యాంత్రీకరణే అధిక దిగుబడికి పరిష్కారం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రపంచ జనాభా 2040 నాటికి 900 కోట్లకు చేరుకోనుంది. వీరందరికీ సరిపడ ఆహారోత్పత్తి పెద్ద సవాల్ అని కోరమాండల్ ఇంటర్నేషనల్ ఎండీ సమీర్ గోయల్ తెలిపారు. నేలల రకాన్నిబట్టి ప్రత్యేక పోషకాలు, యాంత్రీకరణ, నదుల అనుసంధానం, కరువును తట్టుకునే వంగడాలు అధిక దిగుబడికి పరిష్కారమని బుధవారమిక్కడ జరిగిన సీఐఐ సదస్సులో తెలిపారు. దున్నటం, పంట కోతలకు మాత్రమే యాంత్రికీకరణ పరిమితమవుతోందని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వీసీ వి.ప్రవీణ్‌రావు అన్నారు. కరువు తట్టుకునే విత్తనాల అభివృద్ధిపై దృష్టిసారించామని చెప్పారు. బీటీ పత్తి విత్తనాలపై ఆధారపడడం తగ్గించే చర్యల్లో భాగంగా తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు పెరిగేలా వంగడాలను సృష్టించే పనిలో ఉన్నట్టు తెలిపారు.
అనుమతులు మీరిచ్చి...
కోరమాండల్ స్పాన్సర్ చేసిన సీఐఐ సదస్సుకు ఆ కంపెనీ డీలర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విత్తన కంపెనీలకు అనుమతులు ఇచ్చేది మీరు, నకిలీ విత్తనాలు అమ్ముతున్నారంటూ చర్యలు మాపైనా తీసుకోవడమేంటని మెదక్ ఫెర్టిలైజర్స్, సీడ్స, పెస్టిసైడ్‌స అసోసియేషన్ ప్రెసిడెంట్ బి.వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. దీంతో తెలంగాణ వ్యవసాయ శాఖ కమిషనర్ ఎం.జగన్ మోహన్తోసహా వేదిక పైన ఉన్నవారంతా ఖంగుతిన్నారు. యూరియా బస్తాలు తక్కువ బరువుతో వచ్చినా తయారీ కంపెనీలపై చర్య తీసుకోకుండా డీలర్లను బలి చేస్తున్నారని దుయ్యబట్టారు. కోట్లాది రూపాయల ప్రజా ధనం వృధా అవుతున్నా ప్రభుత్వ శాఖల నుంచి కొత్త వంగడాలు పెద్దగా రావడం లేదన్నారు.
ఏడాదిలో విస్తరణ పూర్తి...
వైజాగ్‌లో ఉన్న ఫాస్ఫారిక్ యాసిడ్ తయారీ యూనిట్‌ను కోరమాండల్ విస్తరిస్తోంది. ప్రస్తుతం ఈ ప్లాంటు సామర్థ్యం రోజుకు 700 టన్నులు. దీనిని 1,000 టన్నులకు చేర్చనున్నారు. విస్తరణకై డిసెంబరు 8న (నేడు) ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతోంది. కాలుష్య నియంత్రణ మండలి నుంచి అనుమతి రాగానే 12 నెలల్లో ప్లాంటు సిద్ధం చేస్తామని కంపెనీ మార్కెటింగ్ ప్రెసిడెంట్ జి.రవి ప్రసాద్ తెలిపారు. విస్తరణకు కంపెనీ రూ.225 కోట్లు వ్యయం చేస్తోంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 275 మందికి ఉద్యోగాలు రానున్నాయి.