marriage cancelled
-
నిశ్చితార్థం అయింది.. పెళ్లికి అబ్బాయి నో అన్నాడని..
భువనగిరి: మనస్తాపానికి గురై చెరువులో దూకి యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన భువనగిరి మండల పరిధిలోని రాయగిరి చెరువు వద్ద చోటు చేసుకుంది. పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్‌లోని లాలాపేటకు చెందిన బసవరాజు, భారతి దంపతులకు ఐదుగురు కుమార్తెలు. వీరిలో గీతారాణి (34) ఎంబీఏ పూర్తిచేసి ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది. చదవండి: ‘మీ అమ్మకు బీపీ డౌన్ అయ్యింది.. మీరు కూడా రండి’ వరంగల్ కాజీపేటకు చెందిన టి. విజయ్‌కుమార్‌తో గీతారాణికి గతంలో నిశ్చితార్ధం అయ్యింది. డిసెంబర్ 9, 2020న పెళ్లి తేదీ నిర్ణయించారు. కాగా అనారోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పి అబ్బాయి వివాహం చేసుకోవడానికి నిరాకరించాడు. అప్పటి నుంచి గీతారాణి డిప్రెషన్లోకి వెళ్లింది. బుధవారం మధ్యాహ్నం బ్యాంక్‌కు వెళ్లి వస్తానని చెప్పి ఇంటి నుంచి బయలుల్దేరిన గీతారాణి సాయంత్రం 4 గంటల తర్వాత కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. చదవండి: రూ.70 కోసం వాగ్వాదం: గొడ్డలితో దాడి కాగా రాత్రి భువనగిరిలోని రాయగిరి చెరువు కట్ట మీద యువతి చెప్పులు, ఆధార్‌కార్డు పడి ఉండటం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆధార్‌కార్డు ఆధారంగా కుటుంబ సభ్యులకు విషయం తెలియజేశారు. గురువారం ఉదయం పోలీసులు గాలింపు చర్యలు మొదలుపెట్టగా, చివరికి ఎన్డీఆర్ఎఫ్ బృందాల సహయంతో మధ్యాహ్నం చెరువులో నుంచి గీతారాణి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై సైదులు తెలిపారు. -
తాగి రచ్చ చేసిన వరుడు... ఊహించని షాక్!
లక్నో: ‘పెళ్లి’ అనేది ‘నూరేళ్ల పంట’ అనీ, ‘నూరు ఏళ్లపాటు సాగవలసిన పంట’ అనీ అంటారు. అలాగే ‘శత ఆయుష్మాన్ భవ’ - ‘ వంద సంవత్సరాలు ఆనందంగా జీవించు’ అనేది పెద్దలందరూ పిల్లలకిచ్చే ఆశీర్వాదం. ఇక పెళ్లి సందడి గురించి చెప్పాలంటే అసలు సమయమే సరిపోదు. అయితే తాజాగా ఓ వరుడు, అతని స్నేహితులు పెళ్లి వేదిక వద్దకు తాగి రావడంతో ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్ (అలహాబాద్)లో ఓ 22 ఏళ్ల యువతి పెళ్లికి నిరాకరించింది. వివాహా నిశ్చయానికి ముందు ఇచ్చిన బహుమతులు తిరిగి ఇవ్వడానికి అంగీకరించే వరకు వదువు కుటుంబం వరుడి తరుపు వాళ్లని బందీగా ఉంచింది. దీంతో పెళ్లికొడుకు కుటుంబం పోలీసులను పిలిచి సమస్యను పరిష్కరించమని అభ్యర్థించింది. తిక్రీ గ్రామంలోని ఒక రైతు తన కుమార్తె వివాహాన్ని రవీంద్ర పటేల్ అనే వ్యక్తితో ఏర్పాటు చేశాడు. అయితే పెళ్లి రోజున వరుడు, అతని స్నేహితులు కొందరు తాగి పెళ్లి మండపం వద్దకు వచ్చారు. వధువు, ఆమె కుటుంబం పెళ్లి కొడుకు, అతని స్నేహితులు చేసే చేష్టలకు చాలా సార్లు హెచ్చరించారు. అయితే పెళ్లికి కొద్ది నిమిషాల ముందు వరుడు వధువును డ్యాన్స్ చేయమని బలవంతం చేయడంతో పరిస్థితి మలుపు తిరిగింది. పెళ్లి కూతురు డ్యాన్స్ చేయడానికి నిరాకరించింది. అయితే వరుడు విసిగెత్తి.. బీభత్సం సృష్టించాడు. దీంతో అతని ప్రవర్తనకు విసుగెత్తిన వధువు పెళ్లికి నిరాకరించింది. అయితే ఈ విషయాన్ని పరిష్కరించడానికి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇక చివరకు వరుడి కుటుంబం పెళ్లికి ముందు తీసుకున్న నగదు, ఇతర వస్తువులను పెళ్లి కుమార్తె కుటుంబానికి తిరిగి ఇవ్వడానికి అంగీకరించడంతో సమస్య పరిష్కారమైంది. కానీ పెళ్లి ఆగిపోయింది. (చదవండి: దారుణం: భార్యా.. పిల్లలను బావిలో నెట్టివేసి భర్త.. ఆపై రాళ్ల దాడి) -
పెళ్లి రద్దు.. అమెరికాలో ఏపీ యువతి ఆత్మహత్య
చిత్తూరు: పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువతి బలవన్మరణానికి పాల్పడింది. తన పెళ్లి అకస్మాత్తుగా రద్దవడంతో ఆత్మహత్య చేసుకుంది. పెళ్లి జరగాల్సిన రోజే ఆమె ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన అమెరికాలోని డల్లాస్‌లో జరిగింది. ఆమె మరణంతో ఏపీలోని చిత్తూరు జిల్లాలో విషాదం అలుముకుంది. రెండు రోజుల్లో ఆమె మృతదేహం స్వదేశానికి రానుంది. అయితే పెళ్లి ఎందుకు రద్దయ్యింది? దానికి గల కారణాలు ఏమిటో ఇంకా తెలియరాలేదు. చిత్తూరుకు చెందిన ప్రసాద్ నాయుడు కుమార్తె సుష్మ అమెరికాలోని డల్లాస్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తుండేది. ఆమెకు చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం బందార్లపల్లికి చెందిన భరత్‌తో వివాహం నిశ్చయమైంది. మార్చి 4వ తేదీకి ముహూర్తం నిర్ణయించారు. అయితే భరత్ కుటుంబీకులు వివాహానికి ససేమిరా అన్నాడు. దీంతో వివాహం రద్దయ్యింది. అకస్మాత్తుగా పెళ్లి రద్దు కావడంతో సుష్మ మూడు రోజులుగా తీవ్ర మనస్తాపానికి లోనైంది. ఈ క్రమంలో అదే బాధతో డల్లాస్‌లోని తన నివాసంలో సుష్మ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సమాచారంతో చిత్తూరులో ఉన్న కుటుంబసభ్యులు దిగ్ర్భాంతికి గురయ్యారు. సుష్మ మృతితో కన్నీటి పర్యంతమవుతున్నారు. అయితే సుష్మ మృతదేహం రెండు రోజుల్లో స్వగ్రామానికి చేరే అవకాశం ఉంది. వివాహం రద్దు చేసుకున్న భరత్ కుటుంబసభ్యులపై యువతి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
చివరి నిమిషంలో ట్విస్ట్ ఇచ్చిన పెళ్లికొడుకు
సాక్షి, బోధన్‌టౌన్(బోధన్): వధూవరులు ఒకరినొకరు ఇష్టపడ్డారు.. ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పుకున్నారు.. అయితే పీటల మీదికొచ్చేసరికి పెళ్లికొడుకు ట్విస్ట్ ఇచ్చాడు.. పెళ్లి ససేమిరా వద్దన్నాడు.. దీంతో పెళ్లి నిలిచిపోయింది. ఈ సంఘటన శుక్రవారం బోధన్ పట్టణ కేంద్రంలో జరిగింది. బోధన్ పట్టణంలోని శక్కర్‌నగర్ కాలనీకి చెందిన యువకుడికి రాకాసీపేట్‌కు చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. పట్టణంలోని సీఎస్ఐ చర్చిలో ఇరువురికి వివాహం చేయాలని పెద్దలు నిశ్చయించారు. శుక్రవారం ఉదయం ఇరు కుటుంబాలతో పాటు బంధువులు పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు చర్చికి చేరుకున్నారు. చదవండి: వధువుకు కరోనా: అయినా పెళ్లి ఆగలేదు చర్చిలో ఫాదర్ మాట్లాడుతూ నీకు అబ్బాయి ఇష్టమా అని అడగగా అమ్మాయి ఇష్టమే అని తెలిపింది. కాని అక్కడే అబ్బాయి మొహం చాటేశాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకునేది లేదని చెప్పడంతో పెళ్లికూతురు, ఆమె తరపు బంధువులు, పెళ్లి కొడుకు తరపు బంధువులు అంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. పెళ్లికూతురు తరపు పెద్దలకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పెళ్లి నిరాకరణపై ఇరువర్గాల వారు పెళ్లికొడుకును ఎంత సముదాయించినా, మందలించినా ఎలాంటి సమాధానం రాకపోయేసరికి చివరికి పెళ్లిపెద్దలు మాట్లాడుకుని వివాహం క్యాన్సిల్ చేసుకుని ఎవరిదారిన వారు వెళ్లిపోయారు. -
విశాల్ పెళ్లి ఆగిపోయిందా?
