మంత్రి వర్సెస్ మేయర్
► నెల్లూరు టీడీపీలో రగడ
► ఏం నేను మైనార్టీననా తక్కువ చేస్తున్నావ్?
► నిధులేమైనా నీ కార్పొరేట్ కాలేజీ ఆస్తులనుకున్నావా?
► నన్ను అసమర్థుడు, డమ్మీ అంటూ గేలి చేస్తావా?
► నెల్లూరు కార్పొరేషన్‌కు నేనే బాస్‌ని
► మంత్రి నారాయణకు మేయర్ అజీజ్ ఫోన్లో ఘాటైన సమాధానం
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: తెలుగుదేశం పార్టీలో మంత్రుల తీరు ఆ పార్టీలోని నేతలకే తీవ్ర తలనొప్పులు తెస్తోందని మరోసారి రుజువైంది. గుంటూరు జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ జానీమూన్ ఆ జిల్లాకు చెందిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు తీరుపై ఇటీవలే ధ్వజమెత్తారు. తాజాగా నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ అజీజ్ కూడా ఆ జిల్లాకు చెందిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణపై అంతే స్థాయిలో విరుచుకుపడ్డారని తెలుస్తోంది.
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద నెల్లూరు కార్పొరేషన్‌కు సుమారు రూ.60 కోట్లు నిధులు మంజూరయ్యాయి. వాటి పంపకాల గురించి సూచనలు చేసేందుకు మంత్రి సోమవారం నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్రయాదవ్, మేయర్ అజీజ్, కార్పొరేషన్ కమిషనర్ రామిరెడ్డి, మంత్రి ఒఎస్డీ పెంచల్రెడ్డిలతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.
అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు... ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల్లో 40 శాతం నగర పార్టీ అధ్యక్షుడు శ్రీధర్ కృష్ణారెడ్డి, మరో 40 శాతం నెల్లూరు రూరల్ ఇన్‌ఛార్జి ఆదాల ప్రభాకర్‌రెడ్డి ప్రతిపాదించిన పనులకు కేటాయించాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. దీనిపై అజీజ్ ఒక్కసారిగా ఆగ్రహోదగ్రులయ్యారు. ఏం ప్రభుత్వ నిధులేమైనా నీ కార్పొరేట్ కాలేజీల ఆస్తులనుకున్నావా... ఇష్టానుసారం పంచేయడానికి? అని నిలదీశారు. ‘ఓ పొలిటికల్ స్కాప్ర్(మాజీ ఎమ్మెల్యే)ను తెచ్చి నా ఎదురుగా కూర్చో పెట్టావు. నన్ను మెంటల్, అసమర్థుడు అని అంటావా? నేనేమీ డమ్మీని కాను. నెల్లూరు కార్పొరేషన్‌కు నేను మేయర్‌ని, నేనే బాస్‌ని. ఆత్మకూరు మునిసిపాలిటీ బాధ్యతలు ఆనం రామనారాయణరెడ్డికి అప్పగించారుగా. అక్కడ కూడా ఇదే విధంగా చేస్తున్నారా? ఆయన రెడ్డిగారని వారి జోలికి వెళ్లరా? నేను మైనార్టీని కాబట్టి మీ ఇష్టం వచ్చినట్లు చేయాలనుకుంటున్నారా?’ అని తీవ్రస్థాయిలో మండిపడ్డారని తెలిసింది.
సహనం కోల్పోయి మంత్రిని ఉద్దేశించి పరుష పదాలను కూడా వాడారని సమాచారం. దీంతో.. పార్టీ నాయకుడు లోకేష్ జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికి వెళుతున్నా, తిరిగి వచ్చాక మళ్లీ మాట్లాడతానంటూ మంత్రి ఫోన్ పెట్టేశారని సమాచారం. పది రోజుల కిందట కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. నెల్లూరులోని తన క్యాంపు కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల కేటాయింపుపై మంత్రి నారాయణ చర్చించేందుకు సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఉదయం 8 గంటలకల్లా సమావేశానికి హాజరు కావాలని మేయర్ అజీజ్‌తో పాటు అధికారులు, ఇతర నాయకులను కోరారు. ఆ సమయానికి మేయర్ తప్ప తక్కిన వారు హాజరయ్యారు. పలుసార్లు ప్రయత్నించిన తరువాత 11 గంటల సమయంలో మేయర్ క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. నన్ను మీరు జీరో చేయాలని చూస్తున్నారు... కానీ ఏమీ చేయలేరని అందరి సమక్షంలోనే మంత్రిని ఉద్దేశించి మేయర్ వ్యాఖ్యానించడం గమనార్హం.