సామాన్యుడిపై ప్రతీకారమా?
బడ్జెట్‌పై చర్చలో కేంద్రంపై టీఆర్ఎస్ ఎంపీ కవిత ధ్వజం
తెలంగాణకు మెగా పవర్ ప్రాజెక్టు, బొగ్గుక్షేత్రాలివ్వాలన్న ఎంపీ
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో సామాన్యుడిని విస్మరించి కార్పొరేట్ రంగానికి పెద్దపీట వేయడంపై టీఆర్ఎస్ ఎంపీ కవిత మండిపడ్డారు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆమ్ ఆద్మీ పార్టీని ద్వేషిస్తోందంటే అర్థం చేసుకోగలనుగానీ ‘ఆమ్ ఆద్మీ’పై ప్రతీకారం ఎందుకు తీర్చుకోవాలనుకుంటోందని ప్రశ్నించారు. సోమవారం లోక్‌సభలో కేంద్ర సాధారణ బడ్జెట్‌పై జరిగిన చర్చలో ఆమె మాట్లాడారు. ‘ఈ బడ్జెట్లో విజన్ ఉన్నా అది కార్పొరేట్ రంగంతోనే ప్రారంభమై ఆ రంగంతోనే ముగిసింది. కార్పొరేట్ రంగానికి పెద్ద పీట వేసే క్రమంలో ప్రభుత్వం సామాన్యుడి ఆకాంక్షలను విస్మరించింది. కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు, జనరల్ యాంటీ అవాయ్‌డెన్స్ రూల్ (జీఏఏఆర్) అమలు వాయిదా, నియంత్రణల సడలింపు వంటి తాయిలాలన్నీ కార్పొరేట్లకే వర్తిస్తాయి. కానీ సామాన్యుడికి దక్కిందేమిటి? 8 కేంద్ర పథకాలను రద్దు చేయడం, 11 ముఖ్యమైన కేంద్ర పథకాల్లో కేంద్ర వాటా తగ్గడం వంటివి సామాన్యుడిపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ప్రాథమిక విద్యకు 75 శాతం, సెకండరీ విద్యలో 30 శాతం, ఉన్నత విద్యలో 50 శాతం చొప్పున నిధుల్లో కోత పెట్టారు. ముఖ్యంగా చిన్నారుల పౌష్టికాహార లోపాలను సరిదిద్దేందుకు, శిశు మరణాలను తగ్గించేందుకు చక్కగా పనిచేసిన ఐసీడీఎస్‌కు నిధుల కేటాయింపులో 55 శాతం కోత విధించారు.
అలాగే స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు 55 శాతం మేర నిధులు తగ్గించారు. గత బడ్జెట్లో ఆరోగ్యానికి జీడీపీలో 1.32 శాతం కేటాయిస్తే ఇప్పుడు దానిని 1 శాతానికి తగ్గించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న నేతలంతా ఎన్నికలప్పుడు జై జవాన్, జై కిసాన్ నినాదాన్ని భుజాన వేసుకున్నారు కానీ ఇప్పుడు రాష్ట్రీయ కృషి వికాస యోజన (ఆర్కేవీవై)కు 55 శాతం మేర నిధులు తగ్గించారు. కృషి సించాయి యోజనకు 62 శాతం నిధులు తగ్గించారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం ఉన్న ఏఐబీపీ పథకానికి ఏకంగా 83 శాతం, గ్రామీణ తాగునీటికి 77 శాతం మేర నిధులు తగ్గించారు. ఇవన్నీ పేదలు, మహిళలు, రైతు వ్యతిరేక చర్యలే’ అని కవిత దుయ్యబట్టారు.
మెగా విద్యుత్ ప్రాజెక్టు కేటాయించాలి: దేశవ్యాప్తంగా ఐదు అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టులను నిర్మించతలపెట్టిన కేంద్రం వాటిలో ఒకటి తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాలని కవిత కోరారు. అలాగే కరెంటు కష్టాల నుంచి గట్టేం దుకు వీలుగా సింగరేణికి బొగ్గు క్షేత్రాలను కేటాయించాలని, పన్ను ప్రోత్సాహకాలను ఐదేళ్ల నుంచి పదేళ్లకు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు.