ఇదేనా మాతాశిశు సంక్షేమం!
సాక్షి, ఆదిలాబాద్ : ఒకవైపు పోషణ మాసోత్సవం నిర్వహిస్తున్నా మరోపక్క జిల్లాలో మాతాశిశు మరణాల పరంపర కొన సాగుతోంది. ఏదో ఒక చోట పోషకాహార లోపం..రక్తహీనతతో పచ్చి బాలింతలు, శిశువులు తనువు చాలించడం ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర ప్రభుత్వం 2018 మార్చిలో పోషణ్ అభియాన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రధానంగా భావిభారత దేశం పోషకాహార లోపంతో నిస్సహాయ స్థితిలో ఉండకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకుంది.
చిన్నారుల్లో పౌష్టికాహారం లేమితో ఎదుగుదల లోపించకుండా, గర్భిణులు, బాలింతల్లో రక్తహీనతతో బాధపడకుండా, ప్రసవంలో శిశువు తక్కువ బరువుతో జన్మిస్తే బరువు పెంచేందుకు చర్యలు తీసుకోవడమే ఈ అభియాన్ ముఖ్య లక్ష్యం. తద్వారా దేశ వ్యాప్తంగా 38 శాతం ఉన్న పౌష్టికాహార లోపాన్ని, 54 శాతం ఉన్న రక్తహీనత శాతాన్ని తగ్గించడమే దీని ఉద్దేశం. మహిళ గర్భం దాల్చిన రోజు నుంచి వెయ్యి రోజుల వరకు పూర్తిస్థాయిలో మాతాశిశు సంరక్షణపై దృష్టి సారించాలి. తల్లితోపాటు బిడ్డ ఆరోగ్య సంరక్షణకు పౌష్టికాహారం అందించాలి. నేషనల్ న్యూట్రీషియన్ మిషన్ (ఎన్ఎన్ఎం) ఆధ్వర్యంలో పోషణ్ అభియాన్ అప్పట్లో ప్రారంభించారు. 2022 వరకు ఈ కార్యక్రమం అమలులో ఉండనుంది. ఇప్పటికే 18 నెలలు పూర్తయినా జిల్లాలో దీని ఫలితాలు అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి.
నీరుగారుతున్న లక్ష్యం..
అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించాల్సి ఉండగా, జిల్లాలో ఆ లక్ష్యం నీరుగారిపోతోంది. ఒకపూట సంపూర్ణ భోజనంతోపాటు పాలు, ఉడికించిన కోడిగుడ్లు ఇవ్వాలి. అలాగే చిన్నారులకు బాలామృతం, రోజుకో గుడ్డు, ఇతరత్ర పోషకాహారం అందజేయాలి. అయితే అంగన్వాడీలకు సరఫరా చేస్తున్న సరుకుల్లో నాణ్యత లోపం ఉండడంతో లబ్ధిదారులకు ఆ ప్రయోజనం దక్కడం లేదు.
జిల్లాలో మహిళ శిశు సంక్షేమశాఖ అధికారులు కాంట్రాక్టర్లతో కుమ్ముక్కవ్వడంతోనే అంగన్వాడీ కేంద్రాలకు ఇలాంటి సరుకుల పంపిణీ జరుగుతుందన్న ఆగ్రహం లబ్ధిదారులు, స్థానిక ప్రజాప్రతినిధుల్లో వ్యక్తమవుతోంది. ఇటీవల నార్నూర్ మండల కేంద్రంలోని ఓ అంగన్వాడీ కేంద్రంలో నాసిరకం కోడిగుడ్లను స్థానిక యువకులు పట్టుకున్నారు. నార్నూర్, గాదిగూడ మండలాలకు చెందిన సర్పంచులు ఓ సూపర్వైజర్ను నాసిరకం సరుకుల విషయంలో నిలదీశారు కూడా. ఇలాంటి సంఘటనలతో పథకం అమలు లక్ష్యం నీరుగారిపోతోంది.
మాసోత్సవ నిర్వహణలోనూ కక్కుర్తి
పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని 2018లో ప్రారంభించిన తర్వాత గత సంవత్సరం మధ్యలో వారోత్సవం, పక్షోత్సవాలు నిర్వహించారు. తద్వారా అభియాన్ ఉద్దేశాలను ప్రజల వరకు చేర్చడంలో కార్యక్రమాలను విస్తృతంగా తీసుకెళ్లాలన్నది ప్రభుత్వ ఆశయం. రెండో ఏడాది ఈనెలలో మాసోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఇందుకోసం జిల్లా సంక్షేమ అధికారికి రూ.30వేలు, క్షేత్రస్థాయిలో ఒక్కో ప్రాజెక్టు అధికారికి రూ.25వేల చొప్పున ప్రభుత్వం నిధులు కేటాయించింది.
ఇక అంగన్వాడీ కేంద్రాల్లో మాసోత్సవ నిర్వహణకు నామమాత్రంగా నిధులు కేటాయించారు. అయితే ఈ నిధులతో వివిధ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాల్సి ఉండగా, జిల్లాలో అధికారులు తూతూమంత్రంగా చేపట్టి చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలు లేకపోలేదు. ఇటీవల జిల్లా కేంద్రంలోని డీడబ్ల్యూవో కార్యాలయంలో గర్భిణులకు సీమంతం కార్యక్రమాలకు సంబంధించి అంగన్వాడీలపైనే భారం నెట్టారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల నుంచి గర్భిణులను కేంద్రాల నిర్వాహకులే ఆటోల ద్వారా తీసుకురావడమే కాకుండా చీర, గాజులు, పండ్లు, పువ్వుల ఖర్చులు కూడా వారే భరించాల్సి రావడంతో పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.
అదేవిధంగా జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో మాసోత్సవ నిర్వహణకు సంబంధించి ఫ్లెక్సీల ఏర్పాటుకు ప్రభుత్వం నిధులు కేటాయించినా అధికారులు కేంద్రాలకు పంపిణీ చేయకపోవడంతో గతేడాది సంబంధించిన ఫ్లెక్సీలనే ప్రదర్శించారన్న అపవాదు ఉంది. ఈ మాసోత్సవానికి సంబంధించి విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సి ఉండగా, జిల్లా, ప్రాజెక్టుల స్థాయిలో నామమాత్రంగా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అధికారులు నిధుల విషయంలో కక్కుర్తి పడ్డారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రచారంలోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న అధికారులు అభియాన్ నిర్వహణపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికే ఈ మిషన్ కాలవ్యవధి సగం ముగిసిపోగా, మిగిలిన సగంలోనైనా గర్భిణులు, బాలింతలు, చిన్నారుల సంరక్షణకు పూర్తిస్థాయిలో దోహదపడాలన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. మాసోత్సవ నిర్వహణ కోసం జిల్లా స్థాయిలో జిల్లా కోఆర్డినేటర్, జిల్లా సహాయక అధికారి, ఒక్కో ప్రాజెక్టు స్థాయిలో బ్లాక్ కోఆర్డినేటర్, బ్లాక్ ప్రాజెక్టు అసిస్టెంట్లను నియమించినా పర్యవేక్షణ అంతంత మాత్రంగానే ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.