రాష్ట్ర విభజనతో మాదిగలకు అన్యాయం
– ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య
విస్సన్నపేట :
రాష్ట్ర విభజనతో మాదిగలకు అన్యాయం జరిగిందని ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య మాదిగ అన్నారు. స్థానిక లయన్స్ క్లబ్ ప్రాంగణంలో ఏపీ ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి మేశపాం కృష్ణచైతన్య అధ్యక్షతన ముఖ్య నాయకుల సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడుతూ ఎన్నికల సమయంలో మాదిగలకు ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబు విస్మరించారని, ఎస్సీ వర్గీకరణ గురించి పట్టించుకోకపోవడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. వెంటనే ఎస్సీ వర్గీకరణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లెడ్క్యాప్ బోర్డు ఏర్పాటుచేసి మాదిగల సంక్షేమానికి కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో లెదర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యూనివర్సిటీని నెలకొల్పాలని, ఇందుకోసం 500 ఎకరాలు కేటాయించాలని కోరారు. సంక్షేమ పథకాలకు వయోపరిమితిని ఎత్తివేయాలని, జన్మభూమి కమిటీలు రద్దు చేయాలన్నారు. అక్టోబర్ 6 నుంచి ‘మన మాదిగ పల్లెలు’ అనే కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో పర్యటించి డిసెంబర్ 6వ తేదీన ఒంగోలులో ఆత్మగౌరవ సభ నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎం.నాగేశ్వరరావు, కంచర్ల సుధాకర్, మోదుగు నాగేశ్వరరావు, జిల్లా కో–కన్వీనర్ ముల్లగిరి రాణి పాల్గొన్నారు.