ఎంబీసీ చిట్టా.. తేలేదెట్టా?
సాక్షి, హైదరాబాద్: బీసీల్లో అత్యంత వెనుకబడిన కులాలకు (ఎంబీసీలు) చెందిన వారెవరన్న అంశంలో ఇప్పటికీ స్పష్టత రాలేదు. గత బడ్జెట్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ఎంబీసీ కులాల అభివృద్ధి, సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. కానీ ఏడాది గడిచినా ఏయే కులాలను ఎంబీసీ జాబితాలో చేర్చాలో నిర్ణయించలేదు. బీసీల్లో మొత్తం 113 కులాలు ఉండగా.. వీటిలో 96 కులాలను ఎంబీసీలుగా పరిగణించాలని పలుమార్లు సీఎం సమక్షంలో జరిగిన సమావేశాల్లో ప్రస్తావనకు వచ్చింది.
కానీ ఏయే కులాలను చేర్చాలి, వేటిని మినహాయించాలనేది ప్రభుత్వం వెల్లడించలేదు. ఈ బాధ్యతను తెలంగాణ బీసీ కమిషన్‌కు అప్పగించినా... కమిషన్ సైతం ఈ దిశగా తమ నివేదికను అందించలేదు. గతేడాది బడ్జెట్లో బీసీ సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ.వెయ్యి కోట్లు కేటాయించింది. నాయీ బ్రాహ్మణులు, రజకులకు రూ.250 కోట్ల చొప్పున కేటాయించింది. బడ్జెట్ తర్వాత ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కానీ బీసీల సమగ్రాభివృద్ధి పేరుతో జాప్యం జరగడంతో ఈ నిధులు ఇప్పటికీ ఖర్చు కాలేదు.
ఈ లోగా యాదవులకు గొర్రెల పంపిణీ, మత్స్యకారులకు చేపల పంపిణీ, నేతన్నలకు ప్రోత్సాహకాలను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. వచ్చే బడ్జెట్లో నాయీ బ్రాహ్మణులు, రజకులకు కులవృత్తులకు వీలుగా రాయితీతో ఆధునిక పనిముట్లు అందించాలని, విశ్వకర్మలు, శాలివాహనులు, సంచార జాతులకు ప్రత్యేక పథకాలు అమలు చేయాలని భావిస్తోంది. సంచార జాతులను ఎంబీసీలుగా పరిగణిస్తారనే విషయం ప్రచారంలో ఉంది. కానీ తమను ఎంబీసీల్లో చేర్చవద్దని, ప్రత్యేకంగా గుర్తింపు ఇవ్వాలని సంచార జాతులు డిమాండ్ చేస్తున్నాయి.