'శివపాల్ యాదవ్ తక్షణమే రాజీనామా చేయాలి'
ఖాన్ పూర్ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా... సమాజ్‌వాదీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ కుటుంబంపై మాటల బాణం ఎక్కుపెట్టారు. మథుర ఘటనపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ...కేబినెట్ మంత్రి శివ్‌పాల్ యాదవ్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆయన ఒక్కక్షణం కూడా అధికారంలో ఉండే అర్హత లేదని అమిత్ షా శనివారమిక్కడ వ్యాఖ్యానించారు. కాగా శివపాల్ యాదవ్...ములాయం దగ్గర బంధువే కాకుండా, ఎస్పీలో కీలక సీనియర్ నేత.యూపీ పర్యటనలో భాగంగా ఖాన్పూర్లో పార్టీ కార్యకర్తలనుద్దేశించి శనివారం అమిత్ షా మాట్లాడారు. మథుర ఘటనకు బాధ్యత వహిస్తూ శివపాల్ యాదవ్‌ను రాజీనామా చేయమని ములాయం కోరాలని అన్నారు.
ఇక జనం ఆయుధాలతో ఉంటే అధికార యంత్రాంగానికి ఏమీ తెలియలేదా అని అమిత్ షా ప్రశ్నించారు. ఆక్రమణలను నిరోధించడానికి, నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే స్పందించి తగిన చర్యలు తీసుకుని ఉండాల్సిందన్నారు. పనిలో పనిగా అఖిలేష్ సర్కార్‌పైనా అమిత్ షా విమర్శలు చేశారు. రైతులు, యువత సహ అన్ని వర్గాలను వంచించారని దుయ్యబట్టారు. సంక్షేమం కోసం కేంద్రం పంపిన నిధులను అఖిలేష్ సర్కార్ కాజేసిందని మండిపడ్డారు. ఇదేం పాలనంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాగా మథురలో జరిగిన యుద్ధకాండలో ఇప్పటివరకు 24 మంది చనిపోయారు. ఈ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేసింది.