమంలా ఊపందుకున్న ఈ రైస్ బకెట్ చాలెంజ్ గురించి తెలుసుకుని, చూసిన యునెటైడ్ నేషన్స్ అండ్ ఐకాంగో (ఇండియన్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎన్జీవోస్) సంయుక్తంగా కరమ్వీర్చక్ర అవార్డును ప్రకటించాయి. అలాగే రెక్స్ కరమ్వీర్చక్ర ఫెలోషిప్‌నూ ఇచ్చాయి. వచ్చే ఏడాది మార్చ్ 23న ఈ అవార్డును అందుకోబోతున్నాను. నా కుటుంబం సహకారంతో అనుకున్నవి సాధిస్తానన్న నమ్మకం ఉంది. - సరస్వతి రమ -
‘రైస్ బకెట్ చాలెంజ్’
న్యూఢిల్లీ: నెట్ ప్రపంచంలో నిన్న ఐస్ బకెట్ చాలెంజ్ సందడి చేస్తే... ఓ హైదరాబాదీ మొదలుపెట్టిన రైస్ బకెట్ చాలెంజ్ నేడు ఆ స్థాయిలో నెటిజన్లను సేవ దిశగా కదిలిస్తోంది. ఓ వ్యాధిపై ప్రచారం కోసం బకెట్ నీటిని ఒకరి తలపై కుమ్మరించేలా... ఇటీవల అమెరికాలో ఐస్ బకెట్ చాలెంజ్ ప్రారంభం కాగా, దానికి ఓ హైదరాబాదీ దేశీయ రూపునిచ్చారు. అన్నార్థులకు ఓ బకెట్ బియ్యం దానం చేయండంటూ ‘రైస్ బకెట్ చాలెంజ్’ అనే సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారు హైదరాబాద్‌కు చెందిన పాత్రికేయురాలు మంజులతా కళానిధి. ‘‘ఓ బకెట్ బియ్యాన్ని వండి లేదా బిర్యానీని చేసి మీ ప్రాంతంలో పేదల ఆకలి తీర్చండి. ఈ సవాల్‌ను స్వీకరించలేకపోతే కనీసం ఓ వంద రూపాయల విలువైన మందులను ప్రభుత్వానికి దానంగా ఇవ్వండి’’ అంటూ మంజులత ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ఈ సవాల్‌ను చూసిన చాలా మంది నెటిజన్లు వెంటనే స్పందించారు. బకెట్ బియ్యాన్ని దానం చేయడమే కాకుండా దానికి సంబంధించిన వీడియోలను పోస్ట్ చేయడం మొదలు పెట్టారు. బకెట్ బియ్యాన్ని దానం చేయడం ద్వారా పేదవారి ఆకలి తీర్చడానికి నెటిజన్లు ఉత్సాహంగా ముందుకొస్తుండడం విశేషం. -
ఇదీ రైస్ బకెట్ ఛాలెంజ్ కథ!