Market transactions
-
జూలై1న ఆర్బీఐ ఆఫీసులు తెరిచే ఉంటాయి
ముంబై: ఆర్బీఐ కార్యాలయాలు వచ్చే నెల1న యధావిధిగానే పనిచేస్తాయి. మార్కెట్ లావాదేవీల సెటిల్మెంట్ కోసం వచ్చే నెల 1(శుక్రవవారం) తమ కార్యాలయాలు పనిచేస్తాయని ఆర్బీఐ పేర్కొంది. సాధారణంగా ఖాతాల వార్షిక ముగింపు సందర్భంగా ప్రతి ఏడాది జూలై1న ఆర్బీఐ లావాదేవీలను అనుమతించదు. ఆర్బీఐ అకౌంటింగ్ ఇయర్ జూలై 1న ప్రారంభమై జూన్ 30న ముగుస్తుంది. ఆర్టీజీఎస్(రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్), నెఫ్ట్(నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్) సౌకర్యాలు 11 గంటల తర్వాత అందుబాటులో ఉంటాయని పేర్కొంది. లిక్విడిటీ అడ్జెస్ట్మెంట్ ఫెసిలిటి/మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ కింద ట్రాన్సాక్షన్ల సెటిల్మెంట్ కూడా ఉదయం 11 గంటల తర్వాతే అందుబాటులో ఉంటుందని వివరించింది. ఎల్ఏఎఫ్(లిక్విడిటీ అడ్జెస్ట్మెంట్ ఫెసిలిటీ) రెపో విండో ఉదయం 11.30-సాయంత్రం 3 గంటల మధ్య, 14 రోజుల టర్మ్ రెపో ఆక్షన్ విండో మధ్యాహ్నం 12.30 నుంచి ఒంటి గంట వరకూ పనిచేస్తాయని ఆర్బీఐ వెల్లడించింది. -
బెల్లం మార్కెట్‌కు ఆషాడం దెబ్బ
- లావాదేవీలు నామమాత్రం - తగ్గిపోతున్న ధరలు - గిట్టుబాటుకాక రైతుల ఆందోళన అనకాపల్లి: బెల్లం తయారీ సీజన్ ముగియడంతో జాతీయ స్థాయిలో రెండవ స్థానంలో ఉన్న అనకాపల్లి బెల్లం మార్కెట్లో లావాదేవీలు మందగించాయి. ఒకవైపు అన్ సీజన్, మరోవైపు ఆషాడమాసం కావడంతో ధరలు నేలచూపులు చూస్తున్నాయి. ఏప్రిల్, మే వరకూ తయా రు చేసిన బెల్లాన్ని ప్రస్తుతం గోదాముల్లో నిల్వ చేస్తున్నారు. గతేడాది హుద్‌హుద్ ధాటికి కకావికలమైన అనకాపల్లి బెల్లం మార్కెట్లో ఇంకా చేదు ఫలితాలు కనిపిస్తున్నాయి. అనకాపల్లి మార్కెట్‌కు శనివారం 195 బెల్లం దిమ్మలు మాత్రమే వచ్చాయి. అక్టోబర్ వరకూ ఇదే తరహా పరిస్థితులు కొనసాగేలా ఉంది. ధరలు సైతం మార్కెట్ వర్గాలను నిరాశ పరుస్తున్నాయి. మొదటి రకం బెల్లం రాకపోవడం ప్రతికూల స్థితిని ప్రస్పుటం చేస్తుండగా, రెండో రకం గరిష్టంగా క్వింటా రూ. 2480లు, మూడో రకం కనిష్టంగా క్వింటాల్ రూ. 2210లు ధర పలుకుతున్నాయి. దీంతో మార్కెట్ బోసిపోయినట్టు కనిపిస్తోంది. గతేడాది జూలైలోనూ ఇదే తరహా పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఏడాది జూలైలో కేవలం 2014 క్వింటాళ్ల లావాదేవీలు మాత్రమే సాగాయి. మొదటి రకం గరిష్టంగా రూ. 2838లు, కనిష్టంగా రూ. 2540లకు అమ్ముడుపోయింది. నెలంతా కేవలం 45,47,122 రూపాయల వ్యాపారమే జరిగింది. 