దాడి కేసులో హీరో అరెస్ట్
సాక్షి, బెంగళూరు: మాస్తిగుడి చిత్రం దుర్ఘటన మరువకముందే కన్నడ హీరో దునియా విజయ్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. మాస్తిగుడి చిత్రం నిర్మాత సుందర్ పీ.గౌడ సోదరుడు శంకర్, హీరో దునియా విజయ్‌లు తన భర్త జయరామ్‌పై దౌర్జన్యం చేసి దాడికి పాల్పడ్డారని జయరామ్ భార్య యశోదా చెన్నమ్మనకెరె అచ్చుకట్టు కెరె పోలీస్‌స్టేషన్ లో ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది.
మాస్తిగుడి చిత్ర నిర్మాత సుందర్ పీ.గౌడ సోదరుడు శంకర్ నగరానికి చెందిన జయరామ్ అనే వ్యక్తి కుమార్తెను వివాహం చేసుకున్నాడు. పెళ్లయిన కొద్ది కాలానికే అదనపు కట్నం కోసం తన కూతురిని వేధించేవాడని, తన కుమార్తెను చూడటానికి ఇంటికి కూడా రానిచ్చేవాడు కాదని యశోదా ఆమె భర్త జయరామ్‌లు ఆరోపిస్తున్నారు. ఇటీవల జయరామ్ తన కూతురును చూడడానికి ఆమె ఇంటికి వెళ్లగా తమ అల్లుడు శంకర్ అదనపు కట్నం కోసం తన భర్తతో వాగ్వాదానికి దిగాడని అంతటితో ఆగకుండా హీరో విజయ్ను ఇంటికి పిలిపించి ఇద్దరు కలసి తన భర్తపై జయరామ్‌పై దాడికి పాల్పడ్డారని జయరామ్ భార్య యశోదా ఆరోపిస్తోంది. హీరో దునియా విజయ్ తన భర్త జయరామ్‌ను ఛాతిభాగంలో బలంగా కొట్టడంతో ఎముకలు విరిగాయని, ప్రస్తుతం తన భర్త జయరామ్ శేఖర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని ఆయన భార్య యశోదా తెలిపారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దునియా విజయ్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తర్వాత బెయిల్ పై అతడికి విడిచిపెట్టారు.