ప్రతి సాధకుడూ అర్జునుడే!
ఎందుకు రాశానంటే!
ఇదొక చిత్రమైన సైన్సు, ఆధ్యాత్మికత కలయిక. ఏస్ట్రోఫిజిక్స్లో పీహెచ్డీ చేసిన డాక్టర్ ముంజులూరి నరసింహారావు పరమహంస యోగానంద శిష్యులు. హైదరాబాద్లోని వివేకవర్ధిని కళాశాలలో పనిచేసి 2001లో రీడర్గా రిటైర్ అయ్యారు. ఆయన ఇటీవలే రెండు సంపుటాలుగా శ్రీమద్భగవద్గీతకు (మొదటి సంపుటం; 1-6 అధ్యాయాలు; రెండో సంపుటం; 7-18 అధ్యాయాలు) బృహత్ వ్యాఖ్యానాన్ని వెలువరించారు. ఈ సందర్భంగా ఆయనతో చిరు సంభాషణ:
- భగవద్గీతకు సంబంధించిన వ్యాఖ్యానాలు ఏదోరకంగా ఎన్నో ఉనికిలో ఉన్నప్పుడు, మళ్లీ మీరు వ్యాఖ్యానానికి ఎందుకు పూనుకున్నారు?
ఇది ‘రోజూ తింటూన్న అన్నాన్నే మరోసారి తినమన్నట్టు’గా ఉంటుందిగదా అనుకోవడం సహజమే. అయితే ఈ వ్యాఖ్యానం శ్రీకృష్ణుడికీ అర్జునుడికీ మధ్య జరిగిన సంవాదంగా కాకుండా, ప్రతి మనిషి గుండెల్లోనూ కొలువై ఉన్న భగవంతుడికీ పుట్టినదగ్గరి నుంచీ వెంటాడుతూన్న పుట్టెడు దుఃఖాల్ని పోగొట్టుకొందామని ప్రయత్నిస్తూన్న సాధకునికీ మధ్య ప్రతి క్షణమూ జరుగుతూన్న సంవాదంగా చెబుతుంది.
- అంటే ప్రతి సాధకుడూ అర్జునుడే...
అవును, ప్రతిసాధకుడూ అర్జునుడే. ఇంట్లో భార్యాభర్తల కీచులాటలూ, అన్నదమ్ముళ్ల కుమ్ములాటలూ, డబ్బుకోసం అందరిమధ్యా వచ్చే మనస్పర్థలూ, భాగస్వామ్య వర్తకాల్లో పుట్టే కొట్లాటలూ, దేశాల మధ్య వచ్చే సరిహద్దు తగాదాలూ, యుద్ధాలూ చూసి, వేసారిపోయి ‘ఇంతేనా జీవితమంటే’ అనే మీమాంసకు వస్తాడు ప్రతిమనిషీను. ఈ వరస ప్రశ్నలతో పుట్టే జిజ్ఞాసతో ప్రతిమనిషీ, బయట దానికి జవాబు దొరకక, లోపలికి ఆలోచనను మళ్లిస్తాడు. బయట నుంచి దృష్టిని లోపలికి తిప్పడమే పెద్ద ముందడుగు. అప్పుడు లోపలున్న స్వచ్ఛమైన ‘నేను’ (అంటే ఆత్మ లేక భగవంతుడు) మౌనంగానే మాట్లాడుతుంది. ఆ మాటలను ప్రతివాడూ వింటాడు గానీ వినిపించుకోడు; చెవిని మలుపుకొనో నులుముకొనో పరధ్యానాన్ని నటిస్తాడు. ఈ వ్యాఖ్యానం ఆ పరధ్యానాన్ని మాని, సూటిగా ఆ లోపలి నుంచి వచ్చే మాటలను శ్రద్ధగా వినమని చెబుతుంది.
- మిగతా వ్యాఖ్యానాలకూ మీ వ్యాఖ్యానానికీ ఉన్న ప్రధాన తేడా?
ప్రతి అధ్యాయమూ ఒక్కొక్క యోగమే అయినా యోగశాస్త్రంగా భగవద్గీతకు తెలుగులో ఒక్క వ్యాఖ్యానమూ లేదు. యోగమంటే పరమాత్మతో శరీరాల్లో మగ్గుతూ ఉన్న ఆత్మను కలుపుకోడమూ దానికోసం అనుసరించవలసిన ఉపాయమూను. అంతేతప్ప వట్టి ఆసనాలూ ముద్రలూ మాత్రమే కాదు. శ్రీ పరమహంస యోగానందగారిని అనుసరిస్తూ, పతంజలి మహర్షి చెప్పిన యోగసూత్రాలతో భగవద్గీతా శ్లోకాలను పోల్చుకొంటూ, ఇతరమైన ఉపనిషత్తులతోనూ వేదమంత్రాలతోనూ తులనను చూపిస్తూ నా వ్యాఖ్యానం సాగింది.
- ఈ పుస్తకం ద్వారా పాఠకుడికి అందగల పరమార్థం ఏమిటనుకుంటున్నారు?
‘నీలోనే దుర్యోధనుడు ఉన్నాడు, ధర్మరాజూ ఉన్నాడు, శ్రీకృష్ణుడూ ఉన్నాడు. వాళ్లందర్నీ ఏవో కథలోని పాత్రలుగా సరిపెట్టుకొని అసలు విషయాన్ని దాటెయ్యకు. అవతలి పోరాటాల కన్నా నీలోనే మంచికీ చెడుకీ మధ్య జరుగుతూన్న జగడాలే ముఖ్యమైనవి.వాటిల్లో గెలవడానికి ప్రయత్నిస్తే, బయటి పోట్లాటలూ వాటికవే సద్దుమణుగుతాయి. అన్నిరకాల పోరాటాలూ మనస్సు తాలూకు ఆవేశాల వల్ల పుట్టుకొచ్చినవే. ఆ ఆవేశాలను జయించడానికి, ప్రాణాన్ని అదుపులో పెట్టుకో. మనస్సూ ప్రాణమూ ఒకదాన్నొకటి విడిచి ఉండలేవు. ప్రాణాన్ని అదుపులో పెట్టుకోవడమే తడవు, మనస్సూ అదుపులోకి వస్తుంది. మనస్సు అణిగిపోగానే అహంకారమూ అణిగిపోతుంది’.
ఇలా గ్రంథం పొడుగునా ప్రమాణ వాక్యాలను సూచిస్తూ అక్కడక్కడ చిన్ని చిన్ని కథల ద్వారా విషయాన్ని ఆకళింపుకు తేవడానికి ప్రయత్నం చేశాను. జిజ్ఞాసువులకూ సాధకులకూ ఆధ్యాత్మిక లాభాన్ని చేకూర్చే పుస్తకం ఇది. ఆ ఉద్దేశంతోనే దీన్ని రాయడం జరిగింది.
- డాక్టర్ ముంజులూరి నరసింహారావు