హోమియోపతి అభివృద్ధికి జాతీయ కమిషన్
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా హోమియోపతిని ప్రోత్సహించడంతో పాటు నైపుణ్యమున్న వైద్య నిపుణుల్ని ఆకర్షించేందుకు వీలుగా ఓ నియంత్రణ సంస్థను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు కేంద్రం తెలిపింది. నేషనల్ హోమియోపతి కమిషన్(ఎన్సీహెచ్) పేరుతో ఏర్పాటు కానున్న ఈ సంస్థ హోమియోపతి రంగంలో నాణ్యమైన విద్యతో పాటు, పరిశోధనల్ని పర్యవేక్షిస్తుందని ఆయుష్ మంత్రిత్వ శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు మనోజ్ రజోరియా వెల్లడించారు.
ప్రపంచ హోమియోపతి దినోత్సవం సందర్భంగా సెంట్రల్ కౌన్సిల్ ఫర్ హోమియోపతి(సీసీఆర్హెచ్) నిర్వహించిన రెండురోజుల సదస్సు ముగింపు కార్యక్రమంలో మనోజ్ మాట్లాడారు. ‘ఎన్సీహెచ్లో ఉండే నాలుగు బోర్డులు డిగ్రీ, పీజీ కోర్సుల పర్యవేక్షణ, విద్యాసంస్థలకు అక్రిడేషన్ ఇవ్వడం, తనిఖీ చేయడం, డాక్టర్ల సంఖ్యను నియంత్రించడం వంటి కార్యకలాపాలను పర్యవేక్షిస్తాయి’ అని ఆయన తెలిపారు.