MCD workers
-
ఎన్ హెచ్ 24పై ట్రాఫిక్ జామ్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మున్సిపల్ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. వేతన బకాయిలు చెల్లించాలన్న డిమాండ్ తో 8వ రోజూ ఉధృతంగా ఆందోళన జరుగుతోంది. బుధవారం రోడ్లమీదకు వచ్చిన మున్సిపల్ కార్మికులు పలుచోట్ల పాలకుల దిష్టబొమ్మలను దగ్ధం చేశారు. రాస్తారోకో నిర్వహించారు. నిర్మన్ విహార్ ముందు బైఠాయించి నినాదాలతో హోరెత్తించారు. దీంతో 24వ నంబర్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. పెద్ద ఎత్తున బారులు తీరిన వాహనాలతో వాహనదారులు అష్టకష్టాలు పడుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సహా, వివిధ శాఖల మంత్రుల ఇళ్లముందు చెత్తవేసి, నిరసన పత్రాలు అంటించి వినూత్నంగా చేపట్టిన తమ పోరాటాన్ని పారిశుద్ధ్య కార్మికులు నేడు కూడా కొనసాగిస్తున్నారు. తమ డిమాండ్లను నెరవేర్చేంతవరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెగేసి చెబుతున్నారు. అటు ఆప్ ప్రభుత్వం చెత్తను క్లీన్ చేసేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి, కొన్ని ప్రత్యేక చర్యలు చేపట్టింది. కాగా ఈ వ్యవహారంలో ఆప్ ప్రభుత్వానికి, బీజేపీకి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. -
డిప్యూటీ సీఎం ఇంటిముందు చెత్తవేసి మరీ...
ఢిల్లీ: ఢిల్లీలోని పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన సెగ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి తీవ్రంగా తాకుతోంది. వేతనాలు రెగ్యులర్‌గా చెల్లించాలంటూ పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న ఆందోళన ఉధృతరూపం దాలుస్తోంది. తమ డిమాండ్ల సాధనకు వినూత్న రూపంలో ఆందోళనకు దిగారు. నిన్నముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేసిన ఆందోళనకారులు తమ పోరాట వేదికను ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇంటికి మార్చారు. చెత్తా చెదారాన్ని మనీష్ ఇంటి లోపలకి విసిరేసి.... నిరసన తెలిపారు. నినాదాలతో హోరెత్తించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులకు, ఆందోళకారులకు మధ్య తోపులాట జరిగింది. మున్సిపల్ కార్మికుల ఆందోళనలతో ఢిల్లీ హోరెత్తుతోంది. పెండింగ్ వేతనాలు విడుదల చేయాలంటూ మున్సిపల్ ఉద్యోగులు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. ఏడెనిమిది నెలలుగా జీతాలు ఇవ్వకపోతే.... బతికేదెలా అని ప్రశ్నించారు. తమను పస్తులు ఉంచుతున్నారంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను తిట్టిపోశారు. డిమాండ్లు సాధించే వరకు పోరాటాన్ని ఆపబోమని తేల్చిచెప్పారు. అటు కార్మికులు చేస్తున్న సమ్మెపై వివరణ ఇవ్వాల్సిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.