తల్లిని చూసేందుకు తేజ్పాల్కు అనుమతి
పనాజీ: సహచర ఉద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో జైలుపాలైన తెహల్కా వ్యవస్థాపక సంపాదకుడు తరుణ్ తేజ్పాల్ తాత్కాలిక ఊరట లభించింది. అనారోగ్యంతో బాధ పడుతున్న తన తల్లి శంకుతలను చూసేందుకు ఆయనకు గోవా కోర్టు అనుమతినిచ్చింది. మాపుసా పట్టణంలోని ఆస్పత్రిలో ఉన్న తన తల్లిని రేపు ఉదయం ఆయన కలుసుకోనున్నారు. మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న శకుంతల ఐసీయూలో ఉన్నారు.
కాగా, తేజ్పాల్ పెట్టుకున్న బెయిల్ అభ్యర్థనను బాంబే హైకోర్టులోని గోవా బెంచ్ తిరస్కరించింది. ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. గతేడాది నవంబర్లో గోవాలోని ఓ హోటల్లో సహచర మహిళా ఉద్యోగిపై లైంగిక దాడికి పాల్పడినట్టు తేజ్పాల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.