Manoj Sharma: వారెవ్వా.. నిజంగానే మధుర జ్ఞాపకం!
కొందరి గురించి తెలిసినా.. వాళ్ల విజయగాథలు చదివినా(చూసినా).. వాళ్ల మీద గౌరవం అమాంతం పెరిగిపోతుంది. అలా యావత్ దేశం నుంచి 12th ఫెయిల్ చిత్రం ద్వారాసెల్యూట్ అందుకున్న అధికారి మనోజ్ కుమార్ శర్మ. అది ఈయన బయోపిక్ అని ప్రత్యేకంగా ఇక్కడ చెప్పనక్కర్లేదనుకుంటాం.
క్వారీ కూలీ, ఓ మాస్టారింట్లో పనివాడు, లైబ్రరీకి సెక్యూరిటీ గార్డు, మిల్లు కూలీ, వంటవాడు, చివరికి- కుక్కల్ని రోజూ వాకింగ్‌కి తీసుకెళ్ళేవాడు.. ఇన్ని పనులూ చేశాడీయన. కడు పేదరికంలో పెరిగిన యువకుడు.. కష్టాల కడలిని ఈదీ సివిల్స్ కలల తీరానికి ఎలా చేరాడనేది క్షుప్తంగా ఆయన సక్సెస్‌స్టోరీ. ఇన్ని పనులు చేసినా.. ఎక్కడా అదే తన బతుకని ఆగిపోలేదు. ‘జీవితాన్ని ఏ స్థాయి నుంచైనా రీ-స్టార్ట్’ చేయొచ్చని నమ్మాడు. ఆ నమ్మకమే ఆయన్ని ఉన్నత అధికారిగా నిలబెట్టింది.
ముంబయి మహానగరానికి అడిషనల్ కమిషనర్‌గా ఉంటున్న మనోజ్ జీవితాన్ని ఆయన మాజీ రూమ్మేట్ పాండే ఉరఫ్ అనురాగ్ పాథక్ ‘ట్వెల్త్ ఫెయిల్’ అనే పుస్తకంగా రాశాడు. దాన్నే- ప్రముఖ హిందీ దర్శకుడు విధూ వినోద్ చోప్రా సినిమాగా తీసి సూపర్‌హిట్ కొట్టాడు.
ఇక ఈ ఫొటో.. తన వివాహం జరిగిన కొన్ని రోజులకు దిగారట. తాజాగా ఆ ఫొటో దొరికిందంటూ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారాయన. భార్య శ్రద్ధా జోషితో సరదాగా నదీ తీరాన దిగిన ఫొటో అది. ఇంకేం.. ఆయన ఫాలోవర్స్ ఆ ఫొటోను లైక్ చేసేస్తున్నారు. జోషి కూడా సివిల్స్ అధికారిణే(ఐఆర్ఎస్). యూపీఎస్సీ క్లాస్‌ల సమయంలోనే వీళ్ల మధ్య బంధం ఏర్పడింది. 12th ఫెయిల్ చిత్రంలో అది తెరపై భావోద్వేగంగా చూపించారు.
सर आप बहुत भाग्यशाली हो कि आपको ऐसी धर्मपत्नी मिली जिनके भीतर आपके लिए सच्चा प्रेम है ।
जबकि अधिकतर मामलों में देखा गया है लड़की उसी लड़के से शादी करती है जो सफल होता है । pic.twitter.com/nZCqllINbl
— Nadeem Ram Ali (@NadeemRamAli) January 10, 2024
మనోజ్ కథలోకి వెళ్తే..
మనోజ్‌ది మధ్యప్రదేశ్ రాష్ట్రం మొరానాబాద్ జిల్లాలోని బిల్గ్రామ్ అనే కుగ్రామం. తండ్రి వ్యవసాయశాఖలో చిరుద్యోగి కానీ పైఅధికారి అక్రమాలని బయటపెట్టినందుగ్గాను సస్పెండ్ అయ్యాడు. దాంతో వాళ్లది ఆదాయంలేని ఇల్లయింది. ఆ సమయంలోనే మనోజ్ ఇంటర్ పరీక్షలకి హాజరయ్యాడు. అక్కడి బడులు తమ పాస్ పర్సంటేజీని ఎక్కువగా చూపించుకోవడం కోసం విద్యార్థుల చేత మాస్‌కాపీయింగ్ చేయించడం ఆనవాయితీ. మనోజ్ సహా ఓ రోజు విద్యార్థులందరూ యథేచ్ఛగా చూసి రాస్తుండగా... అక్కడికొచ్చారు దుష్యంత్ సింగ్ అనే సబ్‌డివిజినల్ మేజిస్ట్రేట్(ఎస్డీఎం). ఇదివరకటి అధికారుల్లా చూసీచూడనట్టు వెళ్ళిపోలేదాయన.. కాపీయింగ్‌ని ఆపేశాడు. పరీక్షలున్న అన్నిరోజులూ అక్కడే మకాం వేశాడు! ఫలితంగా ఆ స్కూల్ నుంచి ఇద్దరే పాసయ్యారు. మనోజ్ అయితే ఒక్క హిందీలో తప్ప అన్ని సబ్జెక్టుల్లోనూ ఫెయిలయ్యాడు. అయితేనేం- ఆ అధికారిలోని నిజాయతీ, ముక్కుసూటిదనం మనోజ్‌ని కట్టిపడేశాయి. తానూ అలాంటి అధికారి కావాలనుకున్నాడు. అక్కడి నుంచి ఒడిదుడుకుల నడుమ మనోజ్ ప్రయాణం ఎలా సాగిందో.. Disney+ Hotstarలో స్ట్రీమ్ అవుతున్న ట్వెల్త్ ఫెయిల్ చూసి మీరే తెలుసుకోండి.