mega food park
-
తుది దశకు ‘మెగా ఫుడ్‌పార్కు’
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ మౌలిక వసతుల కల్పనసంస్థ (ఏపీఐఐసీ) ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా మల్లవల్లిలో ఏర్పాటు చేస్తున్న మెగా ఫుడ్ పార్కు పనులు తుదిదశకు చేరాయి. ఏప్రిల్ 15 కల్లా పనులు పూర్తిచేసి.. మామిడి సీజన్ ప్రారంభమయ్యే నాటికి కార్యకలాపాలు నిర్వహించేందుకు అధికా రులు సన్నాహాలు చేస్తున్నారు. బాపులపాడు మండలం మల్లవల్లిలో 100 ఎకరాలను ఫుడ్ పార్కుకు కేటాయించారు. ఈ ప్రాంతంలో ప్రధానంగా మామిడి, బొప్పాయి, జామ వంటి పండ్లతోటలు, టమా టా తదితర కూరగాయలు పెద్ద ఎత్తున సాగు చేస్తుం టారు. దీంతో వివిధ రకాల పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్ కోసం మెగా ఫుడ్‌పార్కులో రూ.86 కోట్లతో 7.48 ఎకరాల్లో కోర్ ప్రాసెసింగ్ సెంటర్ (సీపీసీ)ను పూర్తిస్థాయి వసతులతో నిర్మిస్తున్నారు. ఇందులో 960 టన్నుల సామర్థ్యంతో పండ్లను మగ్గ బెట్టడంతో పాటు గంటకు ఆరు నుంచి పది టన్నుల గుజ్జు, రసాలు తీయొచ్చు. బియ్యం, జొన్నలు వంటి ఆహార పదార్థాలనూ నిల్వ చేసుకునేందుకు వీలుగా 4 వేలటన్నుల సామర్థ్యం గల గిడ్డంగిని నిర్మించారు. పండ్లు, కూరగాయల నిల్వకు కూడా 3 వేల టన్నుల సామర్థ్యంతో శీతల గిడ్డంగి, ప్యాకింగ్ యూనిట్లు, ఆహార ఉత్పత్తుల నాణ్యత పరిశీలించేందుకు ఎనలై టికల్ ల్యాబ్ తదితర అన్ని అధునాతన వసతులు ఏర్పాటు చేశారు. ఇక్కడ రూ.260 కోట్లతో ఏర్పాటు చేస్తున్న రెండు మెగా ఫుడ్‌పార్కులు అందుబాటు లోకి వస్తే దాదాపు 6 వేలమందికి ఉపాధి లభిస్తుం దని అంచనా వేస్తున్నారు. పనితీరు, ఇక్కడి సౌకర్యా ల గురించి పెట్టుబడిదారులకు అవగాహన కల్పిం చేందుకు ఏపీఐఐసీ త్వరలో రోడ్ షోలు నిర్వహించబోతోంది. నేరుగా ఇక్కడకు సరుకు తీసుకువచ్చిన వారు.. కావాల్సిన విధంగా ప్రాసెస్ చేసుకొని, అవసరమైన పరిమాణంలో ప్యాకింగ్ చేసి, తీసుకెళ్లే సదుపాయాలు కల్పించినట్లు ఏపీఐఐసీ అధికారులు వివరించారు. చాలా సంస్థలు వస్తున్నాయ్.. ఏప్రిల్ 15కల్లా మెగా ఫుడ్ పార్కులో పనులు పూర్తి చేసి కార్యకలాపాలు మొదలుపెట్టేందుకు కృషి చేస్తున్నాం. ప్రస్తుతం ట్రయల్ రన్ నడుస్తోంది. ఇప్పటికే ప్రొడక్షన్, మార్కెటింగ్‌కు సంబంధించిన యూనిట్లు నెలకొల్పేందుకు చాలా సంస్థలు ఏపీఐఐసీని సంప్రదించాయి. – డి.శ్రీనివాసరావు, జోనల్ మేనేజర్, ఏపీఐఐసీ -
మల్లవల్లి ఫుడ్ పార్క్ ద్వారా రూ.260 కోట్ల పెట్టుబడులు
సాక్షి, అమరావతి: ఏపీ మౌలిక వసతుల కల్పన సంస్థ(ఏపీఐఐసీ) కృష్ణా జిల్లా మల్లవల్లి వద్ద అభివృద్ధి చేసిన రెండు మెగా ఫుడ్ పార్కుల ద్వారా రూ.260 కోట్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించడమేగాక, 6,000 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తోంది. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వ నిధులతో రూ.112.94 కోట్లతో 57.95 ఎకరాల్లో మెగా ఫుడ్ పార్కును అభివృద్ధి చేయగా, దాని పక్కనే ఏపీఐఐసీ 42.55 ఎకరాల్లో మరో ఫుడ్ పార్కును అభివృద్ధి చేసింది. మెగా ఫుడ్ పార్కులో రూ.86 కోట్ల తో ఏర్పాటు చేసిన కోర్ ప్రాసెసింగ్ సెంటర్(సీపీసీ)ను ఈ మామిడి పండ్ల సీజన్‌కు అందుబాటులోకి తెస్తామని ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మామిడి, టమాట, బొప్పాయి, జామ, అరటి పండ్లతో పాటు వివిధ ఆహార ధాన్యాలను ప్రాసెస్ చేసి ప్యాకింగ్ చేసుకునేలా సీపీసీని తీర్చిదిద్దినట్టు తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ పార్కుల్లో పెట్టుబడులను ఆకర్షించేలా ఏప్రిల్ మొ దటి వారంలో రోడ్ షోలు నిర్వహిస్తామని ఏపీఐ ఐసీ వీసీ,ఎండీ జవ్వాది సుబ్రమణ్యం చెప్పారు. -
మార్చికి మల్లవల్లి ఫుడ్‌పార్క్
సాక్షి, అమరావతి: కృష్ణాజిల్లా మల్లవల్లి మెగాఫుడ్ పార్కును రానున్న మామిడి పళ్ల సీజన్ నాటికి అందుబాటులోకి తెచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ మౌలిక వసతుల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) ప్రణాళిక సిద్ధంచేసింది. ఇందులో భాగంగా.. ముడి పదార్థం నుంచి గుజ్జు, పండ్ల రసాలు తీసి ప్యాకింగ్ చేసి ఎగుమతి చేసుకునేలా భారీ సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్ (సీపీసీ)ను ఏర్పాటుచేసింది. మొత్తం 57.45 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన ఈ మెగా ఫుడ్ పార్కులో సుమారు రూ.16 కోట్లతో సీపీసీని ఏర్పాటుచేశారు. అన్ని రకాల పండ్ల రసాలు, పొడులు, నూకలు కావాల్సిన పరిమాణంలో ప్యాకింగ్, ఆహార నాణ్యతను పరిశీలించే ల్యాబ్‌లను ఈ సీపీసీలో నెలకొల్పారు. దీని పనితీరుపై చేసిన ప్రయోగాలు విజయవంతమయ్యాయని.. మార్చి నెలాఖరు నాటికి ఈ యూనిట్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఏపీఐఐసీ చీఫ్ ఇంజనీర్ సీహెచ్ఎస్ఎస్ ప్రసాద్ ‘సాక్షి’కి తెలిపారు. ఈ ఫుడ్‌పార్క్ పనులను ఏపీఐఐసీ బృందం శనివారం తనిఖీ చేసింది. అలాగే, దీనిపక్కనే ఏపీఐఐసీ 42.55 ఎకరాల్లో మరో స్టేట్ ఫుడ్‌పార్క్‌ను ఏర్పాటుచేసింది. ఇక్కడ ఏర్పాటుచేసే యూనిట్లు కూడా ఈ సీపీసీ సౌకర్యాలను వినియోగించుకోవచ్చు. ఈ రెండు పార్కుల ద్వారా సుమారు రూ.260 కోట్ల