అటకెక్కిన ‘దక్షత’
► ఉమ్మడి జిల్లాలో 25 కేంద్రాలు ఎంపిక
► అమలుకు నోచుకోని కార్యక్రమం
మాతాశిశు మరణాలు తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన దక్షత కార్యక్రమం అటకెక్కింది. మరణాలను కనీస స్థాయికి తగ్గించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టు కింద రాష్ట్ర వ్యాప్తంగా 200 ఏరియా సీహెచ్‌సీ, పీహెచ్‌సీలను ఎంపిక చేసింది. ఇందులో ఉమ్మడి జిల్లా నుంచి 25 కేంద్రాలు ఎంపికయ్యాయి. ఇందుకోసం నలుగురు సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చారు. వీరి ఆధ్వర్యంలో అమలు కావల్సిన దక్షత కార్యక్రమం ఆరంభంలోనే కనుమరుగైంది. – ఉట్నూర్
ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రస్తుతం 90 శాతం ప్రసవాలు జరుగుతుండగా అందులో 10శాతం మాత్రమే ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరుగుతున్నాయని ప్రభుత్వం తేల్చింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచుతూ మాతాశిశు మరణాలను కనీస స్థాయికి తగ్గించాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రభుత్వ ఆస్పత్రుల్లో గర్భిణులు ప్రసవ సమయంలో నాణ్యమైన వైద్యంతోపాటు మెరుగైన సదుపాయాలు అందించాలనే ఆశయంతో దక్షత అనే నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
దీనిని పక్కాగా అమలు చేయడం ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పది శాతం నుంచి 50 శాతం పెరగడంతోపాటు మాతాశిశు మరణాలు గణనీయంగా తగ్గించవచ్చని అంచనా వేసింది. ప్రస్తుతం ప్రతీ లక్షా ప్రసవాల్లో 78 మాతాశిశు మరణాలు సంభవిస్తున్నాయని, నవజాత శిశువుల్లో ప్రతీ వెయ్యిమందిలో 28 మంది మృత్యువాత పడుతున్నారని ప్రభుత్వం గుర్తించింది. ఈ పరిస్థితి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువగా ఉందని అధికారులు కూడా ప్రభుత్వానికి నివేదిక పంపారు.
దక్షత లక్ష్యాలివి..
ప్రసవ సమయంలో ప్రధానంగా నాలుగు రకాల సమస్యలతో తల్లులు మృత్యువాత పడుతున్నట్లు గుర్తించారు. ప్రసవ సమయంలో అధిక రక్తస్రావం, బీపీ పెరిగి ఫిట్స్ రావడం, మధ్యలో ప్రసవం ఆగిపోవడం, నవజాత శిశువుల్లో ఊపిరితిత్తుల్లో శ్వాసకోస సమస్య, నెలలు నిండకుండానే జననం తదితర ఇన్ఫెక్షన్ల వల్ల మాతాశిశు మరణాలు సంభవిస్తున్నాయని గుర్తించిన ప్రభుత్వం వీటిని నివారించేందుకు మెరుగైన వైద్యంతోపాటు సదుపాయాలు కల్పిస్తూ పూర్తి స్థాయిలో శిక్షణ పొందిన వారితో వైద్యం అందించే ఏర్పాటు చేయాలని భావించింది. ఇందుకోసం ఉమ్మడి జిల్లాలో నలుగురు వైద్యశాఖ సిబ్బందికి దక్షత అమలుపై శిక్షణ ఇచ్చింది.
ఉమ్మడి జిల్లాలో 25 కేంద్రాలు..
దక్షత కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పైలెట్ ప్రాజెక్టు కింద 25 ఆరోగ్య కేంద్రాలను ఎంపిక చేశారు. ఇందులో 8 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, మూడు ఏరియా ఆస్పత్రులు, పదకొండు 24+7 ఆస్పత్రులు, రిమ్స్, ఒక్కొక్కటి చొప్పున పీహెచ్‌సీ, ఎంసీహెచ్‌లు ఉన్నాయి. వీటిలో రిమ్స్‌తోపాటు సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూర్, బోథ్, లక్సెట్టిపేట, ముథోల్, సిర్పూర్(టి), ఉట్నూర్, 24+7 ఆస్పత్రుల్లో వాంకిడి, కెరమెరి, జైనూర్, సిర్పూర్(యు), కాగజ్‌నగర్, గుడిహత్నుర్, బెజ్జూర్, కాసిపేట, కౌటాల, తాండూర్, భీమిని, ఏరియా ఆస్పత్రుల్లో భైంసా, ఖానాపూర్, మంచిర్యాల, ఎంసీహెచ్ నిర్మల్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తిర్యాణిలను ఎంపిక చేశారు.
ఆయా ఆరోగ్యకేంద్రాల్లో దక్షత కార్యక్రమం ద్వారా మాతాశిశు రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. కాని ఇంత వరకు దీని అమలుపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కార్యక్రమం కనుమరుగైంది. శిక్షణ పొందిన వారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉండగా అక్కడక్కడ తప్ప పూర్తి స్థాయిలో నిర్వహించలేదని వైద్యశాధికారులు అంటున్నారు. ప్రభుత్వం మంచి ఆశయంతో దక్షతకు శ్రీకారం చుట్టినా అమలుపై దృష్టి సారించకపోవడంతో ఇది ప్రకటనకే పరిమితం అయిందనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. దీనికి తోడు ఉమ్మడి జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాల్లో మాతాశిశు మరణాలు సంభవిస్తున్నాయని ప్రభుత్వం ఇప్పటికైనా దక్షతను పూర్తి స్థాయిలో అమలు చేసి మరణాలు అరికట్టేలా చర్యలు తీసుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు.