రేపట్నుంచి వర్షాలు తగ్గుముఖం
హైదరాబాద్: అకాల వర్షాలతో అపార నష్టాన్ని కలిగిస్తున్న వరణుడి ప్రభావం శనివారం నుంచి ఉండదని విశాఖపట్టణం వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. జార్ఖండ్, ఛత్తీస్ గఢ్, తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు అప్ప పీడన ద్రోణి ఉంటుందని తెలిపారు. గురువారం కూడా తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. వాటి వివరాలను చూసినట్లయితే.. ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా కొమరాడలో 4 సెంటీ మీటర్లు, విశాఖపట్టణం జిల్లా మాడుగుల, ప్రకాశం జిల్లా పొదిలి, గుంటూరు జిల్లా మాచర్లలో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
అదే విధంగా రాయలసీమలోని అనంతపురం జిల్లా మడకశిర లో 8, గుమ్మఘట్టలో 7, గుత్తి, రాయదుర్గం, గంగవరం లలో 4 సెంటీ మీటర్ల వర్షం కురిసింది.
తెలంగాణ రాష్ట్రంలో చూస్తే.. ఏటూరు నాగారం, గోవిందరావుపేటలో 7, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, ఖమ్మం జిల్లా ఇల్లెందు, వెంకటాపురంలలో 6, కొత్తగూడెం, గుండాలలో 5 సెంటీ మీటర్ల వర్షం నమోదైంది.