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్‌కు హైదరాబాద్ అమ్మాయి అనీషాకు ఈ ఏడాది మార్చిలో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. అయితే తాజాగా వీరిద్దరు బ్రేకప్ చెప్పేసుకున్నట్టుగా కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. కొంతకాలంగా వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో వీరు పెళ్లి క్యాన్సిల్ చేయాలనుకుంటున్నట్టుగా తమిళ సినీ వర్గాలు చర్చించుకుంటున్నారు. దీనికి తోడు అనీషా.. తన సోషల్ మీడియా అకౌంట్ నుంచి విశాల్‌తో కలిసి దిగిన ఫోటోలను తొలగించటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్టైంది. విశాల్ ట్విటర్లో మాత్రం అనీషాతో కలిసి దిగిన ఫోటోలు ఇప్పటికీ అలాగే ఉండటంతో ఈ వార్తలు నిజమా.? కాదా..? అనుమానాలు కలుగుతున్నాయి. అయితే ఈ వార్తలపై ఇరు వర్గాలనుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. -
పీకలదాకా తాగి పెళ్లిపీటలెక్కాడు..
పట్నా : వివాహ వేదికపైకి పెళ్లికొడుకు మద్యం సేవించి రావడంతో వధువు పెళ్లికి నిరాకరించిన ఘటన బిహార్‌లోని దుమారిలో చోటుచేసుకుంది. పీకలదాకా మద్యం సేవించి పెళ్లి కుమారుడు మంటపానికి రావడంతో అతడితో వివాహానికి నిరాకరించిన యువతి తన తల్లితండ్రులతో ఆ విషయం తెలిపింది. వూటుగా మద్యం తాగిన పెళ్లికుమారుడు పరిసరాలను మర్చిపోయి వేదికపై అమర్యాదకరంగా వ్యవహరించడంతో అతడిని పెళ్లి చేసుకునేందుకు తమ కుమార్తె నిరాకరించిందని పెళ్లికుమార్తె తండ్రి త్రిభువన్ షా చెప్పారు. దుమ్రి చాప్రియా గ్రామంలో జరిగిన వివాహ తంతులో పెళ్లి కుమారుడు బబ్లూ కుమార్ విపరీతంగా మద్యం సేవించడంతో తూలుతూ ఉన్నాడని, ఆయన వివాహ కార్యక్రమాలను చేపట్టే స్థితిలో లేడని బంధువులు చెప్పుకొచ్చారు. వరుడు తీరును గమనించిన పెళ్లి కుమార్తె వేదిక నుంచి దిగివెళ్లిపోయారు. ఇరు కుటుంబాల పెద్దలు వధువు రింకీ కుమారికి నచ్చచెప్పినా ఆమె వివాహానికి సుముఖత చూపలేదు. రింకీ తల్లితండ్రుల నుంచి పెళ్లికుమారుడి కుటుంబం తీసుకున్న కట్నం సొమ్మును తిరిగి ఇవ్వాలంటూ గ్రామస్తులు పట్టుబట్టారు. -
వింత కారణాలతో వివాహాల రద్దు..!
మరి కాసేపట్లో పెళ్లి జరగాల్సి ఉంది. పెళ్లి కూతురు తండ్రి ఉరోజ్ మెహందీతో సహా వారి తరఫు బంధువులంతా మగ పెళ్లివారి’బారాత్’ (వివాహ ఊరేగింపు) కోసం వేచి చూస్తున్నారు. సమయం మించి పోతుండడంతో పెళ్లి కొడుకు తండ్రికి మెహందీ ఫోన్ చేయగా వివాహాన్ని రద్దు చేసుకుంటున్నామంటూ అటువైపు నుంచి సమాధానం వచ్చింది. పెళ్లి కుమార్తె ఎక్కువగా వాట్సాప్‌లోనే కాలం గడుపుతున్నందున ఆమెతో వివాహానికి తమ కొడుకు ఇష్టపడక పోవడమే ప్రధాన కారణమంటూ వారు స్పష్టంచేశారు. ఇంకా పెళ్లి కూడా కాకుండానే కాబోయే అత్తమామలకు లెక్కకు మించి వాట్సాప్ మెసేజ్‌లు పంపించడం చూస్తే పెళ్లికూతురు ఎంతగా వాట్సాప్ వినియోగిస్తోందో అర్థం అవుతోందని నిక్కచ్చిగా చెప్పేశారు. అయితే మెహందీ మాత్రం వియ్యాలవారు పెళ్లి రద్దు చేసుకోడానికి వాట్సాప్ కారణం కాదని కట్నం కింద రూ.65 లక్షలు ఇవ్వాలనే వారి డిమాండ్‌ను తాము ఒప్పుకోకపోవడం వల్లేనని తెలిపాడు. ఆయన పెళ్లికొడుకు, వారి కుటుంబసభ్యులపై ఫిర్యాదు చేయడంతో కేసు రిజిష్టర్ చేసి పోలీసులు విచారణ జరుపుతున్నారు. వధువు వాట్సాప్ ఎక్కువగా ఉపయోగిస్తున్న కారణంగా, పెళ్లికి ముందే కాబోయే అత్తమామలకు వాట్సాప్ మెసేజ్‌లు పంపించిన కారణంగానే ఆ వివాహం రద్దు చేసుకుంటున్నట్టు సెప్టెంబర్ 5న జరగాల్సిన పెళ్లిని రద్దు చేసుకున్నట్టు పెళ్లి కుమారుడు తరఫు వారు చెబుతున్నట్టు ఆమ్రోహీ ఎస్పీ విపిన్ టడా తెలిపారు. ఇలా ఓ వింత కారణంతో ఉత్తరప్రదేశ్ ఆమ్రోహీ జిల్లా నౌగావ్ సాదత్ గ్రామానికి మెహందీ కుమార్తెతో ఫకీర్పురాకు చెందిన ఖమర్ హైదర్ కుమారుడికి జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది. యూపీ, బిహార్ తదితర రాష్ట్రాల్లో పెళ్లి కొడుకులు, వారి తరఫు వారు కట్నంతో పాటు వింత వింత కోరికలు కోరడం, కొన్ని విషయాల్లో పెళ్లి కూతురు తరఫు వాళ్ల అభ్యంతరాల కారణంగా పెళ్లిళ్లు ఆగిపోయిన సందర్భాలున్నాయి. వివాహ విందులో తాము కోరిన మాంసాహారాన్ని కాబోయే అత్తమామలు ఏర్పాటు చేయని కారణంగా ఇటీవల యూపీ రాంపూర్‌కు చెందిన ఓ పెళ్లికొడుకు పెళ్లి రద్దుచేసుకున్నాడు. విందులో పెళ్లి కొడుకు సోదరుడికి వధువు బం«ధువు ఒకటి కంటే ఎక్కువ రసగుల్లాలు ఇవ్వడానికి నిరాకరించినందుకు గత ఏప్రిల్‌లో యూపీలో ఓ పెళ్లి నిలిచిపోయింది. మ్యారేజ్ పార్టీలో అతిథులకు తగినన్నీ ఐస్క్రిమ్లు అందించనందుకు వియ్యంకుల మధ్య తలెత్తిన వాగ్వాదం తీవ్రరూపం దాల్చి రెండువర్గాల మధ్య బాహాబాహీకి దారితీసి చివరకు పెళ్లి రద్దయింది. పెళ్లి నిర్వహణకు సంబంధించిన కార్యక్రమాలు మొదలుకావడానికి ముందే పెళ్లికుమారుడు చేసిన నాగిన్డ్యాన్స్ చికాకు కలిగించిందని యూపీ షాజహాన్‌పూర్‌కు చెందిన పెళ్లి కూతురు వివాహం రద్దుచేసుకుంది. ఉరుములు, మెరుపుల తర్వాత పెళ్లికొడుకు వింతగా ప్రవర్తించాడంటూ గత జూన్ బిహార్‌లోని సరన్‌కు చెందిన వధువు అతడిని పెళ్లి చేసుకునేందుకు నిరాకరించింది. -
ఆగిన మిథున్ చక్రవర్తి కొడుకు పెళ్లి
తమిళ సినిమా(చెన్నై): బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి కుమారుడు మహాక్షయ్ వివాహం శనివారం అర్థంతరంగా నిలిచిపోయింది. ఓ యువతిని రేప్, మోసం చేసిన కేసులో కోర్టు ఆదేశాలతో విచారణ కోసం పోలీసులు ఊటీలోని వివాహ వేదిక వద్దకు చేరుకోవడంతో వధువు కుటుంబం అక్కడ్నుంచి వెళ్లిపోయింది. మిథున్ చక్రవర్తి కుమారుడు మహాక్షయ్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి నాలుగేళ్ల పాటు తనతో సహజీవనం చేశాడని బాధితురాలు ఢిల్లీ పోలీసులకు చేసిన ఫిర్యాదులో తెలిపింది. తాను గర్భం దాల్చడంతో గర్భస్రావమయ్యేలా ఏవో మందులు ఇచ్చాడని వెల్లడించింది. తన కుమారుడ్ని వదిలేయకుంటే తీవ్ర పర్యావసానాలు ఉంటాయని మహాక్షయ్ తల్లి యోగితా బాలీ తనను బెదిరించినట్లు వాపోయింది. దీంతో ప్రాణాలు రక్షించుకోవడం కోసం ముంబై నుంచి ఢిల్లీకి పారిపోయివచ్చినట్లు పేర్కొంది. ఈ కేసును విచారించిన ఢిల్లీలోని ఓ కోర్టు నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదుచేసేందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని అభిప్రాయపడింది. ఈ కేసులో చట్టప్రకారం ముందుకు వెళ్లాలని పోలీసుల్ని ఆదేశించింది. దీంతో ఈ కేసులో తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని యోగిత, మహాక్షయ్లు ముంబై హైకోర్టును ఆశ్రయించారు. కానీ ఈ విజ్ఞప్తిని తిరస్కరించిన హైకోర్టు.. ఈ వ్యవహారాన్ని ఢిల్లీలోని న్యాయస్థానంలోనే తేల్చుకోవాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో బాధితురాలి ఫిర్యాదుపై మిథున్ కుటుంబాన్ని విచారించేందుకు పోలీసులు శనివారం తమిళనాడులోని ఊటీలో ఉన్న వివాహ వేదిక వద్దకు చేరుకున్నారు. దీంతో వధువు కుటుంబం అక్కడ్నుంచి వెళ్లిపోయింది. -
యోగి రాష్ట్రంలో బీఫ్ పెట్టలేదని.. పెళ్లి క్యాన్సిల్!