2013లో మార్కెట్లో క్వింటా గరిష్టంగా రూ.4వేలు దాటిన సందర్భం ఉంది. ఇదే దూకుడు 2014లోనూ కొనసాగుతుందని మార్కెట్ వర్గాలు ఆశించినప్పటికీ ప్రతికూల పరిస్థితులే ఎదురయ్యాయి. చివరకు గతేడాది హుద్‌హుద్ మార్కెట్‌ను కోలుకోలేని దెబ్బతీసింది. 2015లో కూడా మార్కెట్లో ప్రతికూల పరిస్థితులే కొనసాగుతున్నాయి. చెరకు రైతు విలవిల... రోజురోజుకు బెల్లం ధరలు తగ్గిపోవడంతో చెరకు రైతులు ఆందోళన చెందుతున్నారు. క్వింటా ధర రూ.2210లకు పడిపోవడం, చక్కెర మిల్లులు టన్నుకు రూ. 2300లకు మించి చెల్లించకపోవడంతో వారికి మింగుడు పడడంలేదు. చెరకు సరఫరా చేసిన సభ్య రైతులకు నెలల తరబడి చెల్లింపులు లేకపోవడంతో అప్పుల పాలవుతున్నారు. మిల్లులకు తరలించే బదులు బెల్లం తయారు చేసుకుందామన్నా...మార్కెట్లో గిట్టుబాటు ధర లభించడం లేదు. పరిస్థితులు చెరకు రైతులను నిరాశకు గురిచేస్తున్నాయి. -
డీఎల్ఎఫ్కు ‘శాట్’ ఊరట
సెబీ మూడేళ్ల నిషేధం ఆదేశాల కొట్టివేత న్యూఢిల్లీ: ఐపీవో అవకతవకలకు గాను మూడేళ్ల పాటు మార్కెట్ లావాదేవీలు జరపకుండా నిషేధాన్ని ఎదుర్కొంటున్న రియల్టీ దిగ్గజం డీఎల్ఎఫ్కు ఊరట లభించింది. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ విధించిన నిషేధాన్ని త్రిసభ్య సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్(శాట్) ‘మెజారిటీ ఆర్డరు’తో కొట్టి వేసింది. అలాగే, కంపెనీ చైర్మన్ కేపీ సింగ్ సహా ఆరుగురు అధికారులపై నిషేధాన్ని కూడా ఎత్తివేసింది. శుక్రవారం నాటకీయ పరిణామాల మధ్య ఇందుకు సంబంధించిన ఆదేశాలు వెలువడ్డాయి. సెబీ నిషేధాన్ని తోసిపుచ్చుతూ శాట్‌లో ఇద్దరు సభ్యులు (జోగ్ సింగ్, ఏఎస్ లాంబా) మెజారిటీ ఆర్డరు ఇచ్చారు. కానీ, అందుకు భిన్నంగా నిషేధాన్ని మూడేళ్ల నుంచి ఆరు నెలలకు తగ్గిస్తూ శాట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ జేపీ దేవధర్ ఆదేశాలు ఇచ్చారు. నిషేధం తొలగింపుపై భిన్నాభిప్రాయాల కారణంగా మెజారిటీ ఉత్తర్వులపై నాలుగు వారాల స్టే విధించాలన్న దేవధర్ సూచనను మిగతా ఇద్దరు సభ్యులూ తోసిపుచ్చారు. ఏడేళ్ల క్రితం రూ. 9,000 కోట్ల ఐపీవో విషయంలో కీలకమైన అంశాలను ఉద్దేశపూర్వకంగా తొక్కిపెట్టి ఉంచారన్న ఆరోపణలపై డీఎల్ఎఫ్ కంపెనీతో పాటు చైర్మన్ సహా ఆరుగురిపై 2014లో సెబీ మూడేళ్ల నిషేధం, రూ. 86 కోట్ల జరిమానా విధించింది. కంపెనీకి చెందిన ముగ్గురు ఉద్యోగుల భార్యలతో షేర్ల కొనుగోళ్లు జరిపించడం ద్వారా మోసపూరిత లావాదేవీలకు తెరతీసిందని ఆరోపించింది. దీన్నే సవాలు చేస్తూ డీఎల్ఎఫ్ శాట్‌ను ఆశ్రయించగా తాజా ఆదేశాలు వెలువడ్డాయి. మరోవైపు, శాట్ ఉత్తర్వులను డీఎల్ఎఫ్ స్వాగతించింది. శాట్ నుంచి అనుకూల ఆదేశాలతో శుక్రవారం బీఎస్ఈలో డీఎల్ఎఫ్ షేరు 6 శాతం ఎగిసి రూ. 157.5 వద్ద ముగిసింది.