పెట్టుబడులు, ఆరువేల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. సీపీసీ నిర్వహణకు టెండర్లు ఈ సీపీసీ నిర్వహణను మూడేళ్లపాటు లీజుకిచ్చేందుకు ఆసక్తిగల సంస్థల నుంచి బిడ్లను కోరుతూ ఏపీఐఐసీ టెండర్లు పిలిచింది. ఫిబ్రవరి 15న మొదలయ్యే ఈ బిడ్ల దాఖలు కార్యక్రమం మార్చి 1తో పూర్తవుతుంది. గంటకు 6–10 టన్నుల గుజ్జు, కాన్సెంట్రేషన్ లైన్, 120 టన్నుల సామర్థ్యం ఉండే పండ్లను మగ్గబెట్టే (రైపెనింగ్) చాంబర్లు ఎనిమది, 3,000 టన్నుల శీతల గిడ్డంగి, 4,000 టన్నుల సరుకు నిల్వచేసే గిడ్డంగితో పాటు ల్యాబ్‌లు సీపీసీ పరిధిలోకి వస్తాయి. ఏటా 5 శాతం చొప్పున అద్దె పెంచనున్నట్లు నిబంధనల్లో స్పష్టంగా పేర్కొన్నామని ప్రసాద్ తెలిపారు. త్వరలో రోడ్ షో ఈ మెగా ఫుడ్‌పార్క్‌లోని సెంట్రల్ ప్రోసెసింగ్ సెంటర్ సౌకర్యాలను రైతులకు, పెట్టుబడిదారులకు తెలియజేయడానికి త్వరలోనే రోడ్ షో నిర్వహించనున్నట్లు ఏపీఐఐసీ ఎండీ రవీన్‌కుమార్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ముడి సరుకును తీసుకొచ్చి వారికి కావాల్సిన పరిమాణంలో శుద్ధిచేసిన ఉత్పత్తులను తీసుకువెళ్లేలా ఇందులో సౌకర్యాలు కల్పించామన్నారు. మామిడి, టమోటా, బొప్పాయి, జామ, అరటి పండ్లతో పాటు వివిధ ఆహార ధాన్యాలను ప్రాసెస్ చేసి ప్యాకింగ్ చేసి తీసుకెళ్లొచ్చన్నారు. ఇప్పటికే ఈ పార్క్‌లో యూనిట్లు ఏర్పాటుచేయడానికి కొన్ని సంస్థలు ముందుకొచ్చాయని, మరికొన్ని సంస్థలు చర్చలు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. సీపీసీలో వసతులివీ.. – గంటకు ఆరు టన్నుల టమోటా, 10 టన్నుల మామిడి, 5 టన్నుల బొప్పాయి, 6 టన్నుల జామ, 4 టన్నుల అరటి గుజ్జు లేదా రసం తీసే ఆస్పెటిక్ పల్ప్‌లైన్.. – 200 ఎంఎల్ సామర్థ్యం కలిగిన జ్యూస్ ప్యాకెట్లు స్ట్రాతో కలిపి గంటకు 7,500 ప్యాకింగ్ చేసే పూర్తిస్థాయి అటోమేటిక్ ఫిల్లింగ్, ప్యాకింగ్ లైన్.. – జొన్నలు, బియ్యం వంటి ఆహార ఉత్పత్తులను నిల్వచేసుకోవడానికి 4,000 టన్నుల సామర్థ్యంతో గిడ్డంగి.. – పండ్లు, కూరగాయల నిల్వకు 3,000 టన్నుల సామర్థ్యం ఉన్న శీతల గిడ్డంగి.. – మామిడి, అరటి, టమోటా వంటి పండ్లను మగ్గ పెట్టడానికి 960 టన్నుల సామర్థ్యం కలిగిన ఈసీఆర్‌సీ రైపెనింగ్ చాంబర్స్.. – సుగంధ ద్రవ్యాలు, పప్పులు, బియ్యం వంటి పొడులు, గ్రాన్యూల్స్‌ను 100 గ్రాముల నుంచి 2 కేజీలకు వరకు ప్యాకింగ్ చేసే యూనిట్లు.. – చిన్న ప్యాకెట్లు అయితే నిమిషానికి 50–70, పెద్దవి అయితే 25–30 ప్యాకెట్ల ప్యాకింగ్.. – ఈ అహార పదార్థాలను పరీక్షించడానికి ఎనలైటికల్ ల్యాబ్. -
ఫుడ్ పార్క్: రాందేవ్ బాబాకు సీఎం యోగి ఫోన్...
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో రూ.6వేల కోట్లతో మెగా ఫుడ్ పార్క్ పెట్టాలన్న ఆలోచనను వెనక్కి తీసుకుంటున్నట్లు పతాంజలి సంస్థ ప్రకటించిన నేపథ్యంలో యూపీ సీఎం రంగంలోకి దిగారు. ఫుడ్ పార్క్ రాష్ట్రం నుంచి తరలించవద్దని పతాంజలి సంస్థ సహ వ్యవస్థాపకులైన రాందేవ్ బాబాను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కోరారు. ఈ మేరకు ఆయనే స్వయంగా ఫోన్ చేసి పతంజలి ఆయుర్వేద్ ఛీప్ ఆచార్య బాలక్రిష్ణ, రాందేవ్ బాబాలతో మాట్లాడారు. పార్క్ ఏర్పాటుకు ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు. ప్రాజెక్టుకు సంబంధించిన సమస్యలు త్వరలోనే పరిష్కారం చేస్తామని యోగి వారికి హామీ ఇచ్చారు. సీఎం హామీ ఇవ్వడంతో రాందేవ్ కూడా పుడ్ పార్క్‌ను యూపీలోనే ఏర్పాటు చేయడానికి అంగీకరించారని యూపీ పరిశ్రమల మంత్రి సతీశ్ మహానా పేర్కొన్నారు. యూపీలోని యమునా ఎక్స్‌ప్రెస్ హైవే సమీపంలో 425 ఎకరాల్లో పతంజలి మెగా ఫుడ్ పార్క్ పెట్టాలని భావించింది. అయితే యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఇందుకు సహకరించడంలేదని పతంజలి ఛీప్ ఆచార్య బాలక్రిష్ణ మంగళవారం ఆరోపించారు. ‘పుడ్ పార్క్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందడం లేదు. అనుమతుల కోసం చాలా కాలం ఎదురుచూశాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు లభించడం లేదు. ఇప్పుడు మేము ఈ ప్రాజెక్టును వేరే రాష్ట్రానికి మార్చాలని నిర్ణయించాం’ అని బాలకృష్ణ వెల్లడించారు. ఆచార్య బాల క్రిష్ణ ఇలా బహిరంగంగా ప్రభుత్వాన్ని విమర్శించడంతో యోగి వెంటనే రాందేవ్ బాబాతో మాట్లాడారు. -
యోగిపై విసుగెత్తిన బాబా రాందేవ్ ఏం చేశారంటే..
లక్నో : యోగా గురు బాబా రాందేవ్, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై విసుగెత్తిపోయారు. యోగి ఎన్నిరోజులకు కూడా తమ ప్రతిష్టాత్మకమైన ఫుడ్ పార్క్‌కు క్లియరెన్స్ ఇవ్వకపోవడంపై విసుగుచెందిన బాబా రాందేవ్, చివరికి తన ఫుడ్ పార్క్‌నే ఉత్తరప్రదేశ్ నుంచి తరలించేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో యమునా ఎక్స్‌ప్రెవేతో పాటు మెగాఫుడ్‌పార్క్‌ను నిర్మించాలనుకున్నారు. అయితే ఈ ఫుడ్ పార్క్ స్కీమ్ కోసం కేంద్రానికి సమర్పించాల్సిన అర్హత పత్రాలను కంపెనీ పొందలేకపోతుందని పతంజలి మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలక్రిష్ణ చెప్పారు. పేపర్ వర్క్ విషయంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆలస్యం చేస్తూ పోతుందని పేర్కొన్నారు. ‘ ఈ ప్రాజెక్ట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందడం లేదు. క్లియరెన్స్ కోసం చాలా కాలంగా వేచిచూస్తున్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం అవి ఇవ్వడం లేదు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌ను ఇక్కడి నుంచి తరలించాలని నిర్ణయించాం’ అని ఆచార్య బాలక్రిష్ణ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో పలుమార్లు సమావేశమయ్యామని, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ఈ విషయంలో చాలా జాప్యం చేస్తున్నారన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్షల మంది వ్యవసాయదారుల జీవన పరిస్థితులను మెరుగుపర్చేందుకు ఏర్పాటయ్యే ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌కు కావాల్సిన మిషనరీని కంపెనీ ఇప్పటికే ఆర్డర్ చేసిందని, ఈ ప్రాజెక్ట్‌తో లక్షల కొద్దీ ఉద్యోగవకాశాలు సృష్టిస్తామని చెప్పారు. కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖ ప్రకారం ఢిల్లీకి దగ్గరిలో గౌతమ్ బుద్ నగర్లో ఫుడ్ అండ్ హెర్బల్ పార్క్ కోసం ఈ ఏడాది జనవరిలోనే తొలి ఆమోదం వచ్చేసింది. కానీ దీనికి కావాల్సిన భూమి, బ్యాంకు రుణానికి సంబంధించిన పేపర్లను కంపెనీ సమర్పించాల్సి ఉంది. తమ షరతులను చేరుకోవడానికి పతంజలికి ఒక నెల పొడిగింపు ఇచ్చామని, ఒకవేళ పతంజలి తమ షరతులను అందుకోలేకపోతే, రద్దు చేయడమే తప్ప.. తమ దగ్గర మరే ఇతర అవకాశం లేదని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్ అధినేత జేపీ మీనా అన్నారు. ఈ నెల ఆఖరి వరకు కంపెనీకి సమయం ఉందన్నారు. -
సమీక్షలతో సరి!
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్, జూపాడుబంగ్లాలోని అల్ట్రా మెగా ఫుడ్ ప్రాజెక్టులకు నీటి వసతి కల్పిస్తామన్న ప్రభుత్వం సమీక్షలతోనే సరిపెడుతోంది. దీంతో జిల్లాను పరిశ్రమల హబ్‌గా మారుస్తామన్న సీఎం చంద్రబాబు హామీ మాటలకే పరిమితమవుతోంది. ఓర్వకల్, మిడుతూరు, గడివేముల, జూపాడుబంగ్లా మండలాల్లో పరిశ్రమల పేరుతో రైతుల నుంచి వేలాది ఎకరాల భూములను స్వాధీనం చేసుకున్నా ఉపయోగం లేకుండా పోతోంది. ఓర్వకల్‌లోని మెగా ఇండస్ట్రియల్ హబ్, జూపాడుబంగ్లాలోని అల్ట్రా మెగా ఫుడ్ ప్రాజెక్టు ఏర్పాటుకు చేయాలని నిర్ణయించినా మౌలిక వసతుల కల్పనలో పూర్తిగా వైఫల్యం చెందారు. దీంతో ఒక్క పరిశ్రమ ఏర్పాటు కాలేదు. వీడియో కాన్ఫరెన్స్‌లు,సమీక్షలతో మమ.. మెగా ఇండస్ట్రియల్ హబ్, అల్ట్రా మెగా ఫుడ్ పార్కులకు స్థానికంగా నీటి వసతి లేకపోవడంతో సమీపంలోని ముచ్చుమర్రి నుంచి నీళ్లను తీసుకు రావాలని ప్రభుత్వం నిర్ణయించింది. మూడేళ్ల క్రితం రూ.452 కోట్లతో 1.45 టీఎంసీ నీటిని తీసుకురావాలని అంచనా వేశారు. ఈ మేరకు ముచ్చుమర్రి నుంచి పైపులైన్ నిర్మాణం చేపట్టి ఓర్వకల్, జూపాడుబంగ్లా మండలాల్లో మినీ ప్రాజెక్టులు చేపట్టి నీటిని నింపాలని భావించారు. అయితే ఆ తరువాత ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. సీఎం చంద్రబాబు జిల్లా పర్యటన, వీడియో కాన్ఫరెన్స్, సమీక్షల్లో మాత్రం ఇండస్ట్రియల్ హబ్‌కు నీటి వసతిపై మాట్లాడుతున్నా ఇంతవరకు కనీసం డీపీఆర్ రూపొందించలేదు. ముందుకు రాని పారిశ్రమిక వేత్తలు.. పరిశ్రమల స్థాపనకు అతిముఖ్యమైనది నీటి వసతి. అయితే ఇక్కడ నీటి సమస్య ఉండడంతో పారిశ్రామికవేత్తలు పరిశ్రమల స్థాపనకు ఆసక్తి చూపడం లేదు. ఇప్పటి వరకు ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్‌లో పరిశ్రమ స్థాపనకు జైరాజ్ ఇస్పాత్ స్టీల్ కంపెనీ లిమిటెడ్ మాత్రమే వచ్చింది. అలాగే ఫుడ్ పార్కులో గుజరాత్ అంబుజా, జైన్ ఇరిగేషన్ ఫుడ్ పార్కులకు భూములు కేటాయించారు. ఇందులో మౌలిక వసతులు లేవని గుజరాత్ అంబుజా తన యూనిట్‌ను నెలకొల్పేందుకు ఆసక్తిని చూపడడంతో దానికి కేటాయించిన భూములను ఇటీవల ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పటికైనా ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించడం ద్వారా పరిశ్రమల స్థాపనకు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 1.45 టీఎంసీల నీటి కోసం అంచనా ముచ్చుమర్రి నుంచి ఇండస్ట్రియల్ హబ్, ఫుడ్‌పార్కులకు 1.45 టీఎంసీ నీటిని తెచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే రూ.452 కోట్లతో అంచనా వేశాం. డీపీఆర్ రూపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. త్వరలోనే అన్ని సమస్యలు సమసిపోయే అవకాశం ఉంది. – రఘునాథరెడ్డి, జోనల్ మేనేజర్, ఏపీఐఐసీ -
ఫుడ్‌పార్క్‌కు స్థలం కరువు
కందుకూరు : జిల్లాలో ప్రతిష్టాత్మక మెగా ఫుడ్‌పార్క్ నిర్మాణానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ భారీ ప్రాజెక్ట్‌కు అవసరమైన భూముల కోసం అధికారులు అన్వేషణలో ఉన్నారు. ఇప్పటికే నిమ్జ్, దొనకొండ పారిశ్రామికవాడ ఏర్పాటుకు అవసరమైన భూముల సేకరణలో అధికారులు తలమునకలై ఉన్నారు. ఇంతలో ఫుడ్‌పార్క్ నిర్మాణానికి కేంద్రం నుంచి ప్రతిపాదనలు రావడంతో అధికారులకు మరిన్ని ఇబ్బందులు వచ్చి పడ్డాయి. ఫుడ్‌పార్క్‌ను కందుకూరు ప్రాంతంలో ప్రతిపాదించడంతో ఇక్కడ భూముల కోసం రెవెన్యూ అధికారులు అన్వేషణ ప్రారంభించారు. రెండు నెలల నుంచి అదే పనిలో ఉన్నా భూమి వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. కందుకూరే బెటర్ ఫుడ్ పార్క్‌ను కందుకూరు ప్రాంతంలో నిర్మించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఆ మేరకు భూములు సేకరించాలని జిల్లా అధికారుల నుంచి స్థానిక ఆర్డీఓ మల్లికార్జునకు ఆదేశాలందాయి. మెగాఫుడ్ పార్కు నిర్మాణానికి దాదాపు 250 ఎకరాలు అవసరమని అంచనా వేస్తున్నారు. కందుకూరు ప్రాంతంలో ఒకే సర్వే నంబర్లో ఇంత భారీ స్థాయిలో భూమి లభ్యమయ్యే పరిస్థితి లేదు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఉన్న భూములను అధికారులు పరిశీలించారు. వాగుపోరంబోకు పరిశీలన ఇటీవల కందుకూరు పట్టణానికి సమీపంలో దివివారిపాలెం వద్ద సర్వే నంబర్ 1719/5లో ఉన్న వాగుపోరంబోకు భూమిని పరిశీలించారు. అక్కడ 220 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి ఇప్పటికే 25 ఎకరాలు కేటాయించారు. అదే సర్వే నంబర్లో మొత్తం 432 ఎకరాలకుపైగా వాగుపోరంబోకు భూములున్నాయి. ఇక్కడ చాలా ఏళ్ల నుంచే కొంతమంది రైతులు పొలాలు సాగు చేస్తున్నారు. కొందరు పట్టాలు కూడా తెచ్చుకున్నారు. దీన్ని ఫుడ్‌పార్క్‌కు అనువైన స్థలంగా నిర్ణయిస్తే ప్రభుత్వానికి రైతులది సమస్యగా మారనుంది. అదే సందర్బంలో వాగుపోరంబోకు భూములు కావడం వల్ల ఢీనోటిఫై చేయాల్సి ఉంటుంది. అధిక వర్షాలు పడితే వాగు వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం లేకపోలేదు. గుడ్లూరు మండలంలో మరోచోట 120 ఎకరాల ప్రభుత్వ భూమి కూడా పరిశీలనలో ఉంది. ఫుడ్‌పార్క్‌కు 250 ఎకరాలు అవసరం కావడంతో ఆ స్థలం అందుకు ఉపయోగపడే అవకాశం లేదు. మరోపక్క ఫుడ్‌పార్కు నిర్మాణం వల్ల ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయని, వ్యవసాయ ఉత్పత్తులకు అధిక ధరలు వస్తాయని ఈ ప్రాంత వాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వేధిస్తున్నసిబ్బంది కొరత అన్ని ప్రాజెక్టులకు ఒకేసారి భూములు సేకరించాల్సి ఉండటంతో సిబ్బంది కొరత ఏర్పడింది. ప్రధానంగా దొనకొండ పారిశ్రామిక హబ్ కోసం భూముల సేకరించేందుకు అవసరమైన సిబ్బంది అందుబాటులో లేరు. ప్రధానంగా సర్వేయర్లు, ఆర్ఐల కొరత అధికంగా ఉంది. అదే సందర్భంలో నిమ్జ్ కోసం భూముల కేటాయింపు వ్యవహారం రెవెన్యూ అధికారులకు తలనొప్పిగా మారింది. ఫుడ్‌పార్క్‌కు స్థలం ఎప్పుడు కేటాయిస్తారో తెలి యడం లేదు. అధికారులు ఏమాత్రం అలసత్వం చేసినా జిల్లాకు ప్రతిష్టాత్మకంగా మంజూరైన ప్రాజెక్టులు వెనక్కు వెళ్లే ప్రమాదం లేకపోలేదు. ఎప్పుడో మంజూరైన నిమ్జ్‌కే దిక్కులేదు యూపీఏ ప్రభుత్వ హయాంలో జిల్లాకు మంజూరై ప్రతిష్టాత్మక నిమ్జ్‌కు ఇప్పటి వరకు భూమి కేటాయించలేదు. దీని కోసం పామూరు-కందుకూరు రోడ్డులో దాదాపు 12,500 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ప్రస్తుతం ఈ భూముల కోసం అధికారుల ఆయా ప్రాంతాల్లో సర్వేలు చేస్తున్నారు. అటవీశాఖ భూములు, ప్రభుత్వ భూములు, రైతుల వద్ద ఉన్న భూములు సేకరించే పనిలో అధికారులు ఉన్నారు. దొనకొండ పారిశ్రామికవాడకు మొత్తం 25 వేల ఎకరాలు సేకరించాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 5 వేల ఎకరాల మాత్రమే సేకరించారని ఆర్డీఓ మల్లికార్జున పేర్కొన్నారు. -
రూ.250 కోట్లతో మెగా ఫుడ్ పార్కు
సాక్షి, విజయవాడ : జిల్లాలో మెగా ఫుడ్ పార్కు ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వశాఖ దేశవ్యాప్తంగా 17 మెగా ఫుడ్ పార్కులను ఏర్పాటు చేయాలని మంగళవారం నిర్ణయించింది. వీటిలో ఒకటి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించగా దాన్ని కృష్ణాజిల్లాలో నిర్మించాలని నిర్ణయించారు. ఈ ఫుడ్ పార్కు ఏర్పాటుకు కావాల్సిన ప్రణాళికలను ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) తయారుచేసి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పంపడంతో కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఫుడ్ పార్కు ఏర్పాటుకు రూ.250 కోట్ల వ్యయం... మెగా ఫుడ్ పార్కు ఏర్పాటుకు సుమారు రూ.250 కోట్ల వ్యయం అవుతుంది. ఇందులో కొంత భాగం కేంద్ర ప్రభుత్వం భరిస్తే మిగిలిన సగం రాష్ట్ర ప్రభుత్వం లేదా ప్రైవేటు సంస్థల నుంచి నిధులు సేకరిస్తారు. రాబోయే 30 నెలల్లో ఫుడ్‌పార్కు ఏర్పాటుకు కావాల్సిన మౌలిక సదుపాయాలన్నింటినీ కల్పిస్తారు. ఫుడ్ పార్కులో కనీసం 40 నుంచి 50 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తారు. కోల్డ్ స్టోరేజ్‌లు, గోదాములు ఏర్పాటు చేసే అవకాశముంది. ఫుడ్ పార్కును జిల్లాలో వెనుకబడిన తిరువూరులో ఏర్పాటు చేయాలని ఎంపీ కేశినేని నాని భావిస్తున్నారు. అక్కడ కాకపోతే మైలవరంలో ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఉపయోగాలివీ... రైతులు తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర వచ్చే వరకు ఫుడ్ పార్కులో ఉన్న గోదాముల్లో నిల్వ చేసుకోవచ్చు. పళ్లు, కూరగాయలు వంటి త్వరగా పాడైపోయే సరకుల్ని నిల్వ చేసుకునేందుకు కోల్డ్ స్టోరేజ్‌లను కూడా ఏర్పాటు చేస్తారు. పళ్లు, కూరగాయలు వంటి పంటలు దిగుబడి అధికంగా ఉన్నప్పుడు వాటి నుంచి జ్యూస్‌లు, ఇతర తినుబండారాలను తయారు చేయించుకుని విక్రయించుకునే సౌకర్యం ఫుడ్ పార్కులలో ఉంటుంది. కూరగాయలు, పండ్లను రైతులు కోసిన తరువాత వాటిని శుభ్రం చేసి, వివిధ సైజుల్లో గ్రేడింగ్ చేసే యంత్రాలను కూడా ఫుడ్ పార్కులలో ఏర్పాటు చేస్తారు. ఇందులో నాణ్యమైన సరకును చక్కగా ప్యాకింగ్ చేసి జాగ్రత్తగా విదేశాలకు ఎగుమతి చేసుకునే సౌకర్యం ఉంటుంది. రైతులకు తమ సరకు పాడైపోకముందే విక్రయించుకునేందుకు వీలుగా ఇక్కడే రిటైలర్లు, అంతర్జాతీయ మార్కెట్‌కు ఎగుమతి చేసే వ్యాపారులు కూడా ఫుడ్ పార్కులకు అనుబంధంగా పనిచేస్తూ ఉంటారు. జిల్లాలో తొలి ఫుడ్ పార్కు... గతంలో నూజివీడు వద్ద మామిడికాయలను ప్రాసెసింగ్ చేసేందుకు ఒక ఫుడ్ పార్కును ఏర్పాటు చేసినా అది కొద్దిరోజులకే మూలన పడింది. చిత్తూరు జిల్లాలో ఏర్పాటుచేసిన శ్రీని మెగా ఫుడ్ పార్కు ఆ ప్రాంత రైతులకు ఎంతో ఉపయుక్తంగా ఉంది. మెగా ఫుడ్‌పార్కు వల్ల రైతులకే కాకుండా వందలాది మంది నిరుద్యోగులకు ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కూడా లభించే అవకాశముంది. -
తెలంగాణలో మెగా ఫుడ్‌పార్క్
కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్‌శాఖ మంత్రి హర్‌సిమ్రత్‌కౌర్ బాదల్ సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రైతులకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్‌శాఖ మంత్రి హర్సిమ్రత్ కౌర్‌బాదల్ తెలిపారు. రానున్న రోజుల్లో తెలంగాణలో మెగా ఫుడ్‌పార్క్‌ను ఏర్పాటు చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. శుక్రవారం ఢిల్లీ పంచ్‌శీల్ భవన్‌లోని తన చాంబర్లో తెలంగాణ టీడీపీ నేతల ప్రతినిధి బృందంతో సమావే శమయ్యారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. ‘ కొత్తగా ఏర్పడిన రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రధాని మోదీ ఎంతో చేస్తున్నారు. దేశవ్యాప్తంగా 17 మెగాఫుడ్ పార్క్‌లు మంజూరు చేశాం. ఇప్పటికే దాదాపు 78 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు ముగ్గురు ఉన్నారు. అభ్యర్థుల దరఖాస్తులను మూడు కమిటీల ద్వారా స్క్రూటినీ చేసిన తర్వాత తుది జాబితాను సిద్ధం చేస్తాం. ప్రస్తుత ప్రతిపాదనల్లో కనీసం ఒక్క మెగాఫుడ్ పార్క్‌ను తెలంగాణకు కేటాయించేందుకు ప్రయత్నిస్తాం. లేదంటే వచ్చే నెలలో విడుదలయ్యే అదనపు నిధుల్లో మరికొన్ని మెగాఫుడ్పార్క్లను కేటాయిస్తాం’ అని పేర్కొన్నారు.