mallavalli
-
తుది దశకు ‘మెగా ఫుడ్‌పార్కు’
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ మౌలిక వసతుల కల్పనసంస్థ (ఏపీఐఐసీ) ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా మల్లవల్లిలో ఏర్పాటు చేస్తున్న మెగా ఫుడ్ పార్కు పనులు తుదిదశకు చేరాయి. ఏప్రిల్ 15 కల్లా పనులు పూర్తిచేసి.. మామిడి సీజన్ ప్రారంభమయ్యే నాటికి కార్యకలాపాలు నిర్వహించేందుకు అధికా రులు సన్నాహాలు చేస్తున్నారు. బాపులపాడు మండలం మల్లవల్లిలో 100 ఎకరాలను ఫుడ్ పార్కుకు కేటాయించారు. ఈ ప్రాంతంలో ప్రధానంగా మామిడి, బొప్పాయి, జామ వంటి పండ్లతోటలు, టమా టా తదితర కూరగాయలు పెద్ద ఎత్తున సాగు చేస్తుం టారు. దీంతో వివిధ రకాల పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్ కోసం మెగా ఫుడ్‌పార్కులో రూ.86 కోట్లతో 7.48 ఎకరాల్లో కోర్ ప్రాసెసింగ్ సెంటర్ (సీపీసీ)ను పూర్తిస్థాయి వసతులతో నిర్మిస్తున్నారు. ఇందులో 960 టన్నుల సామర్థ్యంతో పండ్లను మగ్గ బెట్టడంతో పాటు గంటకు ఆరు నుంచి పది టన్నుల గుజ్జు, రసాలు తీయొచ్చు. బియ్యం, జొన్నలు వంటి ఆహార పదార్థాలనూ నిల్వ చేసుకునేందుకు వీలుగా 4 వేలటన్నుల సామర్థ్యం గల గిడ్డంగిని నిర్మించారు. పండ్లు, కూరగాయల నిల్వకు కూడా 3 వేల టన్నుల సామర్థ్యంతో శీతల గిడ్డంగి, ప్యాకింగ్ యూనిట్లు, ఆహార ఉత్పత్తుల నాణ్యత పరిశీలించేందుకు ఎనలై టికల్ ల్యాబ్ తదితర అన్ని అధునాతన వసతులు ఏర్పాటు చేశారు. ఇక్కడ రూ.260 కోట్లతో ఏర్పాటు చేస్తున్న రెండు మెగా ఫుడ్‌పార్కులు అందుబాటు లోకి వస్తే దాదాపు 6 వేలమందికి ఉపాధి లభిస్తుం దని అంచనా వేస్తున్నారు. పనితీరు, ఇక్కడి సౌకర్యా ల గురించి పెట్టుబడిదారులకు అవగాహన కల్పిం చేందుకు ఏపీఐఐసీ త్వరలో రోడ్ షోలు నిర్వహించబోతోంది. నేరుగా ఇక్కడకు సరుకు తీసుకువచ్చిన వారు.. కావాల్సిన విధంగా ప్రాసెస్ చేసుకొని, అవసరమైన పరిమాణంలో ప్యాకింగ్ చేసి, తీసుకెళ్లే సదుపాయాలు కల్పించినట్లు ఏపీఐఐసీ అధికారులు వివరించారు. చాలా సంస్థలు వస్తున్నాయ్.. ఏప్రిల్ 15కల్లా మెగా ఫుడ్ పార్కులో పనులు పూర్తి చేసి కార్యకలాపాలు మొదలుపెట్టేందుకు కృషి చేస్తున్నాం. ప్రస్తుతం ట్రయల్ రన్ నడుస్తోంది. ఇప్పటికే ప్రొడక్షన్, మార్కెటింగ్‌కు సంబంధించిన యూనిట్లు నెలకొల్పేందుకు చాలా సంస్థలు ఏపీఐఐసీని సంప్రదించాయి. – డి.శ్రీనివాసరావు, జోనల్ మేనేజర్, ఏపీఐఐసీ -
మార్చికి మల్లవల్లి ఫుడ్‌పార్క్
సాక్షి, అమరావతి: కృష్ణాజిల్లా మల్లవల్లి మెగాఫుడ్ పార్కును రానున్న మామిడి పళ్ల సీజన్ నాటికి అందుబాటులోకి తెచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ మౌలిక వసతుల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) ప్రణాళిక సిద్ధంచేసింది. ఇందులో భాగంగా.. ముడి పదార్థం నుంచి గుజ్జు, పండ్ల రసాలు తీసి ప్యాకింగ్ చేసి ఎగుమతి చేసుకునేలా భారీ సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్ (సీపీసీ)ను ఏర్పాటుచేసింది. మొత్తం 57.45 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన ఈ మెగా ఫుడ్ పార్కులో సుమారు రూ.16 కోట్లతో సీపీసీని ఏర్పాటుచేశారు. అన్ని రకాల పండ్ల రసాలు, పొడులు, నూకలు కావాల్సిన పరిమాణంలో ప్యాకింగ్, ఆహార నాణ్యతను పరిశీలించే ల్యాబ్‌లను ఈ సీపీసీలో నెలకొల్పారు. దీని పనితీరుపై చేసిన ప్రయోగాలు విజయవంతమయ్యాయని.. మార్చి నెలాఖరు నాటికి ఈ యూనిట్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఏపీఐఐసీ చీఫ్ ఇంజనీర్ సీహెచ్ఎస్ఎస్ ప్రసాద్ ‘సాక్షి’కి తెలిపారు. ఈ ఫుడ్‌పార్క్ పనులను ఏపీఐఐసీ బృందం శనివారం తనిఖీ చేసింది. అలాగే, దీనిపక్కనే ఏపీఐఐసీ 42.55 ఎకరాల్లో మరో స్టేట్ ఫుడ్‌పార్క్‌ను ఏర్పాటుచేసింది. ఇక్కడ ఏర్పాటుచేసే యూనిట్లు కూడా ఈ సీపీసీ సౌకర్యాలను వినియోగించుకోవచ్చు. ఈ రెండు పార్కుల ద్వారా సుమారు రూ.260 కోట్ల పెట్టుబడులు, ఆరువేల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. సీపీసీ నిర్వహణకు టెండర్లు ఈ సీపీసీ నిర్వహణను మూడేళ్లపాటు లీజుకిచ్చేందుకు ఆసక్తిగల సంస్థల నుంచి బిడ్లను కోరుతూ ఏపీఐఐసీ టెండర్లు పిలిచింది. ఫిబ్రవరి 15న మొదలయ్యే ఈ బిడ్ల దాఖలు కార్యక్రమం మార్చి 1తో పూర్తవుతుంది. గంటకు 6–10 టన్నుల గుజ్జు, కాన్సెంట్రేషన్ లైన్, 120 టన్నుల సామర్థ్యం ఉండే పండ్లను మగ్గబెట్టే (రైపెనింగ్) చాంబర్లు ఎనిమది, 3,000 టన్నుల శీతల గిడ్డంగి, 4,000 టన్నుల సరుకు నిల్వచేసే గిడ్డంగితో పాటు ల్యాబ్‌లు సీపీసీ పరిధిలోకి వస్తాయి. ఏటా 5 శాతం చొప్పున అద్దె పెంచనున్నట్లు నిబంధనల్లో స్పష్టంగా పేర్కొన్నామని ప్రసాద్ తెలిపారు. త్వరలో రోడ్ షో ఈ మెగా ఫుడ్‌పార్క్‌లోని సెంట్రల్ ప్రోసెసింగ్ సెంటర్ సౌకర్యాలను రైతులకు, పెట్టుబడిదారులకు తెలియజేయడానికి త్వరలోనే రోడ్ షో నిర్వహించనున్నట్లు ఏపీఐఐసీ ఎండీ రవీన్‌కుమార్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ముడి సరుకును తీసుకొచ్చి వారికి కావాల్సిన పరిమాణంలో శుద్ధిచేసిన ఉత్పత్తులను తీసుకువెళ్లేలా ఇందులో సౌకర్యాలు కల్పించామన్నారు. మామిడి, టమోటా, బొప్పాయి, జామ, అరటి పండ్లతో పాటు వివిధ ఆహార ధాన్యాలను ప్రాసెస్ చేసి ప్యాకింగ్ చేసి తీసుకెళ్లొచ్చన్నారు. ఇప్పటికే ఈ పార్క్‌లో యూనిట్లు ఏర్పాటుచేయడానికి కొన్ని సంస్థలు ముందుకొచ్చాయని, మరికొన్ని సంస్థలు చర్చలు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. సీపీసీలో వసతులివీ.. – గంటకు ఆరు టన్నుల టమోటా, 10 టన్నుల మామిడి, 5 టన్నుల బొప్పాయి, 6 టన్నుల జామ, 4 టన్నుల అరటి గుజ్జు లేదా రసం తీసే ఆస్పెటిక్ పల్ప్‌లైన్.. – 200 ఎంఎల్ సామర్థ్యం కలిగిన జ్యూస్ ప్యాకెట్లు స్ట్రాతో కలిపి గంటకు 7,500 ప్యాకింగ్ చేసే పూర్తిస్థాయి అటోమేటిక్ ఫిల్లింగ్, ప్యాకింగ్ లైన్.. – జొన్నలు, బియ్యం వంటి ఆహార ఉత్పత్తులను నిల్వచేసుకోవడానికి 4,000 టన్నుల సామర్థ్యంతో గిడ్డంగి.. – పండ్లు, కూరగాయల నిల్వకు 3,000 టన్నుల సామర్థ్యం ఉన్న శీతల గిడ్డంగి.. – మామిడి, అరటి, టమోటా వంటి పండ్లను మగ్గ పెట్టడానికి 960 టన్నుల సామర్థ్యం కలిగిన ఈసీఆర్‌సీ రైపెనింగ్ చాంబర్స్.. – సుగంధ ద్రవ్యాలు, పప్పులు, బియ్యం వంటి పొడులు, గ్రాన్యూల్స్‌ను 100 గ్రాముల నుంచి 2 కేజీలకు వరకు ప్యాకింగ్ చేసే యూనిట్లు.. – చిన్న ప్యాకెట్లు అయితే నిమిషానికి 50–70, పెద్దవి అయితే 25–30 ప్యాకెట్ల ప్యాకింగ్.. – ఈ అహార పదార్థాలను పరీక్షించడానికి ఎనలైటికల్ ల్యాబ్. -
మల్లవల్లిలో మెగా ఫుడ్‌పార్కు!
పరిశ్రమలకు మౌలిక వసతుల ఏర్పాట్లలో ఏపీఐఐసీ 42 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కు మల్లవల్లి (హనుమాన్‌జంక్షన్ రూరల్): బాపులపాడు మండలం మల్లవల్లిలో రీ సర్వే నెంబర్ 11లో ఉద్యాన నర్సరీ కింద ఉన్న 100 ఎకరాల భూముల్లో పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకు ఏపీఐఐసీ చర్యలు చేపట్టింది. మాస్టర్ ప్లాన్‌ను సైతం సిద్ధం చేసింది. తొలుత 57.45 ఎకరాల్లో మెగా ఫుడ్‌పార్కు, తరువాత మరో 42.55 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేస్తారు. ఫుడ్ పార్కు మాస్టర్ ప్లాన్ ఇదే.. మల్లవల్లిలోని ఉద్యాన నర్సరీలో 57.45 ఎకరాల్లో మెగా ఫుడ్ మాస్టర్ ప్లాన్‌లో సుమారు తొమ్మిది ఎకరాలు రోడ్ల నిర్మాణానికి, 30 ఎకరాలు ఫుడ్ ప్రొసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు, సీపీసీ యూనిట్లకు ఆరు ఎకరాల స్ధలాన్ని కేటాయించారు. పరిపాలన భవనం, శిక్షణా కేంద్రం, 33 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్, సురక్షిత మంచినీటి ట్యాంక్, షాపింగ్ కాంప్లెక్స్, వేబ్రిడ్జి, విశ్రాంతి భవనాలు వంటివి వస్తాయి. నీటి శుద్ధి విభాగం, టెట్రాప్యాకింగ్ ప్లాంట్, మిల్క్ చిల్లింగ్ ప్లాంట్, అనాలిటికల్ ల్యాబ్ వంటి వాటిని ఏపీఐఐసీ నిర్మించనుంది. మెగా ఫుడ్ పార్కులో మొత్తం 50 ఫుడ్ ప్రొసెసింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలనేది పథకం. నూజివీడు మండలం మీర్జాపురంలో ఎంఎన్కే రహాదారి నుంచి మల్లవల్లి మెగా ఫుడ్‌పార్కు వరకు 80 మీటర్లు వెడల్పుతో రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలను ఏపీఐఐసీ సిద్దం చేసింది.