నయూం అనుచరుల లొంగుబాటు
మూడు నెలల క్రితమే పాశం శ్రీను,
సుధాకర్‌పై పీడీ యాక్ట్ కేసు
అనారోగ్య కారణాలతోనే లొంగిపోయినట్లు పాశం వెల్లడి
రాజకీయ కుట్రలో భాగంగానే కేసులో ఇరికించారని సుధాకర్ ఆవేదన
నల్లగొండ : మావోయిస్టు వ్యతిరేక ఉద్యమకారుడిగా గుర్తింపు పొందిన నయీం అనచరులు పాశం శ్రీనివాస్, భువనగిరి జెడ్పీటీసీ సందెల సుధాకర్ శుక్రవారం నల్లగొండ ఎస్పీ ఎన్.ప్రకాశ్‌రెడ్డి ఎదుట లొంగిపోయారు. మూడు నెలల క్రితం వీరిపై పీడీయాక్టు కింద కేసు నమోదైంది. అప్పటి నుంచి వీరు అజ్ఞాతంలో ఉన్నారు. పాశం శ్రీనివాస్‌కు పది రోజుల క్రితం కరీంనగర్ జిల్లా గోదావరి ఖనిలో గుండెపోటు వచ్చిందని వదంతులు వచ్చాయి. ఆ తర్వాత అదృశ్యమైన శ్రీనివాస్ తిరుపతి, మహానంది, ఒరిస్సా, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో తలదాచుకున్నాడు. టీఆర్ఎస్ నాయకుడు కొనపురి రాములు హత్య కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అడ్వకేట్ ఛత్రపతి ద్వారా ఎస్పీ దగ్గర ఇద్దరు లొంగిపోయారు. అనారోగ్య కారణాలతోనే లొంగిపోతున్నట్లు పాశం శ్రీనివాస్ వెల్లడించగా రాజకీయ కుట్ర, శ్రీనివాస్ దగ్గరకి తరచుగా వెళ్లడం వలన తనపై పీడీ యాక్టు కేసు పెట్టినట్లు జెడ్పీటీసీ సుధాకర్ తెలిపారు. దళిత నాయకుడిగా ఎదగడాన్ని ఓర్వలేకనే కేసులో ఇరికించారని ఆయన మీడియా ఎదుట వాపోయాడు.
వీడిన సస్పెన్స్
భువనగిరి : మాజీ మావోయిస్టు ఎండీ నయీం ముఖ్య అనుచరుడు భువనగిరికి చెందిన పాశం శ్రీనివాస్, భువనగిరి జెడ్పీటీసీ సందెలసుధాకర్ పోలీసులకు లొంగిపోయారు. దీంతో నెల రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరపడింది. భువనగిరి, యాదగిరిగుట్ట ప్రాంతాల్లో చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని పట్టణానికి చెందిన ఎస్కె షకీల్, పాశం శ్రీను, సందెల సుధాకర్‌పై పోలీసులు పీడీ యాక్టు నమోదు చేశారు. గత ఏప్రిల్ నుంచి ముగ్గురి కోసం గాలిస్తున్నా చిక్కకుండా రహస్య ప్రాంతానికి తరలిపోయారు. అయితే భువనగిరి పట్టణంలోని రిసార్టులో ఇటీవల పాశం శ్రీను పోలీసులకు పట్టుబడినప్పటికీ చాకచక్యంగా తప్పించుకుపోయారని సమాచారం. ముగ్గురి సెల్ఫోన్లు, అనుచరులపై నిరంతర నిఘా కొనసాగించారు. ఈ నేపథ్యంలో తిర్మలగిరిలోని ఓ ఇంట్లో తలదాచుకున్నారని స మాచారం రావడంతో ఏప్రిల్ రెండవ వారంలో అప్పటి ఎస్పీ దుగ్గల్ ఆదేశాల మేరకు భువనగిరి డివిజన్‌కు చెందిన సీఐ లు వీరిని పట్టుకోవడానికి చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. నిందితులు ఉన్నారన్న సమాచారంతో తాళం పగులగొట్టినా ఇంట్లో ఎవరు దొరకకపోవడంతో పెద్ద దుమారం లేచింది.
షకీల్ మరణంతో సంచలనం
పీడీ యాక్టు నమోదు అయిన ముగ్గురిలో ప్రధాన నిందితుడు ఎస్కే షకీల్ గత జూన్ 14న గుండెపోటుతో మృతిచెందాడు. మెదక్ జిల్లాలో ఉంటున్న సమయంలో గుండెపోటు రావడం అస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీంతో ఆయన మరణంపై పలు ఆరోపణలు వచ్చాయి.
పాశం శ్రీను మృతిచెందాడంటూ...
ఎస్కె షకీల్ మరణం తర్వాత మరో నిందితుడు పాశం శ్రీను కూడా గుండెపోటుతో మృతి చెందాడని గత నెలలో సోషల్‌మీడియా, టీవీ చానెళ్లలో స్క్రోలింగ్‌లు, వార్తలు వచ్చాయి. కరీంనగర్ జిల్లా గోదావరి ఖనిలో ఉండగా పాశం శ్రీనుకు గుండెపోటు రాగా ఆయన స్నేహితుడు ఒకరు అక్కడే ఆస్పత్రిలో చేర్పించాడని, కోమాలోకి వెళ్లిన శ్రీనివాస్ అప్పటికే ప్రాణాలుకోల్పోయాడని నాలుగురోజుల పాటు ప్రచారం జరిగింది. మృతదేహాన్ని నలుగురు వ్యక్తులు తీసుకుపోయారని వారు పోలీస్లేనన్న అనుమానం వ్యక్తం అయ్యింది. అయితే ఈ మేరకు తన భర్తను గుర్తుతెలియని వ్యక్తులు తీసుకుపోయారని ఆయ న అదృశ్యంపై అనుమానాలున్నయని పాశం శ్రీను భార్య నళిని హెచ్ఆర్సీలో జూన్30న ిఫిర్యాదు చేశారు. అయితే శ్రీను అదృశ్యం వెనుక అయన అనారోగ్యమే కారణమని మరో వాదన విన్పించింది. గుండెపోటు రావడంతో వైద్యం కోసం రహస్యంగా మరో కార్పొరేట్ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.వైద్యం అందించడానికి ఆయనకు సంబంధించిన వ్యక్తులే తీసుకుపోయినట్లు ప్రచారం సాగింది. ఒక దశలో ఆయనతో పాటు మరో నిందితుడు చనిపోయాడని ప్రచారం జరిగింది. మరో వైపు పాశం శ్రీను విదేశాలకు వెళ్లాడన్న ప్రచారం కూడా సాగింది. ఈ నేపథ్యంలో శ్రీనుతో పాటు జెడ్పీటీసీ సందెల సుధాకర్ కూడా ఎస్పీ ఎదుట లొంగిపోవడంతో ఇంతకాలం భువనగిరి ప్రాంతంలో నెలకొన్న సస్పెన్సకు తెరపడింది.