Mayor Narender
-
మేం ఆ పార్టీ కుక్కలం : మేయర్
సాక్షి, వరంగల్ : ‘నేను ఇక్కడే పుట్టా. ఇక్కడే పెరిగా. నగర ప్రజల కోసం ఇక్కడే చస్తానంటూ’ వరంగల్ అర్బన్ నగర మేయర్ నరేందర్ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే కొండా సురేఖతో వివాదంపై ఆయన మీడియాతోమాట్లాడారు. 30 ఏండ్ల రాజకీయ అనుభవం ఉన్న కొండా సురేఖ కేవలం తన మూడేళ్ల రాజకీయానికి భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తాను త్యాగం చేస్తేనే కొండా సురేఖ ఎమ్మెల్యే అయ్యారని పేర్కొన్నారు. ఇంతకాలం పార్టీలో పనిచేశా కాబట్టి వరంగల్ తూర్పు టికెట్ అడిగే హక్కు తనకుందని, అధిష్టానం ఆదేశం మేరకు ఎవరైనా నడుచుకోవాల్సి ఉంటుందన్నారు. ‘నగర మేయర్‌కు, కార్పొరేటర్లది తండ్రీకొడుకుల అనుబంధం. అలాంటి నా వెంట ఉండే కొర్పొరేటర్లను కుక్కలు అనడం చాలా బాధాకరం. అలా చెప్పాలంటే మేం కుక్కలమే. టీఆర్ఎస్ పార్టీ కుక్కలం. తేడా వస్తే నర్సింహావతారం ఎత్తుతా జాగ్రత్త. ఎమ్మెల్యేగారు మీ భాషా దోరణిని మార్చుకోండి. పార్టీ నుండి ఎవరినీ సస్పెండ్ చేయడం మీ వల్ల కాదు. ఆ అవకాశం పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరికే సర్వహక్కులు ఉన్నాయని కూడా మరిచిపోయారా. రాష్ట్రంలో మైనార్టీలకు పెద్దపీట వేసింది కేసీఆర్ ప్రభుత్వం. కానీ కొండా సురేఖ మాకు, మైనార్టీలకు మధ్య చిచ్చుపెట్టాలని యత్నిస్తున్నారని’ మేయర్ నరేందర్ ఆరోపించారు. మేం సైగ చేసుంటే నీ ఇల్లు ధ్వంసమయ్యేది -
మేం సైగ చేసుంటే నీ ఇల్లు ధ్వంసమయ్యేది
వరంగల్: ‘మేయర్ నరేందర్ నీవొక బచ్చేగానివి.. కొండా దంపతులను చంద్రబాబు నాయుడే ఏం చేయలేకపోయాడు.. నీవల్ల ఏం అవుతుంది.. ఇకనైనా చిల్లర రాజకీయాలు మానుకుని ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలి.’అని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మినార్ నిర్మాణంపై మైనార్టీ నాయకులతో వరంగల్‌లో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మైనార్టీ వర్గానికి చెందిన ఒక గొప్పవ్యక్తి పేరిట నిర్మించ తలపెట్టిన మినార్ పునర్నిర్మాణంలో మేయర్ అనవసరంగా జోక్యం చేసుకుని కూల్చి వేశారన్నారు. దీంతో ముస్లింలు ఆవేదనతో చేపట్టిన ధర్నాకు మద్దతు తెలపాల్సి వచ్చిందన్నారు. కొద్ది కాలంగా కాబోయే ఎమ్మెల్యేను నేనే అంటూ మేయర్ నరేందర్ ప్రచారం చేసుకుంటున్నారని.. అయినప్పటికీ తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదన్నారు. ఎన్నికలు వచ్చిన సమయంలో టికెట్ ఎవరికి వస్తుందో.. ఎవరు గెలుస్తారో ఎవరికి ఇవ్వాలన్న విషయాలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలుసన్నారు. మన డబ్బులు, మన ఓట్లతో, మనం గెలిపించుకున్న నాయకులు ఇప్పుడు ఎందుకు వ్యతిరేకం అయ్యారన్న విషయాలను చెప్పాల్సిన అవసరం ఏర్పడిందని సురేఖ పేర్కొన్నారు. మినార్ విషయంలో మైనార్టీ పెద్దలు ఎంతో సంయమనంతో వ్యవహరించారని.. మేం రాత్రి చిన్న సైగ చేసినా మేయర్ ఇల్లు ధ్వంసమయ్యేదన్నారు. అధికారులు వచ్చి సముదాయించినప్పటికీ.. సరైన హామీ ఇవ్వలేక పోయారన్నారు. మినార్ నిర్మాణానికి మేం కట్టుబడి ఉంటామని ఇచ్చిన తమ మాటపై ముస్లిం సోదరులు ధర్నా విరమించడం ఎంతో గొప్ప విషయమని కొండా సురేఖ అన్నారు. -
‘గ్రేటర్’కు చెడ్డ పేరు తేవద్దు
అధికారులపై మేయర్ నరేందర్ ఆగ్రహం విధులను నిర్లక్ష్యం చేస్తే చర్య తీసుకోవాలని ఆదేశం అధికారులతో సమీక్ష వరంగల్ అర్బన్ : కొంతమంది అధికారులు, ఉద్యోగులు బాధ్యతల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, గ్రేటర్‌కు చెడ్డపేరు తేవద్దని గ్రేటర్ మేయర్ నన్నపునేని నరేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం మహానగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో వింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రధాన కార్యాలయం, సర్కిల్ కార్యాలయాల్లోని ఉద్యోగులు సమయపాలన పాటించడం లేదని అన్నారు. అధికారులు, ఉద్యోగుల విధులపై నిఘా ఉంచాలని అడిషనల్ కమిషనర్ షాహిద్ మసుద్‌కు సూచించారు. నిర్లక్ష్యపు అధికారులపై చర్య తీసుకోవాలని హెచ్చరించారు. ప్రజారోగ్య విభాగానికి 25 సంవత్సరాలుగా ఒకే కాంట్రాక్టర్ రసాయనాలను సరఫరా చేయడం సరికాదని, కాంట్రాక్టర్‌ను మార్చలని ఎంహెచ్వో రాజారెడ్డిని ఆదేశించారు. స్వచ్ఛత ఆటోలు రాబోతున్నాయని, డస్ట్బిన్లు కొనుగోలు చేయాలని ఈఈ లింగామూర్తిని ఆదేశించారు. మహానగరంలో వెలుస్తున్న అక్రమ నిర్మాణాలపై టౌన్ ప్లానింగ్ అధికారులు, చూసీచూడనట్లుగా వ్యవహరించడం సరికాదన్నారు. క్షేత్ర స్థాయిలో తనీఖీలు నిర్వహించి అక్రమార్కులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ఆన్లైన్ అనుమతులు, గ్రీవెన్స్ సెల్ ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలన్నారు. సమావేశంలో అడిషనల్ కమిషనర్ షాహిద్ మసుద్, డిప్యూటీ కమిషనర్ ఇంద్రసేనా రెడ్డి, సెక్రటరీ నాగరాజ రావు, ఇన్చార్జి ఎస్ఈ భిక్షపతి, ఇన్చార్జి సీపీ చంద్రిక, ఈఈ లింగామూర్తి, ఎంహెచ్వో రాజారెడ్డి, ఏసీపీ శైలజ,గణపతి, శ్యాంకుమార్, రవి,ఇన్చార్జ్ ఉద్యాన వన అధికారి సదానందం పాల్గొన్నారు.