Maternal infant mortality
-
AP: గణనీయంగా తగ్గిన మాతృ మరణాలు
సాక్షి, అమరావతి: నవమాసాలూ మోసి కన్న బిడ్డలను చూసుకొని తల్లి ఎంతో మురిసిపోతుంది. బిడ్డను ప్రేమతో సాకుతుంది. విద్యాబుద్ధులు నేర్పించి, ప్రయోజకులను చేస్తుంది. కానీ, ఆ తల్లికే ప్రమాదం వాటిల్లుతోంది. పురిటి సమయంలోనే తల్లులు, బిడ్డలు కన్నుమూస్తున్న విషాద ఘటనలు అనేకం. పలు కారణాల వల్ల సంభవిస్తున్న ఈ మరణాలకు అడ్డుకట్ట వేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకుంది. మాతా శిశు మరణాల తగ్గింపునకు పలు చర్యలు చేపట్టింది. ఇవి సత్ఫలితాలనిస్తున్నాయి. రాష్ట్రంలో మాతా, శిశు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. మాతా, శిశు మరణాల రేటు జాతీయ సగటుతో పోలిస్తే రాష్ట్ర సగటు తక్కువగా ఉంటోంది. ఈ విషయాన్ని సామాజిక ఆర్థిక సర్వే 2021–22 తేటతెల్లం చేసింది. ప్రతి లక్ష ప్రసవాలకు తల్లుల మృతుల సంఖ్య 70కి మించకూడదనేది నిబంధన. అయితే జాతీయ స్థాయిలో సగటున ప్రతి లక్ష ప్రసవాలకు ప్రసూతి మరణాలు రేటు (ఎంఎంఆర్) 112 గా ఉంది. రాష్ట్రంలో మాత్రం లక్ష ప్రసవాలకు ఇది 65గా నమోదైంది. అదే విధంగా సగటున వెయ్యి ప్రసవాల్లో జాతీయ స్థాయిలో 30 మంది శిశువులు మరణిస్తున్నారు. రాష్ట్రంలో ఈ సంఖ్య 25 గా ఉంది. అనేక చర్యలు మాతృ మరణాలు తగ్గించడం కోసం ప్రభుత్వం అనేక రకాల చర్యలు చేపడుతోంది. ప్రతి నెలా 9వ తేదీన అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రత్యేక వైద్య పరీక్షలు చేస్తున్నారు. గర్భం దాల్చిన మూడు నెలల్లోపు ఒకసారి, ఆరు నెలల్లోపు మరోసారి అల్ట్రాసౌండ్ పరీక్షలు చేసి, బిడ్డ ఎదుగుదల, తల్లి ఆరోగ్యాన్ని తెలుసుకుని, దానికి అనుగుణంగా వైద్యం అందిస్తున్నారు. ఎంఎస్ఎస్ యాప్ ద్వారా ప్రతి పీహెచ్సీ పరిధిలోనూ హైరిస్కు గర్భిణులను గుర్తించి వారికి సుఖ ప్రసవాలు అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. గర్భిణులు, చిన్నారుల్లో పౌష్టికాహార లోపం వల్ల రక్తహీనత, ఇతర సమస్యలు వస్తాయి. వీరికి అంగన్వాడీల ద్వారా పాలు, గుడ్లు, ఇతర పౌష్టికాహారాన్ని ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. ప్రసూతి మరణాలు మరింత తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులకు ‘నర్స్ ప్రాక్టీషనర్ ఇన్ మిడ్వైఫరి (ఎన్‌పీఎం)’ శిక్షణను ప్రభుత్వం ప్రారంభించింది. నర్సుల్లో నైపుణ్యాలు పెంపొందించేందుకు తొలివిడతగా 60 మందికి శిక్షణ ఇస్తున్నారు. శిశువుకు ఆరోగ్య రక్ష శిశువుల ఆరోగ్య రక్షణకూ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో 27 స్పెషల్ న్యూ బోర్న్ కేర్ యూనిట్(ఎస్ఎన్సీయూ), 23 మినీ ఎస్ఎన్సీయూ, 21 న్యూట్రిషన్ రీహాబిలిటేషన్ సెంటర్లు, 163 న్యూ బోర్న్ స్టెబిలైజేషన్ యూనిట్లు (ఎన్‌బీఎస్‌యూ), 1,306 న్యూ బోర్న్ కేర్ కార్నర్స్ (ఎన్‌బీసీసీఎస్) ద్వారా చిన్నారులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. చిన్నారులు రోగాల బారిన పడకుండా టీకాల పంపిణీపైన వైద్య శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. హెపటైటిస్ బి, పోలియో, టీబీ సహా పలు 10 రకాల టీకాలు అందిస్తోంది. 2021–22లో డిసెంబర్ నాటికే ఏడాది లోపు పిల్లలకు 101.38 శాతం టీకాలు పంపిణీ చేశారు. అదే విధంగా 1 నుంచి ఐదేళ్ల వయసున్న పిల్లలకు 100.44 శాతం టీకాలు పంపిణీ చేశారు. 14 రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలతో రాష్ట్రంలోనే తొలిసారి తిరుపతిలో పీడియాట్రిక్ కార్డియాక్ ఆసుపత్రిని ప్రభుత్వం ప్రారంభించింది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు ఇక్కడ కార్పొరేట్ తరహా వైద్యం ఉచితంగా అందుతోంది. -
భారత్‌లో ఆకలి కేకలు
న్యూఢిల్లీ: భారత్‌లో ఆకలి కేకలు తీవ్రతరమయ్యాయి. 2020 సంవత్సరానికి గాను ప్రపంచ ఆకలి సూచీలో 107 దేశాలకు గాను మన దేశం 94వ స్థానంలో నిలిచింది. ఆకలి అత్యంత తీవ్రంగా ఉన్న జాబితాలో భారత్‌తో పాటుగా పొరుగునే ఉన్న బంగ్లాదేశ్, మయన్మార్, పాకిస్తాన్‌లు ఉన్నాయి. చైనా, బెలారస్, ఉక్రెయిన్, టర్కీ, క్యూబా, కువైట్ వంటి 17 దేశాలు అయిదు లోపు ర్యాంకుల్ని పంచుకొని టాప్ ర్యాంకింగ్‌లు సాధించాయి. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ (జీహెచ్ఐ) ఈ ఏడాది నివేదికను తన వెబ్సైట్లో ఉంచింది. పౌష్టికాహార లోపం, పిల్లల్లో ఎదుగుదల, అయిదేళ్లలోపు పిల్లల్లో ఎత్తుకు తగ్గ బరువు, మాతా శిశు మరణాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ సూచీని రూపొందిస్తారు. ► భారత్ (94 ర్యాంకు), బంగ్లాదేశ్ (75), మయన్మార్ (78), పాకిస్తాన్ (88) స్థానాల్లో ఉన్నాయి. ఈ దేశాలను ఆకలి సమస్య తీవ్రంగా బాధిస్తోంది ► నేపాల్ 73, శ్రీలంక 64 ర్యాంకుల్ని సాధించి ఆకలి సమస్య మధ్యస్తంగా ఉన్న దేశాల జాబితాలో చేరాయి. ► గత ఏడాది 117 రాష్ట్రాలకు భారత్ 102వ స్థానంలో ఉంటే ఈసారి మెరుగుపడింది. ► భారత్‌లో 14% జనాభా పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు ► అయిదేళ్ల లోపు చిన్నారుల్లో 37.4% మందిలో ఎదుగుదల లోపాలు ఉన్నాయి. ► అయిదేళ్ల లోపు వయసున్న వారిలో 17.3% మంది ఎత్తుకి తగ్గ బరువు లేరు ► అయిదేళ్ల లోపు చిన్నారుల్లో 3.7%మంది మృత్యువాత పడుతున్నారు. దేశంలో ఈ పరిస్థితికి కారణాలివీ.. ► అందరికీ ఆహారం పంపిణీ విధానంలో లోపాలు ► ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యపూరిత వైఖరితో పర్యవేక్షణ సక్రమంగా లేకపోవడం ► పౌష్టికాహార లోపాలు అరికట్టడానికి సమగ్రమైన ప్రణాళిక లేకపోవడం ► ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్ వంటి అతి పెద్ద రాష్ట్రాలు పౌష్టికాహార లోపాలను అధిగమించడానికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ► నిరక్షరాస్యులే తల్లులుగా మారడం, వారిలో రక్తహీనత లోపాలు ఆ రాష్ట్రాలు దృష్టి పెట్టాలి భారత్‌లో ప్రీమెచ్యూర్ జననాలు, తక్కువ బరువుతో బిడ్డ జన్మించడం వంటివి అధికంగా జరుగుతున్నాయని, యూపీ, మధ్యప్రదేశ్, బిహార్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల్లో ఈ పరిస్థితి మారితేనే ప్రపంచ ఆకలి సూచీలో మన ర్యాంకు మెరుగుపడుతుందని అంతర్జాతీయ ఆహార పరిశోధనా సంస్థకి చెందిన సీనియర్ అధ్యయనకారిణి పూర్ణిమ మీనన్ అభిప్రాయపడ్డారు. ఈ రాష్ట్రాల్లో మహిళల్లో విద్య, గర్భస్థ మహిళలకి పౌష్టికాహారం ఇవ్వడం, తల్లి కాబోయే మహిళల్లో పొగాకు తాగే అలవాటుని మానిపించడం వంటివి చేయాలని ఆమె చెప్పారు. -
అటకెక్కిన ‘దక్షత’
► ఉమ్మడి జిల్లాలో 25 కేంద్రాలు ఎంపిక ► అమలుకు నోచుకోని కార్యక్రమం మాతాశిశు మరణాలు తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన దక్షత కార్యక్రమం అటకెక్కింది. మరణాలను కనీస స్థాయికి తగ్గించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టు కింద రాష్ట్ర వ్యాప్తంగా 200 ఏరియా సీహెచ్‌సీ, పీహెచ్‌సీలను ఎంపిక చేసింది. ఇందులో ఉమ్మడి జిల్లా నుంచి 25 కేంద్రాలు ఎంపికయ్యాయి. ఇందుకోసం నలుగురు సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చారు. వీరి ఆధ్వర్యంలో అమలు కావల్సిన దక్షత కార్యక్రమం ఆరంభంలోనే కనుమరుగైంది. – ఉట్నూర్ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రస్తుతం 90 శాతం ప్రసవాలు జరుగుతుండగా అందులో 10శాతం మాత్రమే ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరుగుతున్నాయని ప్రభుత్వం తేల్చింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచుతూ మాతాశిశు మరణాలను కనీస స్థాయికి తగ్గించాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రభుత్వ ఆస్పత్రుల్లో గర్భిణులు ప్రసవ సమయంలో నాణ్యమైన వైద్యంతోపాటు మెరుగైన సదుపాయాలు అందించాలనే ఆశయంతో దక్షత అనే నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనిని పక్కాగా అమలు చేయడం ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పది శాతం నుంచి 50 శాతం పెరగడంతోపాటు మాతాశిశు మరణాలు గణనీయంగా తగ్గించవచ్చని అంచనా వేసింది. ప్రస్తుతం ప్రతీ లక్షా ప్రసవాల్లో 78 మాతాశిశు మరణాలు సంభవిస్తున్నాయని, నవజాత శిశువుల్లో ప్రతీ వెయ్యిమందిలో 28 మంది మృత్యువాత పడుతున్నారని ప్రభుత్వం గుర్తించింది. ఈ పరిస్థితి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువగా ఉందని అధికారులు కూడా ప్రభుత్వానికి నివేదిక పంపారు. దక్షత లక్ష్యాలివి.. ప్రసవ సమయంలో ప్రధానంగా నాలుగు రకాల సమస్యలతో తల్లులు మృత్యువాత పడుతున్నట్లు గుర్తించారు. ప్రసవ సమయంలో అధిక రక్తస్రావం, బీపీ పెరిగి ఫిట్స్ రావడం, మధ్యలో ప్రసవం ఆగిపోవడం, నవజాత శిశువుల్లో ఊపిరితిత్తుల్లో శ్వాసకోస సమస్య, నెలలు నిండకుండానే జననం తదితర ఇన్ఫెక్షన్ల వల్ల మాతాశిశు మరణాలు సంభవిస్తున్నాయని గుర్తించిన ప్రభుత్వం వీటిని నివారించేందుకు మెరుగైన వైద్యంతోపాటు సదుపాయాలు కల్పిస్తూ పూర్తి స్థాయిలో శిక్షణ పొందిన వారితో వైద్యం అందించే ఏర్పాటు చేయాలని భావించింది. ఇందుకోసం ఉమ్మడి జిల్లాలో నలుగురు వైద్యశాఖ సిబ్బందికి దక్షత అమలుపై శిక్షణ ఇచ్చింది. ఉమ్మడి జిల్లాలో 25 కేంద్రాలు.. దక్షత కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పైలెట్ ప్రాజెక్టు కింద 25 ఆరోగ్య కేంద్రాలను ఎంపిక చేశారు. ఇందులో 8 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, మూడు ఏరియా ఆస్పత్రులు, పదకొండు 24+7 ఆస్పత్రులు, రిమ్స్, ఒక్కొక్కటి చొప్పున పీహెచ్సీ, ఎంసీహెచ్‌లు ఉన్నాయి. వీటిలో రిమ్స్‌తోపాటు సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూర్, బోథ్, లక్సెట్టిపేట, ముథోల్, సిర్పూర్(టి), ఉట్నూర్, 24+7 ఆస్పత్రుల్లో వాంకిడి, కెరమెరి, జైనూర్, సిర్పూర్(యు), కాగజ్‌నగర్, గుడిహత్నుర్, బెజ్జూర్, కాసిపేట, కౌటాల, తాండూర్, భీమిని, ఏరియా ఆస్పత్రుల్లో భైంసా, ఖానాపూర్, మంచిర్యాల, ఎంసీహెచ్ నిర్మల్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తిర్యాణిలను ఎంపిక చేశారు. ఆయా ఆరోగ్యకేంద్రాల్లో దక్షత కార్యక్రమం ద్వారా మాతాశిశు రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. కాని ఇంత వరకు దీని అమలుపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కార్యక్రమం కనుమరుగైంది. శిక్షణ పొందిన వారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉండగా అక్కడక్కడ తప్ప పూర్తి స్థాయిలో నిర్వహించలేదని వైద్యశాధికారులు అంటున్నారు. ప్రభుత్వం మంచి ఆశయంతో దక్షతకు శ్రీకారం చుట్టినా అమలుపై దృష్టి సారించకపోవడంతో ఇది ప్రకటనకే పరిమితం అయిందనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. దీనికి తోడు ఉమ్మడి జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాల్లో మాతాశిశు మరణాలు సంభవిస్తున్నాయని ప్రభుత్వం ఇప్పటికైనా దక్షతను పూర్తి స్థాయిలో అమలు చేసి మరణాలు అరికట్టేలా చర్యలు తీసుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు.