అధికార పార్టీ నేతల్లో కలవరం
‘రాష్ట్రంలో నియంతపాలన నడుస్తోంద’ంటూ మావోయిస్టు పార్టీ కేంద్ర కార్యదర్శి గణపతి చేసిన వ్యాఖ్యలతో అధికార పార్టీ నేతల్లో ఆందోళన మొదలైంది. గణపతి వ్యాఖ్యలను పాలక పక్షానికి హెచ్చరికగా భావిస్తున్న పోలీసు ఉన్నతాధికారులు తమ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్టు తెలుస్తోంది.
పెద్దపల్లి : ఇంతకాలం మావోయిస్టు పార్టీ తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలుపడమే కాకుండా టీఆర్ఎస్ పట్ల సానుకూలంగా ఉందన్న అభిప్రాయాలున్నాయి. రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారం చేపట్టిన ఆరు నెలల తర్వాత పాలకపక్ష విధానాలను స్వయంగా మావోయిస్టు పార్టీ చీఫ్ గణపతి తప్పుబట్టడం ప్రాధాన్యం సంతరించుంది.
మావోయిస్టు పార్టీ విధానమే తన విధానమంటూ అధికారంలోకి వచ్చిన కేసీఆర్ నిర్బంధాన్ని అమలు చేస్తున్నారంటూ సీఎంను ఒక నియంతగా పేర్కొనడం సంచనలం కలిగించింది. ముఖ్యమంత్రితో పాటు ప్రభుత్వంపై గణపతి మండిపడ్డ నేపథ్యంలో జిల్లాలో పోలీసు యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది. కొంతకాలంగా మౌనంగా ఉంటున్న మావోయిస్టులు ప్రభుత్వంపై విరుచుకపడడంతో అధికార పార్టీ నాయకులకు పోలీసులు మరింత భద్రత కల్పించాల్సిన అవసరం ఏర్పడింది.
తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లో పార్టీ బలంగా ఉండి సమాంతర పాలన కొనసాగిస్తోంది. ఇదేక్రమంలో ఆ పార్టీ మళ్లీ తెలంగాణలో బలపడేందుకు ప్రయత్నిస్తున్నట్టు పోలీసు యంత్రాంగం అనుమానిస్తోంది. గతనెలలో పౌరహక్కుల సంఘాలు హైదరాబాద్లో తలపెట్టిన సభను ప్రభుత్వం అడ్డుకున్నప్పటి నుంచి కేసీఆర్పై విప్లవసంఘాలు, హక్కుల సంఘాల నేతలు విమర్శలు సంధిస్తున్నారు.
ఇదే సమయంలో గణపతి కేసీఆర్పై చేసిన ప్రకటన అధికారపార్టీ నాయకులను కలవరపెడుతోంది. రెండు నెలలక్రితం ఆదిలాబాద్ పరిసరాల్లో జరిగిన ఎన్కౌం టర్లో మహారాష్ట్రకు చెందిన దళం హతమైంది. అప్పటినుంచే అధికార పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యులకు భద్రతను పెంచారు. పోలీసుస్టేషన్లకు సమాచారం ఇచ్చిన తర్వాతనే ఎంపీలు, ఎమ్మెల్యేలు పర్యటనను ఖరారు చేసుకోవాలని పోలీసు అధికారులు ప్రజాప్రతినిధులకు సూచించారు.
ప్రస్తుతం అదే పద్ధతిలో నాయకుల పర్యటనలు కొనసాగుతున్నాయి. తాజాగా గణపతి హెచ్చరికతో ప్రజాప్రతినిధులు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. డిసెంబర్ 2నుంచి కొయ్యూర్ మృతవీరుల సంస్మరణార్థం మావోయిస్టు పార్టీ తలపెడుతున్న పీఎల్జీఏ వారోత్సవాల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమవుతుండగానే గణపతి ప్రకటన మరింత కలకలం రేపుతోంది.