సాక్షి, అమరావతి: కృష్ణాజిల్లా మల్లవల్లి మెగాఫుడ్ పార్కును రానున్న మామిడి పళ్ల సీజన్ నాటికి అందుబాటులోకి తెచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ మౌలిక వసతుల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) ప్రణాళిక సిద్ధంచేసింది. ఇందులో భాగంగా.. ముడి పదార్థం నుంచి గుజ్జు, పండ్ల రసాలు తీసి ప్యాకింగ్ చేసి ఎగుమతి చేసుకునేలా భారీ సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్ (సీపీసీ)ను ఏర్పాటుచేసింది. మొత్తం 57.45 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన ఈ మెగా ఫుడ్ పార్కులో సుమారు రూ.16 కోట్లతో సీపీసీని ఏర్పాటుచేశారు. అన్ని రకాల పండ్ల రసాలు, పొడులు, నూకలు కావాల్సిన పరిమాణంలో ప్యాకింగ్, ఆహార నాణ్యతను పరిశీలించే ల్యాబ్‌లను ఈ సీపీసీలో నెలకొల్పారు.
దీని పనితీరుపై చేసిన ప్రయోగాలు విజయవంతమయ్యాయని.. మార్చి నెలాఖరు నాటికి ఈ యూనిట్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఏపీఐఐసీ చీఫ్ ఇంజనీర్ సీహెచ్‌ఎస్‌ఎస్ ప్రసాద్ ‘సాక్షి’కి తెలిపారు. ఈ ఫుడ్‌పార్క్ పనులను ఏపీఐఐసీ బృందం శనివారం తనిఖీ చేసింది. అలాగే, దీనిపక్కనే ఏపీఐఐసీ 42.55 ఎకరాల్లో మరో స్టేట్ ఫుడ్‌పార్క్‌ను ఏర్పాటుచేసింది. ఇక్కడ ఏర్పాటుచేసే యూనిట్లు కూడా ఈ సీపీసీ సౌకర్యాలను వినియోగించుకోవచ్చు. ఈ రెండు పార్కుల ద్వారా సుమారు రూ.260 కోట్ల పెట్టుబడులు, ఆరువేల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా.
సీపీసీ నిర్వహణకు టెండర్లు
ఈ సీపీసీ నిర్వహణను మూడేళ్లపాటు లీజుకిచ్చేందుకు ఆసక్తిగల సంస్థల నుంచి బిడ్లను కోరుతూ ఏపీఐఐసీ టెండర్లు పిలిచింది. ఫిబ్రవరి 15న మొదలయ్యే ఈ బిడ్ల దాఖలు కార్యక్రమం మార్చి 1తో పూర్తవుతుంది. గంటకు 6–10 టన్నుల గుజ్జు, కాన్‌సెంట్రేషన్ లైన్, 120 టన్నుల సామర్థ్యం ఉండే పండ్లను మగ్గబెట్టే (రైపెనింగ్) చాంబర్లు ఎనిమది, 3,000 టన్నుల శీతల గిడ్డంగి, 4,000 టన్నుల సరుకు నిల్వచేసే గిడ్డంగితో పాటు ల్యాబ్‌లు సీపీసీ పరిధిలోకి వస్తాయి. ఏటా 5 శాతం చొప్పున అద్దె పెంచనున్నట్లు నిబంధనల్లో స్పష్టంగా పేర్కొన్నామని ప్రసాద్ తెలిపారు.
త్వరలో రోడ్ షో
ఈ మెగా ఫుడ్‌పార్క్‌లోని సెంట్రల్ ప్రోసెసింగ్ సెంటర్ సౌకర్యాలను రైతులకు, పెట్టుబడిదారులకు తెలియజేయడానికి త్వరలోనే రోడ్ షో నిర్వహించనున్నట్లు ఏపీఐఐసీ ఎండీ రవీన్‌కుమార్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ముడి సరుకును తీసుకొచ్చి వారికి కావాల్సిన పరిమాణంలో శుద్ధిచేసిన ఉత్పత్తులను తీసుకువెళ్లేలా ఇందులో సౌకర్యాలు కల్పించామన్నారు. మామిడి, టమోటా, బొప్పాయి, జామ, అరటి పండ్లతో పాటు వివిధ ఆహార ధాన్యాలను ప్రాసెస్ చేసి ప్యాకింగ్ చేసి తీసుకెళ్లొచ్చన్నారు. ఇప్పటికే ఈ పార్క్‌లో యూనిట్లు ఏర్పాటుచేయడానికి కొన్ని సంస్థలు ముందుకొచ్చాయని, మరికొన్ని సంస్థలు చర్చలు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు.
సీపీసీలో వసతులివీ..
– గంటకు ఆరు టన్నుల టమోటా, 10 టన్నుల మామిడి, 5 టన్నుల బొప్పాయి, 6 టన్నుల జామ, 4 టన్నుల అరటి గుజ్జు లేదా రసం తీసే ఆస్పెటిక్ పల్ప్‌లైన్..
– 200 ఎంఎల్ సామర్థ్యం కలిగిన జ్యూస్ ప్యాకెట్లు స్ట్రాతో కలిపి గంటకు 7,500 ప్యాకింగ్ చేసే పూర్తిస్థాయి అటోమేటిక్ ఫిల్లింగ్, ప్యాకింగ్ లైన్..
– జొన్నలు, బియ్యం వంటి ఆహార ఉత్పత్తులను నిల్వచేసుకోవడానికి 4,000 టన్నుల సామర్థ్యంతో గిడ్డంగి..
– పండ్లు, కూరగాయల నిల్వకు 3,000 టన్నుల సామర్థ్యం ఉన్న శీతల గిడ్డంగి..
– మామిడి, అరటి, టమోటా వంటి పండ్లను మగ్గ పెట్టడానికి 960 టన్నుల సామర్థ్యం కలిగిన ఈసీఆర్‌సీ రైపెనింగ్ చాంబర్స్..
– సుగంధ ద్రవ్యాలు, పప్పులు, బియ్యం వంటి పొడులు, గ్రాన్యూల్స్‌ను 100 గ్రాముల నుంచి 2 కేజీలకు వరకు ప్యాకింగ్ చేసే యూనిట్లు..
– చిన్న ప్యాకెట్లు అయితే నిమిషానికి 50–70, పెద్దవి అయితే 25–30 ప్యాకెట్ల ప్యాకింగ్..
– ఈ అహార పదార్థాలను పరీక్షించడానికి ఎనలైటికల్ ల్యాబ్.
Comments
Please login to add a commentAdd a comment