లక్నో: ఓ వైపు యోగి ఆదిత్యనాథ్ సీఎం అయ్యాక గోమాంసాన్ని నిషేధించి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు బీఫ్ వడ్డించలేదని ఆగ్రహంతో వరుడి కుటుంబీకులు వివాహాన్నే ఆపేయడం దుమారం రేపింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ధరియాగఢ్ లోని భోట్ పోలీస్ స్టేషన్ పరిదిలో చోటుచేసుకుంది. ఆ వివరాలు.. రాంపూర్ కు చెందిన యాదవ్ వర్గీయుల ఇంట్లో శనివారం వివాహం జరగాలని నిర్ణయించారు. పెళ్లి మండపంలో ఇరు వర్గాల వారి బంధువులతో సందడి వాతావరణం నెలకొంది. ఓ వైపు భోజనాలు ప్రారంభించారు. వరుడి తరఫు వారు తమకు బీఫ్ వడ్డించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో గో మాంసంపై నిషేధం ఉందని ఎంత మొత్తుకున్నా వరుడి బంధువులు వినలేదు. మమ్మల్ని అవమానిస్తారా అంటూ పెళ్లి ఆపేసేందుకు సిద్ధమయ్యారు. చివరికి కట్నంగా కారు కూడా ఇవ్వాలని.. లేకుంటే తమ దారిన వెళ్లిపోతామంటూ వధువు తండ్రిని హెచ్చరించారు. అందుకు వధువు తండ్రి నిరాకరించడంతో పెళ్లి రద్దుచేస్తున్నట్లు ప్రకటించి వరుడు బంధువులు వెళ్లిపోయారు. ఈ విషయంపై వరుడిపై, అతడి బంధువులపై వధువు తరఫువారు ఫిర్యాదు చేశారని స్టేషన్ ఆఫీసర్ రాజేశ్ కుమార్ ఆదివారం మీడియాకు తెలిపారు. కారు కావాలంటే కొన్ని రోజుల తర్వాత కష్టపడి ఇవ్వగలమని, కానీ నిషేధం ఉన్న గోమాంసాన్ని అడిగి ఇబ్బందుల పాలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు వివరించారు. -
ఇలాంటి వాడితో పెళ్లా.. నాకొద్దు!
గురుద్వారాలో తనను పెళ్లి చేసుకోడానికి వచ్చని వరుడు.. బాగా డ్రగ్స్ మత్తులో ఉండటంతో, ఇలాంటి వ్యక్తిని తాను పెళ్లి చేసుకునేది లేదని పెళ్లి కూతురు ఛీకొట్టి వెళ్లిపోయింది. ఈ ఘటన పంజాబ్‌లోని దీనానగర్ పట్టణంలో జరిగింది. గురుదాస్‌పూర్ నగరానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ పట్టణంలోని దసరా గ్రౌండ్ ప్రాంతానికి చెందిన లారీ డ్రైవర్ కుమార్తె సునీతా సింగ్‌కు ఇటీవల జస్ప్రీత్ సింగ్ అనే యువకుడితో పెళ్లి కుదిరింది. మహారాజా రంజిత్ సింగ్ గురుద్వారాలో పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరిగాయి. భారీగా ఊరేగింపుతో వచ్చిన పెళ్లికొడుకు కారులోంచి కాలు బయట పెట్టగానే అడుగులు తడబడ్డాయి. అది చూసిన సునీత.. అతడు బాగా డ్రగ్స్ తీసుకుని ఉన్నాడని, అలాంటి డ్రగ్ అడిక్ట్‌తో తాను పెళ్లి చేసుకునేది లేదని తెగేసి చెప్పింది. దాంతో పెళ్లి కొడుకు తల్లిదండ్రులు షాకయ్యారు. లారీ డ్రైవర్ అయిన జస్ప్రీత్ కాలికి గాయమైందని, అందుకే అతడి అడుగులు తడబడుతున్నాయని నచ్చజెప్పేందుకు చాలా ప్రయత్నించారు. కానీ సునీత మాత్రం తన నిర్ణయానికి గట్టిగా కట్టుబడింది. పెళ్లికొడుకును వెంటనే వైద్య పరీక్షలకు తీసుకెళ్లాలని ఆమె డిమాండ్ చేసింది. అయితే, సమయానికి అక్కడి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో డ్రగ్స్‌కు సంబంధించిన పరీక్షలు చేయడానికి తగిన పరికరాలు లేవు. దాంతో గురుదాస్‌పూర్‌లో ఒక ప్రైవేటు ల్యాబ్‌లో పరీక్షలు చేయించాల్సిందిగా ఆమె చెప్పింది. అక్కడ టెస్ట్ చేస్తే, జస్ప్రీత్ డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. దాంతో గురుద్వారా సమీపంలో ఉన్న ఒక పోలీసు స్టేషన్లో పెళ్లికొడుకుపై సునీత ఫిర్యాదు చేసింది. చివరకు రెండు కుటుంబాలు పెళ్లిని రద్దు చేసుకోడానికి అంగీకరించాయి. అంతకుముందు మార్చుకున్న బంగారు ఉంగరాలను కూడా ఎవరికి వారు తిరిగి ఇచ్చేశారు. తన కూతురు మంచి నిర్ణయం తీసుకుందని, పెళ్లి చేసుకున్న తర్వాత కూడా అతడు డ్రగ్స్ సేవించి వస్తే ఆమె ఎలా సంతోషంగా ఉంటుందని సునీత తండ్రి కమల్ సింగ్ అన్నారు. -
పెళ్లికి అంగీకరించలేదని కత్తితో దాడి!
