
వరంగల్: ‘మేయర్ నరేందర్ నీవొక బచ్చేగానివి.. కొండా దంపతులను చంద్రబాబు నాయుడే ఏం చేయలేకపోయాడు.. నీవల్ల ఏం అవుతుంది.. ఇకనైనా చిల్లర రాజకీయాలు మానుకుని ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలి.’అని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మినార్ నిర్మాణంపై మైనార్టీ నాయకులతో వరంగల్‌లో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మైనార్టీ వర్గానికి చెందిన ఒక గొప్పవ్యక్తి పేరిట నిర్మించ తలపెట్టిన మినార్ పునర్నిర్మాణంలో మేయర్ అనవసరంగా జోక్యం చేసుకుని కూల్చి వేశారన్నారు.
దీంతో ముస్లింలు ఆవేదనతో చేపట్టిన ధర్నాకు మద్దతు తెలపాల్సి వచ్చిందన్నారు. కొద్ది కాలంగా కాబోయే ఎమ్మెల్యేను నేనే అంటూ మేయర్ నరేందర్ ప్రచారం చేసుకుంటున్నారని.. అయినప్పటికీ తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదన్నారు. ఎన్నికలు వచ్చిన సమయంలో టికెట్ ఎవరికి వస్తుందో.. ఎవరు గెలుస్తారో ఎవరికి ఇవ్వాలన్న విషయాలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలుసన్నారు. మన డబ్బులు, మన ఓట్లతో, మనం గెలిపించుకున్న నాయకులు ఇప్పుడు ఎందుకు వ్యతిరేకం అయ్యారన్న విషయాలను చెప్పాల్సిన అవసరం ఏర్పడిందని సురేఖ పేర్కొన్నారు.
మినార్ విషయంలో మైనార్టీ పెద్దలు ఎంతో సంయమనంతో వ్యవహరించారని.. మేం రాత్రి చిన్న సైగ చేసినా మేయర్ ఇల్లు ధ్వంసమయ్యేదన్నారు. అధికారులు వచ్చి సముదాయించినప్పటికీ.. సరైన హామీ ఇవ్వలేక పోయారన్నారు. మినార్ నిర్మాణానికి మేం కట్టుబడి ఉంటామని ఇచ్చిన తమ మాటపై ముస్లిం సోదరులు ధర్నా విరమించడం ఎంతో గొప్ప విషయమని కొండా సురేఖ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment