కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్, జూపాడుబంగ్లాలోని అల్ట్రా మెగా ఫుడ్ ప్రాజెక్టులకు నీటి వసతి కల్పిస్తామన్న ప్రభుత్వం సమీక్షలతోనే సరిపెడుతోంది. దీంతో జిల్లాను పరిశ్రమల హబ్‌గా మారుస్తామన్న సీఎం చంద్రబాబు హామీ మాటలకే పరిమితమవుతోంది. ఓర్వకల్, మిడుతూరు, గడివేముల, జూపాడుబంగ్లా మండలాల్లో పరిశ్రమల పేరుతో రైతుల నుంచి వేలాది ఎకరాల భూములను స్వాధీనం చేసుకున్నా ఉపయోగం లేకుండా పోతోంది. ఓర్వకల్‌లోని మెగా ఇండస్ట్రియల్ హబ్, జూపాడుబంగ్లాలోని అల్ట్రా మెగా ఫుడ్ ప్రాజెక్టు ఏర్పాటుకు చేయాలని నిర్ణయించినా మౌలిక వసతుల కల్పనలో పూర్తిగా వైఫల్యం చెందారు. దీంతో ఒక్క పరిశ్రమ ఏర్పాటు కాలేదు.
వీడియో కాన్ఫరెన్స్‌లు,సమీక్షలతో మమ..
మెగా ఇండస్ట్రియల్ హబ్, అల్ట్రా మెగా ఫుడ్ పార్కులకు స్థానికంగా నీటి వసతి లేకపోవడంతో సమీపంలోని ముచ్చుమర్రి నుంచి నీళ్లను తీసుకు రావాలని ప్రభుత్వం నిర్ణయించింది. మూడేళ్ల క్రితం రూ.452 కోట్లతో 1.45 టీఎంసీ నీటిని తీసుకురావాలని అంచనా వేశారు. ఈ మేరకు ముచ్చుమర్రి నుంచి పైపులైన్ నిర్మాణం చేపట్టి ఓర్వకల్, జూపాడుబంగ్లా మండలాల్లో మినీ ప్రాజెక్టులు చేపట్టి నీటిని నింపాలని భావించారు. అయితే ఆ తరువాత ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. సీఎం చంద్రబాబు జిల్లా పర్యటన, వీడియో కాన్ఫరెన్స్, సమీక్షల్లో మాత్రం ఇండస్ట్రియల్ హబ్‌కు నీటి వసతిపై మాట్లాడుతున్నా ఇంతవరకు కనీసం డీపీఆర్ రూపొందించలేదు.
ముందుకు రాని పారిశ్రమిక వేత్తలు..
పరిశ్రమల స్థాపనకు అతిముఖ్యమైనది నీటి వసతి. అయితే ఇక్కడ నీటి సమస్య ఉండడంతో పారిశ్రామికవేత్తలు పరిశ్రమల స్థాపనకు ఆసక్తి చూపడం లేదు. ఇప్పటి వరకు ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్‌లో పరిశ్రమ స్థాపనకు జైరాజ్ ఇస్పాత్ స్టీల్ కంపెనీ లిమిటెడ్ మాత్రమే వచ్చింది. అలాగే ఫుడ్ పార్కులో గుజరాత్ అంబుజా, జైన్ ఇరిగేషన్ ఫుడ్ పార్కులకు భూములు కేటాయించారు. ఇందులో మౌలిక వసతులు లేవని గుజరాత్ అంబుజా తన యూనిట్‌ను నెలకొల్పేందుకు ఆసక్తిని చూపడడంతో దానికి కేటాయించిన భూములను ఇటీవల ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పటికైనా ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించడం ద్వారా పరిశ్రమల స్థాపనకు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
1.45 టీఎంసీల నీటి కోసం అంచనా
ముచ్చుమర్రి నుంచి ఇండస్ట్రియల్ హబ్, ఫుడ్‌పార్కులకు 1.45 టీఎంసీ నీటిని తెచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే రూ.452 కోట్లతో అంచనా వేశాం. డీపీఆర్ రూపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. త్వరలోనే అన్ని సమస్యలు సమసిపోయే అవకాశం ఉంది. – రఘునాథరెడ్డి, జోనల్ మేనేజర్, ఏపీఐఐసీ
Comments
Please login to add a commentAdd a comment