కందుకూరు : జిల్లాలో ప్రతిష్టాత్మక మెగా ఫుడ్‌పార్క్ నిర్మాణానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ భారీ ప్రాజెక్ట్‌కు అవసరమైన భూముల కోసం అధికారులు అన్వేషణలో ఉన్నారు. ఇప్పటికే నిమ్జ్, దొనకొండ పారిశ్రామికవాడ ఏర్పాటుకు అవసరమైన భూముల సేకరణలో అధికారులు తలమునకలై ఉన్నారు. ఇంతలో ఫుడ్‌పార్క్ నిర్మాణానికి కేంద్రం నుంచి ప్రతిపాదనలు రావడంతో అధికారులకు మరిన్ని ఇబ్బందులు వచ్చి పడ్డాయి. ఫుడ్‌పార్క్‌ను కందుకూరు ప్రాంతంలో ప్రతిపాదించడంతో ఇక్కడ భూముల కోసం రెవెన్యూ అధికారులు అన్వేషణ ప్రారంభించారు. రెండు నెలల నుంచి అదే పనిలో ఉన్నా భూమి వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు.
కందుకూరే బెటర్
ఫుడ్ పార్క్‌ను కందుకూరు ప్రాంతంలో నిర్మించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఆ మేరకు భూములు సేకరించాలని జిల్లా అధికారుల నుంచి స్థానిక ఆర్డీఓ మల్లికార్జునకు ఆదేశాలందాయి. మెగాఫుడ్ పార్కు నిర్మాణానికి దాదాపు 250 ఎకరాలు అవసరమని అంచనా వేస్తున్నారు. కందుకూరు ప్రాంతంలో ఒకే సర్వే నంబర్‌లో ఇంత భారీ స్థాయిలో భూమి లభ్యమయ్యే పరిస్థితి లేదు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఉన్న భూములను అధికారులు పరిశీలించారు.
వాగుపోరంబోకు పరిశీలన
ఇటీవల కందుకూరు పట్టణానికి సమీపంలో దివివారిపాలెం వద్ద సర్వే నంబర్ 1719/5లో ఉన్న వాగుపోరంబోకు భూమిని పరిశీలించారు. అక్కడ 220 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి ఇప్పటికే 25 ఎకరాలు కేటాయించారు. అదే సర్వే నంబర్‌లో మొత్తం 432 ఎకరాలకుపైగా వాగుపోరంబోకు భూములున్నాయి. ఇక్కడ చాలా ఏళ్ల నుంచే కొంతమంది రైతులు పొలాలు సాగు చేస్తున్నారు. కొందరు పట్టాలు కూడా తెచ్చుకున్నారు. దీన్ని ఫుడ్‌పార్క్‌కు అనువైన స్థలంగా నిర్ణయిస్తే ప్రభుత్వానికి రైతులది సమస్యగా మారనుంది.
అదే సందర్బంలో వాగుపోరంబోకు భూములు కావడం వల్ల ఢీనోటిఫై చేయాల్సి ఉంటుంది. అధిక వర్షాలు పడితే వాగు వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం లేకపోలేదు. గుడ్లూరు మండలంలో మరోచోట 120 ఎకరాల ప్రభుత్వ భూమి కూడా పరిశీలనలో ఉంది. ఫుడ్‌పార్క్‌కు 250 ఎకరాలు అవసరం కావడంతో ఆ స్థలం అందుకు ఉపయోగపడే అవకాశం లేదు. మరోపక్క ఫుడ్‌పార్కు నిర్మాణం వల్ల ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయని, వ్యవసాయ ఉత్పత్తులకు అధిక ధరలు వస్తాయని ఈ ప్రాంత వాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
వేధిస్తున్నసిబ్బంది కొరత
అన్ని ప్రాజెక్టులకు ఒకేసారి భూములు సేకరించాల్సి ఉండటంతో సిబ్బంది కొరత ఏర్పడింది. ప్రధానంగా దొనకొండ పారిశ్రామిక హబ్ కోసం భూముల సేకరించేందుకు అవసరమైన సిబ్బంది అందుబాటులో లేరు. ప్రధానంగా సర్వేయర్లు, ఆర్‌ఐల కొరత అధికంగా ఉంది. అదే సందర్భంలో నిమ్జ్ కోసం భూముల కేటాయింపు వ్యవహారం రెవెన్యూ అధికారులకు తలనొప్పిగా మారింది. ఫుడ్‌పార్క్‌కు స్థలం ఎప్పుడు కేటాయిస్తారో తెలి యడం లేదు. అధికారులు ఏమాత్రం అలసత్వం చేసినా జిల్లాకు ప్రతిష్టాత్మకంగా మంజూరైన ప్రాజెక్టులు వెనక్కు వెళ్లే ప్రమాదం లేకపోలేదు.
ఎప్పుడో మంజూరైన నిమ్జ్‌కే దిక్కులేదు
యూపీఏ ప్రభుత్వ హయాంలో జిల్లాకు మంజూరై ప్రతిష్టాత్మక నిమ్జ్‌కు ఇప్పటి వరకు భూమి కేటాయించలేదు. దీని కోసం పామూరు-కందుకూరు రోడ్డులో దాదాపు 12,500 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ప్రస్తుతం ఈ భూముల కోసం అధికారుల ఆయా ప్రాంతాల్లో సర్వేలు చేస్తున్నారు. అటవీశాఖ భూములు, ప్రభుత్వ భూములు, రైతుల వద్ద ఉన్న భూములు సేకరించే పనిలో అధికారులు ఉన్నారు. దొనకొండ పారిశ్రామికవాడకు మొత్తం 25 వేల ఎకరాలు సేకరించాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 5 వేల ఎకరాల మాత్రమే సేకరించారని ఆర్డీఓ మల్లికార్జున పేర్కొన్నారు.
ఫుడ్‌పార్క్‌కు స్థలం కరువు
Published Sat, Aug 29 2015 2:53 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement