బెల్లం మార్కెట్‌కు ఆషాడం దెబ్బ
- లావాదేవీలు నామమాత్రం
- తగ్గిపోతున్న ధరలు
- గిట్టుబాటుకాక రైతుల ఆందోళన
అనకాపల్లి: బెల్లం తయారీ సీజన్ ముగియడంతో జాతీయ స్థాయిలో రెండవ స్థానంలో ఉన్న అనకాపల్లి బెల్లం మార్కెట్లో లావాదేవీలు మందగించాయి. ఒకవైపు అన్ సీజన్, మరోవైపు ఆషాడమాసం కావడంతో ధరలు నేలచూపులు చూస్తున్నాయి. ఏప్రిల్, మే వరకూ తయా రు చేసిన బెల్లాన్ని ప్రస్తుతం గోదాముల్లో నిల్వ చేస్తున్నారు. గతేడాది హుద్‌హుద్ ధాటికి కకావికలమైన అనకాపల్లి బెల్లం మార్కెట్‌లో ఇంకా చేదు ఫలితాలు కనిపిస్తున్నాయి. అనకాపల్లి మార్కెట్‌కు శనివారం 195 బెల్లం దిమ్మలు మాత్రమే వచ్చాయి.
అక్టోబర్ వరకూ ఇదే తరహా పరిస్థితులు కొనసాగేలా ఉంది. ధరలు సైతం మార్కెట్ వర్గాలను నిరాశ పరుస్తున్నాయి. మొదటి రకం బెల్లం రాకపోవడం ప్రతికూల స్థితిని ప్రస్పుటం చేస్తుండగా, రెండో రకం గరిష్టంగా క్వింటా రూ. 2480లు, మూడో రకం కనిష్టంగా క్వింటాల్ రూ. 2210లు ధర పలుకుతున్నాయి. దీంతో మార్కెట్ బోసిపోయినట్టు కనిపిస్తోంది. గతేడాది జూలైలోనూ ఇదే తరహా పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఏడాది జూలైలో కేవలం 2014 క్వింటాళ్ల లావాదేవీలు మాత్రమే సాగాయి. మొదటి రకం గరిష్టంగా రూ. 2838లు, కనిష్టంగా రూ. 2540లకు అమ్ముడుపోయింది. నెలంతా కేవలం 45,47,122 రూపాయల వ్యాపారమే జరిగింది.
2013లో మార్కెట్లో క్వింటా గరిష్టంగా రూ.4వేలు దాటిన సందర్భం ఉంది. ఇదే దూకుడు 2014లోనూ కొనసాగుతుందని మార్కెట్ వర్గాలు ఆశించినప్పటికీ ప్రతికూల పరిస్థితులే ఎదురయ్యాయి. చివరకు గతేడాది హుద్‌హుద్ మార్కెట్‌ను కోలుకోలేని దెబ్బతీసింది. 2015లో కూడా మార్కెట్‌లో ప్రతికూల పరిస్థితులే కొనసాగుతున్నాయి.
చెరకు రైతు విలవిల...
రోజురోజుకు బెల్లం ధరలు తగ్గిపోవడంతో చెరకు రైతులు ఆందోళన చెందుతున్నారు. క్వింటా ధర రూ.2210లకు పడిపోవడం, చక్కెర మిల్లులు టన్నుకు రూ. 2300లకు మించి చెల్లించకపోవడంతో వారికి మింగుడు పడడంలేదు. చెరకు సరఫరా చేసిన సభ్య రైతులకు నెలల తరబడి చెల్లింపులు లేకపోవడంతో అప్పుల పాలవుతున్నారు. మిల్లులకు తరలించే బదులు బెల్లం తయారు చేసుకుందామన్నా...మార్కెట్‌లో గిట్టుబాటు ధర లభించడం లేదు. పరిస్థితులు చెరకు రైతులను నిరాశకు గురిచేస్తున్నాయి.