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. జిల్లా కేంద్రంలోని శాంతినగర్‌లో గౌతమీ డిగ్రీ కాలేజీలో డిగ్రీ సెకండియర్ చదువుతోన్న నందిని అనే విద్యార్థినిపై ఓ యువకుడు సోమవారం కత్తితో దాడి చేశాడు. పెళ్లి సంబంధం రద్దు చేసుకుందనే కోపంతోనే సదరు యువకుడు ఆ యువతిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే... ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలం మౌడగాడ గ్రామానికి చెందిన నందినికీ, అదే మండలం బెళగాం గ్రామానికి చెందిన నందుకూ 9 నెలల క్రితం నిశ్చితార్థం జరిగింది. ఆ తర్వాత నందినికి ఇష్టం లేకపోవడంతో పెద్దలు నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నారు. దీంతో కోపం పెంచుకున్న అతను సోమవారం కాలేజీ నుంచి బయటకు వస్తోన్న నందినిపై కత్తితో దాడి చేశాడు. తీవ్రగాయాలపాలైన నందినినీ చికిత్స నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. నందు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ఔను... త్రిష పెళ్లి ఆగిపోయింది!
తమిళ నిర్మాత, వ్యాపారవేత్త వరుణ్ మణియన్‌తో త్రిష నిశ్చితార్థం మూడు నెలల ముచ్చటగా ముగిసింది. ఈ ఏడాది జనవరిలో కుటుంబ సభ్యులు, అత్యంత ఆప్తుల సమక్షంలో వీరి నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో పెళ్లి తేదీ ప్రకటించలేదు. నిశ్చితార్థం తర్వాత వరుణ్, త్రిష విహారయాత్రకు కూడా వెళ్లారు. అయితే, ఈ ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని, వాళ్లు విడిపోయారనే వార్త కొద్దిరోజులుగా హల్చల్ చేస్తోంది. ‘ఔను.. పెళ్లి ఆగిపోయింది’ అని త్రిష తల్లి ఉమాకృష్ణన్ తమిళ పత్రికలవారికి గురువారం తెలియజేశారు. త్రిష సినిమాల్లో కొనసాగడం వరుణ్ మణియన్ కుటుంబ సభ్యులకు నచ్చకపోవడం వల్లే విభేదాలు నెలకొన్నాయనే వార్త ప్రచారం అయ్యింది. ఆ వార్త నిజం కాదని ఉమ పేర్కొన్నారు. త్రిష సినిమాల్లో కొనసాగడం వరుణ్ కుటుంబ సభ్యులకు ఇష్టమేననీ, వాళ్లు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదనీ ఆమె చెప్పారు. కుటుంబ పెద్దల నిర్ణయమే పెళ్లి రద్దు కావడానికి కారణమనీ, కానీ ఆ పెద్దల గురించి చెప్పి... వాళ్లను నొప్పించలేననీ ఆమె అన్నారు. ప్రస్తుతం త్రిష దృష్టంతా సినిమాలపైనే అని ఉమాకృష్ణన్ స్పష్టం చేశారు. ఇదిలా వుండగా, ‘బయట వస్తున్న ఊహాగానాలు విచిత్రంగా ఉన్నాయి. దయచేసి వాటికి ఫుల్స్టాప్ పెట్టండి. నేనిప్పుడు సింగిల్‌గా, హ్యాపీగా ఉన్నాను’ అని గురువారం రాత్రి త్రిష స్వయంగా ట్వీట్ చేశారు.