మిశ్రమంగా వాహన విక్రయాలు
వృద్ధి బాటలో మారుతీ, హ్యుందాయ్
తగ్గిన ఫోర్డ్, మహీంద్రా అమ్మకాలు...
న్యూఢిల్లీ : వాహన విక్రయాలు మార్చి నెలలో మిశ్రమంగా ఉన్నాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, హోండా కార్స్ కంపెనీల దేశీయ విక్రయాలు వృద్ధిని సాధించగా, ఫోర్డ్, మహీంద్రా, జనరల్ మోటార్స్ కంపెనీల అమ్మకాలు తగ్గాయి. గత ఆర్థిక సంవత్సరం మొత్తానికి రికార్డ్ స్థాయి అమ్మకాలను మారుతీ సుజుకీ, హోండా కార్స్ ఇండియా, హోండా మోటొకార్ప్లు సాధించాయి.
గత ఆర్థిక సంవత్సరంలో మారుతీ సుజుకీ కంపెనీ రికార్డ్ స్థాయి అమ్మకాలు సాధించింది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో 11,55,041గా ఉన్న మారుతీ సుజుకీ కార్ల విక్రయాలు గత ఆర్థిక సంవత్సరంలో 12 శాతం వృద్ధితో 12,92,415కు పెరిగాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో ఈ స్థాయి అమ్మకాలు సాధించడం మారుతీకి ఇదే మొదటిసారి. భారత వాహన పరిశ్రమ 4 శాతం వృద్ధి సాధిస్తే తాము 11 శాతం వృద్ధి సాధించామని మారుతీ సుజుకీ ఇండియా ఈడీ(మార్కెటింగ్ అండ్ సేల్స్) ఆర్.ఎస్. కల్సి చెప్పారు.
అమేజ్, సిటీ కార్లు మంచి అమ్మకాలు సాధిస్తుండటంతో హోండా కార్స్ ఇండియా 23 శాతం వృద్ధి సాధించింది. కంపెనీ చరిత్రలోనే రికార్డ్ స్థాయి నెలవారీ అమ్మకాలు సాధించింది. గత ఆర్థిక సంవత్సరంలో రికార్డ్ స్థాయి వార్షిక అమ్మకాలు సాధించింది. 2014-15లో ఈ కంపెనీ వాహన విక్రయాలు 41% వృద్ధితో 1,89,062కు పెరిగాయి.
గత ఆర్థిక సంవత్సరంలో హీరో మోటొకార్ప్ రికార్డ్ స్థాయి అమ్మకాలను సాధించింది. 2014-15లో వాహన విక్రయాలు 6 శాతం వృద్ధితో 62,45,960కు చేరాయని వివరించింది.
ఈ ఏడాదీ సవాళ్లే..: ఈ ఏడాది వాహన పరిశ్రమకు సవాళ్లు తప్పవని హ్యుందాయ్ సీనియర్ వైస్-ప్రెసిడెంట్ రాకేశ్ శ్రీవాత్సవ పేర్కొన్నారు. మందకొడి ఆర్థిక రికవరీ, అధిక వడ్డీరేట్లు తదితర అంశాల కారణంగా వినియోగదారులు తమ కొనుగోళ్లను వాయిదా వేస్తున్నారని ఫోర్డ్ ఇండియా ఈడీ అనురాగ్ మెహోత్ర చెప్పారు. సమీప భవిష్యత్తులో అమ్మకాలు పుంజుకునే అవకాశాలూ అంతంత మాత్రంగానే ఉన్నాయని జనరల్ మోటార్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ పి. బాలేంద్రన్ పేర్కొన్నారు.