‘ధోనిలా సిక్స్‌లు బాదడమే నాధ్యేయం’
సాక్షి, స్పోర్ట్స్ : ఇండియన్ క్యాష్ రిచ్ లీగ్‌గా పేరొందిన ఐపీఎల్ అనామక క్రికెటర్ల జీవితాల్లో వెలుగు నింపుతోంది. ప్రతి సీజన్లో ఓ కొత్త క్రికెటర్ జీవితాన్ని కెరీర్ పరంగా.. ఆర్థికపరంగా వారు ఊహించనంతలా మార్చేస్తుంది. ఒకప్పుడు రూ.60 రోజు కూలి పొందిన కశ్మీర్ యువ ఆటగాడు మంజూర్ ధార్ ఈ సారి జరిగన వేలంలో రూ.20లక్షలు పలికి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు ఎంపికయ్యాడు. దీంతో కశ్మీర్ నుంచి ఐపీఎల్‌కు ఎంపికైన తొలి క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. ఈ ఎంపికతో కశ్మీర్ వ్యాప్తంగా మంజూర్ ధార్‌కు అభినందనలు వెల్లువెత్తాయి. ఇక అతని సొంత గ్రామ ప్రజలు నాట్యం చేస్తూ పండుగ చేసుకున్నారు.
రాత్రివేళ సెక్యూరిటీ గార్డ్.. పగలు క్రికెటర్
రెక్కాడితేగాని డొక్కాడని జీవితం మంజూర్ ధార్ది. నలుగురు చెల్లెల్లు, ముగ్గురు తమ్ముళ్లతో కుటుంబ బాధ్యత తనపై ఉన్నా ఆటపై ఉన్న మక్కువతో ఒకవైపు సెక్యూరిటీ గార్డ్‌గా రాత్రి వేళలో పనిచేస్తూ.. పగలు లోకల్ కోచ్ సాయంతో క్లబ్ క్రికెట్ ఆడేవాడు. 2008 నుంచి 2012 వరకు ఇలా క్లబ్ క్రికెట్ ఆడిన మంజూర్ రాష్ట్ర జట్టులో చోటు కోసం ప్రయత్నించాడు. అనంతరం 2017లో కశ్మీర్ తరపున తొలి మ్యాచ్ ఆడాడు. సహజసిద్దమైన ఆటతో అలవోకగా సిక్సులు బాదేవాడు. దీంతో ప్రత్యేక గుర్తింపు పొందాడు. ఈ ఏడాదిలోతన సొంత రాష్ట్రం తరపున 9 టీ20లు, నాలుగు లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడాడు. ఇక భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన పర్వేజ్ రసూల్, మంజూర్ ధార్లే కశ్మీర్ తరపున వేలంలో పాల్గొనగా మంజూర్ ఎంపికవడం విశేషం. కోట్ల రూపాయలు పలకకపోయినా ఈ వేదిక అతని కెరీర్‌కు, కుటుంబానికి ఉపయోగపడుతుందని చెప్పొచ్చు.
ధోనిలా సిక్స్‌లు బాదడమంటే ఇష్టం..
ఈ ఎంపికపై ఆనందం వ్యక్తం చేసిన మంజూర్ ధోనిలా సిక్స్‌లు బాదడమే తనకిష్టమని చెప్పుకొచ్చాడు. తనపై నమ్మకం ఉంచిన పంజాబ్ యజమాని ప్రీతిజింతాకు ధన్యవాదాలు తెలిపాడు. నా జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంటూ వచ్చా.. ఇప్పుడు ఐపీఎల్ వేలంలో ఎంపికవడం సంతోషంగా ఉందన్నాడు. ఒకప్పుడు రూ.60 కూలీకి పని చేసానని, క్రికెట్ ఆడే రోజుల్లో తనకి కనీసం షూ కూడా లేవని గుర్తు చేసుకున్నాడు. తన అభిమాన క్రికెటర్ యువరాజ్‌తో డ్రెస్సింగ్ రూమ్ పంచుకునే అవకాశం రావడం మరింత సంతోషాన్నిస్తుందన్నాడు. నా ఎంపికనంతరం మా అమ్మను సుమారు 30 వేల మంది కలిసి అభినందించారని చెబుతూ ఆనందం వ్యక్తం చేశాడు. కొత్త ఇళ్లును ప్రారంభించి మూడేళ్లు అవుతుందని, దానికి కనీసం డోర్స్, కిటీకీలు కూడా లేవని ఇప్పుడు ఈ డబ్బుతో అది పూర్తి చేస్తానని, మా చెల్లెల్లు, తమ్ముళ్లను బాగా చదివిస్తానని చెప్పుకొచ్చాడు. తన తల్లి ఆరోగ్యం సైతం బాలేదని, ఆమెకు మెరుగైన చికిత్స అందిస్తానని పేర్కొన్నాడు.